Balineni Issue : నిన్నటి నుంచి CMO లోనే బాలినేని.. హుటాహుటిన తాడేపల్లికి ఒంగోలు ఎస్పీ.. ఇప్పుడిదే చర్చ!
ABN , First Publish Date - 2023-10-20T15:02:55+05:30 IST
ఏపీలో పెను సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ఏపీలో పెను సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ భూ కుంభకోణంపై జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన ఒంగోలు నుంచి తాడేపల్లికి ఎస్పీ బయల్దేరి వెళ్లారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలతో రావాలని ఎస్పీకి ఆదేశాలు వెళ్లాయి. దీంతో భూకుంభకోణం తాలుకూ దస్త్రాలతో సీఎంవోకు వెళ్లారు. ఇప్పటికే సిట్ (SIT) దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ రెండు విషయాలపైనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం నాడు సీఎంవోకు వెళ్లారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి జిల్లా ఎస్పీ, కలెక్టర్ బదిలీ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. అయితే.. ఎస్పీ బదిలీ కుదరదని సీఎంవో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తాడేపల్లి నుంచి ఎస్పీకి పిలుపు రావడంతో ఏం జరగబోతోంది..? బదిలీ చేస్తారా..? లేకుంటే క్లాస్ తీసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాలినేని వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
అసలేం జరిగింది..?
నకిలీ డాక్యుమెంట్ల కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను చెప్పినట్టు పోలీసులు వ్యవహరించలేదని, నిందితుల్ని అదుపులోనికి తీసుకోలేదని.. ఖాకీల తీరును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం గన్‌మెన్లను బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni SrinivasaReddy) సరెండర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయ్యింది. మరోవైపు.. ఒంగోలు భూ కుంభకోణంపైనా బాలినేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు కుంభకోణాలు, గన్‌మెన్ల తిరస్కరించడంపై సీఎంవో నుంచి పిలుపు రావడంతో బాలినేని వెళ్లగా.. సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డితో నిశితంగా చర్చిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
నా జీవితంలో ఎప్పుడూ..?
తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభను ఎప్పుడూ అనుభవించలేదని.. ఎమ్మెల్యేకి తెలియకుండానే భూకబ్జా జరుగుతుందా? అని ప్రజలు అనుమానిస్తున్నారని ధనుంజయ్ రెడ్డికి బాలినేని చెప్పారు. భూకబ్జా దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోమని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిస్పాక్షికంగా వ్యవహరించాలని కలెక్టర్ , ఎస్‌పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలులో భూకబ్జా పూర్వపరాలను ధనుంజయ్ రెడ్డికి బాలినేని వివరించారు. మరోవైపు.. నకిలీ డాక్యుమెంట్ల దర్యాప్తును నిష్పక్షపాతంగా చేపట్టాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు బాలినేని సూచించారు. అంతేకాదు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లోతుగా దర్యాప్తు చేయాలని ఎస్పీ అధికారులను.. ఉన్నతాధికారులు ఆదేశించారు.