Fact Check: జూనియర్ ఎన్టీఆర్‌తో చంద్రబాబు భేటీ వార్తలు పుకార్లేనా.. నిజముందా అంటే మాత్రం..

ABN , First Publish Date - 2023-01-07T18:08:01+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో..

Fact Check: జూనియర్ ఎన్టీఆర్‌తో చంద్రబాబు భేటీ వార్తలు పుకార్లేనా.. నిజముందా అంటే మాత్రం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Telugu States Elections) ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ (KCR), ఏపీలో జగన్ (Jagan) ముందస్తుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా ఏపీ రాజకీయాలపై (AP Politics) రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా.. అలా హల్‌చల్ చేస్తున్న పొలిటికల్ గాసిప్ (Political Gossip) ఏదైనా ఉందంటే.. అది జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు భేటీ (Jr ntr Chandra Babu Meeting Speculations) ప్రచారమేనని చెప్పక తప్పదు. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మీట్ అవ్వనున్నారని గత 24 గంటలుగా సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. జనవరి 10న హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుందని వేదికను కూడా ఈ ప్రచారం చేసిన వాళ్లే డిసైడ్ చేశారు. అటు చంద్రబాబు గానీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఏ ఒక్కరూ తాము భేటీ కాబోతున్నట్లు ప్రకటించలేదు. టీడీపీ (TDP) నుంచి మీడియాకు కూడా ఎలాంటి లీకులూ అందలేదు. కానీ.. ఎవరు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారో తెలియదు గానీ వైరల్ (Viral) చేయడంలో మాత్రం సఫలీకృతులయ్యారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరుగొస్తుందనే మాటను నిజం చేశారు.

చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ భేటీ వార్తలపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రయత్నం చేయగా.. తెలిసిందేంటంటే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. టీడీపీని బలహీనపరిచే కుట్రలో భాగంగా సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రచారానికి ప్రత్యర్థి పార్టీ తెరలేపినట్లు తెలిసింది. పకడ్బందీగా పన్నిన ఈ ఫేక్ ప్రచార వ్యూహం వెనుక పెద్ద కథే ఉన్నట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర జనవరి 27 నుంచి మొదలుకానుండటంతో ఆయన ఇమేజ్‌ను తగ్గించి చూపే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రచారానికి తెరలేపినట్లు తేలింది. అంతేకాదు.. వైసీపీ సోషల్ మీడియా అనుకూల పేజీలు, వెబ్‌సైట్లలో ఈ పొలిటికల్ గాసిప్‌ను విపరీతంగా ప్రచారం చేయడం, చేస్తూనే ఉండటం గమనార్హం. నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ మద్దతు కోరేందుకు చంద్రబాబు సమావేశం కానున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే.. ఇదంతా ఒట్టి ఫేక్ ప్రచారం అని తేలిపోయింది. ఈ వైరల్ ప్రచారంలో చెబుతున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ అసలు జనవరి 10వ తేదీన మన దేశంలోనే ఉండటం లేదు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో సహా అమెరికాలో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023 ఫంక్షన్‌కు జనవరి 11న జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. ఆలోపు హైదరాబాద్ వచ్చి వెళ్లే అవకాశం లేదు. కానీ.. ఇవేవీ తెలసుకోకుండానే చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ జనవరి 10న భేటీ కాబోతున్నారని ఒక పుకారు సృష్టించి వైరల్ చేశారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణ లోకేష్ పాదయాత్రకు కూడా లభిస్తే రాజకీయంగా నష్టం తప్పదని భావించిన వైసీపీ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీలో ఏదో జరుగుతోందన్న భ్రమను ప్రజల్లో కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండటం కొసమెరుపు. అందులో భాగంగానే.. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు సమావేశం అనే ప్రచారానికి తెరలేపారు. అయితే.. ఏపీలో గతంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున కాలికి బలపం కట్టుకున్న రీతిలో ప్రచారం చేశారు. ఆ సమయంలో కారు ప్రమాదం కూడా జరిగింది. బెడ్‌పై ఉండి కూడా వీడియోల ద్వారా టీడీపీ తరపున ప్రచారం చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం ముగిసే చివరి నిమిషం వరకూ అభ్యర్థించారు.

అంతలా టీడీపీ కోసం కష్టపడిన జూనియర్ ఎన్టీఆర్‌పై తన మిత్రుడైన కొడాలి నాని పార్టీ మారిన సందర్భంలో కూడా రూమర్లు వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. తన చివరి రక్తపు బొట్టు వరకూ తెలుగు దేశం పార్టీ కోసమే పనిచేస్తానని మీడియా ముఖంగా జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీకి దూరమవుతున్నాడని ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యర్థి పార్టీలు ఫేక్ ప్రచారానికి తెర లేపడం పరిపాటిగా మారింది. ఏదేమైనా.. వచ్చే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవుతాడో, లేక సినిమాలు చేసుకుంటూ ముందుకెళతాడో కాలమే నిర్ణయించాలి.

Updated Date - 2023-01-07T18:11:10+05:30 IST