Pawan Anna lezhneva : ఉంటే ఉంటా.. పోతే పోతా.. భార్యకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్.. భావోద్వేగం!
ABN , First Publish Date - 2023-07-11T21:42:23+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) ఎమోషనల్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వారాహి’ యాత్రతో బిజిబిజీగా ఉన్న సేనాని.. దెందులూరు నియోజకవర్గం నేతలు, వీర మహిళలతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన భార్య అన్నా లెజినోవా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) ఎమోషనల్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వారాహి’ యాత్రతో బిజిబిజీగా ఉన్న సేనాని.. దెందులూరు నియోజకవర్గం నేతలు, వీర మహిళలతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva), పిల్లల గురించి మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో పాల్గొన్న అందరూ ఎమోషన్ అయ్యారు. ‘నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మాట సరదాకు చెప్పడం లేదు. ప్రతి రోజు నేను ఇంట్లో నుంచి వస్తే.. తిరిగి ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలియడం లేదు. నా బాధ అంతా ప్రజల గురించే’ అని పవన్ బాధపడ్డారు.
ఎమోషనల్ ఎందుకయ్యారంటే..?
ఈ సందర్భంగా వైసీపీ నేతల విమర్శలు, వలంటీవర్ వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చింది. ‘నాపై రాజకీయ విమర్శలు (వైసీపీ నేతలు) చేస్తున్నవారు అన్యాయంగా నా భార్యను కూడా ఇందులోకి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో నా భార్య కూడా బాధ పడింది. అసలీ గొడవల్లోకి నన్నెందుకు తీసుకొచ్చారు..? అని నా భార్య ప్రశ్నిస్తూ.. ఏడ్చింది. ఇది మన దౌర్భాగ్యం. నన్ను క్షమించండి.. అని నా భార్యను కోరాను. ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా రావణాసురుడు పట్టుకొచ్చాడని, నా భార్యను కూడా అందుకే రాజకీయ విమర్శల్లోకి లాగారు. నేను ఒక విప్లవకారుడుని. మార్పు తప్ప ఇంకే ఆశ నాకు లేదు. ఫైట్ చేయాల్సిందేనని నేను డిసైడ్ అయ్యాను. అది కష్టం అని తెలుసు.. నాకూ పిల్లలు ఉన్నారు.. కానీ పోరాడేందుకు సిద్ధమయ్యాను. ప్రజల బాధ్యత తీసుకున్నాను. వెనక్కి రాలేనని నా భార్యతో చెప్పాను. ఇక.. తప్పదు నేను వెళ్లాల్సిందేనని నా భార్యతో చెప్పా. ఉంటే ఉంటా పోతే పోతా.. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించు అని మరోసారి నా భార్యకు చెప్పాను. అంతకు మించి నేను నా భార్యని ఏమీ అడగలేదు.. ఇదొక్కటే అడిగాను. అలా చెప్పినప్పుడు నా భార్య ఏడ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఏడుస్తుంది. జగన్ గారి ఫ్యామిలీని మనం ఏమీ అనకూడదు. వాళ్ల మేడమ్‌ని మేడమ్ అనే అనాలి.. వాళ్లు మాత్రం మనల్ని ఏమైనా అనొచ్చు. ఇది మన సంస్కారం. నా తల్లి కూడా ఓ సందర్భంలో బాధపడింది.. నీ బిడ్డను దేశం కోసం బలిచ్చానని అనుకోమ్మా అని చెప్పాను. ఇదంతా మీకు (సభకు హాజరైనవారు) ఎందుకు చెప్తున్నానంటే.. ఇప్పుడైనా మీరు మేల్కొనకపోతే మీ భవిష్యత్‌కే నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ మాటలు విన్న సభికులు భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా సాగిన సభ.. ఒక్కసారిగా మూగబోయినట్లయ్యింది.
మరోసారి ఇలా..!
మళ్లీ చెబుతున్నా.. తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాల పైనే ద్వేషమన్నారు. ‘ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు. విషయాన్ని పక్కదోవ పట్టించవద్దు. వాలంటీర్లు వ్యవస్థ చిన్న తొండగా మొదలై ఊసరవెల్లిగా మారిపోయింది. ప్రజలను నియంత్రించి, భయపెట్టే స్థాయికి వెళ్లిపోయింది. ఏ మనిషికైనా డబ్బు కంటే ఎదుట వ్యక్తిని లొంగదీసుకోవడంలో ఆనందం ఉంటుంది. జగన్ దీనిమీదే ఆడుతున్నాడు. పులికి రక్తం మరిగించాడు. అది మనల్ని చంపే వరకు ఆగదు. వాలంటీర్లు తిప్పి కొడితే 6 లక్షల మంది ఉంటారు. ప్రజలు దాదాపు 6 కోట్ల మంది ఉంటారు. బ్రిటీష్ వాడు 5 వేల మందితో మొదట మనదేశాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. మన దేశపు ఏజెంట్లతోనే మనల్ని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు 6 కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి జగన్ లక్షల మంది వాలంటీర్లను ఉపయోగిస్తున్నాడు. దీనిని ఎదుర్కోవడానికి ప్రజలు విజ్ఞానవంతులు కావాలి. ఏం నష్టపోతున్నామో అర్ధం చేసుకోవాలి. మనం చెబుతున్న కీలకమైన విషయాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజలకు అసలు విషయం అర్ధం కాకుండా చేయడానికి అధికారపార్టీ ఆధ్వర్యంలో నాటకం మొదలైంది. డిబేట్‌ను పక్కదారి పట్టించడానికి వైసీపీ నాయకులు నన్ను వ్యక్తిగతంగా తిట్టినా మీరు పట్టించుకోవద్దు. వాళ్ల ట్రాప్ లో అసలు పడొద్దు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలి. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతుందో తెలియజెప్పే బాధ్యత మనపై ఉంది’ అని మరోసారి వలంటీర్ వ్యవస్థపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.