Ponguleti Meets Sharmila: ఇదెక్కడి ట్విస్ట్.. షర్మిలతో పొంగులేటి భేటీపై ఓ ఇంట్రస్టింగ్ ముచ్చట..!
ABN , First Publish Date - 2023-01-25T20:06:29+05:30 IST
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం సభతో మొదలుకుని నిన్నమొన్న జరిగిన కేసీఆర్ బీఆర్‌ఎస్ సభ వరకూ కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం సభతో మొదలుకుని నిన్నమొన్న జరిగిన కేసీఆర్ బీఆర్‌ఎస్ సభ వరకూ కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా వేస్తున్న అడుగులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ ఇద్దరి భేటీ జరిగినట్లు సమాచారం. అయితే.. ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఖమ్మం మాజీ ఎంపీ గురించి షర్మిల వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఇద్దరూ సమావేశమైనట్లు వార్తలు రావడం కొసమెరుపు. పొంగులేటి మీ పార్టీలో చేరే అవకాశం ఉందా అని షర్మిలను మీడియా ప్రతినిధి అడగగా.. ‘పొంగులేటి శ్రీనివాస్ గారి పునాది ఏమిటి..? ఆయన బేస్ ఏమిటి..? ఆయన ఎక్కడ నుంచి పైకొచ్చారు..? రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ అనే పేరుతో పైకొచ్చిన వాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలాంటప్పుడు ఏ మనిషికైనా కృతజ్ఞతా భావం ఉండాలి. ఉందనే నేను అనుకుంటున్నా’ అని షర్మిల సమాధానమిచ్చారు. ‘వైఎస్సార్‌టీపీలోకి రాకపోతే కృతజ్ఞతా భావం లేనట్టా ?’ అని ఆమెను అడగగా ‘అంతేకదా’ అని బదులిచ్చారు.
షర్మిల ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిలను కలిసినట్లుగా వార్తలొచ్చాయి. వాస్తవానికి.. వైఎస్ కుటుంబానికి పొంగులేటి మొదటి నుంచి విధేయుడిగానే ఉన్నారు. గతేడాది జరిగిన పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా వైఎస్ షర్మిల హాజరయ్యారు. షర్మిలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా పొంగులేటి పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. వైఎస్ షర్మిలతో మొదటి నుంచి పొంగులేటికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే.. షర్మిలను కలిసి ట్విస్ట్ ఇస్తారని తెలంగాణ రాజకీయ వర్గాలు అస్సలు ఊహించలేదు. అందుకు కారణం లేకపోలేదు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘కారు’ దిగిపోనున్నారని, బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నారని.. సంక్రాంతి తర్వాత పార్టీ మారనున్నారని.. కాషాయ కండువా కప్పుకోనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా పొంగులేటి, షర్మిల భేటీ వార్తలు రావడంతో తెలంగాణ రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పొంగులేటిని వైఎస్సార్‌టీపీలోకి షర్మిల ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ పరిణామంతో అమిత్‌షాతో భేటీ అయి బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్న పొంగులేటి పునరాలోచనలో పడినట్లు సమాచారం. పైగా.. సోమవారం జరిగిన ఇల్లెందు ఆత్మీయ సమ్మేళనంలో ‘ఏ గూటి పక్షులు ఆగూటికే చేరుతాయి’ అని పొంగులేటి చేసిన వ్యాఖ్య ‘షర్మిల పార్టీలోకి పొంగులేటి’ అనే వార్తలకు బలం చేకూర్చింది. ఈ వ్యాఖ్య చేసిన మరుసటి రోజే షర్మిలతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ను వీడబోతున్న పొంగులేటి బీజేపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఆయన పార్టీ మార్పుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరాతారా? అన్న ఊహాగానాల మధ్య పొంగులేటి షర్మిలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్టు షర్మిల ఇప్పటికే ప్రకటించగా.. ఈ భేటీ క్రమంలో పొంగులేటి షర్మిలకు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పొంగులేటి బీఆర్ఎస్ అధిష్ఠానం ముందుంచిన ప్రతిపాదన ప్రకారం ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి తాను పోటీ చేస్తానని.. పినపాక- పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి- మట్టా దయానంద్, వైరా, అశ్వారావుపేటలో తన అనుచరుల్లో ఒకరికి, ఇల్లెందు సీటు కోరం కనకయ్యకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనిపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం స్పందించకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ఈ క్రమంలో పొంగులేటి వస్తే పార్టీ బలోపేతం కావడంతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. కొంతకాలం క్రితం పొంగులేటి తన కుమార్తె వివాహన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు వెళ్లడంతో పాటు అక్కడ భవిష్యత్ రాజకీయ చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ మంతనాలు ఇప్పుడు ఫలిస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. బాలిలో బీజేపీ ముఖ్య నేతలతో పొంగులేటి భేటీ అయ్యారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి తర్వాత పార్టీ మారడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలతో పొంగులేటి భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్‌లో, పొంగులేటి సస్పెన్స్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ అనే చెప్పక తప్పదు.