Karnataka Elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ.. ఇలా ఎందుకు జరుగుతుందబ్బా..!

ABN , First Publish Date - 2023-02-28T09:36:49+05:30 IST

శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందే రాష్ట్రంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ కృతనిశ్చయంతో..

Karnataka Elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ.. ఇలా ఎందుకు జరుగుతుందబ్బా..!

* ఓట్లు చీలకుండా కాంగ్రెస్ కసరత్తు

* ఓట్లెక్కువ.. సీట్లు తక్కువపై అప్రమత్తం

* గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్థితి

* ఈసారి పొత్తులపై దృష్టి సారించిన నేతలు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ (Karnataka Assembly Elections) విడుదల కాకముందే కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ వేడి (Karnataka Politics) భగ్గుమంటోంది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ (Karnataka BJP) కృతనిశ్చయంతో రకరకాల వ్యూహాలతో ముందుకు సాగుతుండగా గతంలో సంభవించిన ఎదురుదెబ్బలను ఆత్మావలోకనం చేసుకుంటూ కాంగ్రెస్‌ (Congress) పూర్వవైభవం సాధించే కసరత్తులో నిమగ్నమైంది. 2004 నుంచి జరిగిన నాలుగు సార్వత్రిక ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్‌ అత్యధికంగా ఓట్లను సాధించినప్పటికీ వాటిని సీట్ల రూపంలో మలచుకునే విషయంలో చతికిలపడింది. ఓట్లు చీలిపోవడం వల్లే చాలా తక్కువ తేడాతో పలు చోట్ల ఓటమి చవిచూశామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏకాభిప్రాయం కల్గిన చిన్న చిన్న పార్టీలతో ఈసారి పొత్తులు లేదా అవగాహన కుదుర్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా కేపీసీసీ ఒక సమీక్ష నిర్వహించింది. ఇలా పొత్తులు కుదుర్చుకుంటే ఓట్లతోపాటు సీట్లు కూడా పెంచుకోవచ్చునని సమీక్షలో తేలినట్టు సమాచారం.

2004 నుంచి అదే పరిస్థితి..

2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ 35.27 శాతం ఓట్లను దక్కించుకోగలిగినా కేవలం 65 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. 28.33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 79 నియోజకవర్గాల్లో గెలుపొందడం గమనార్హం. ఇక 20.77 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్‌ ఏకంగా 58 నియోజకవర్గాలను కైవసం చేసుకోగలిగింది. 2008 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లశాతం కొద్దిగా తగ్గింది. 34.76 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ కొద్దిగా పుంజుకుని 33.86 శాతం ఓట్లు పొందింది. జేడీఎస్‌ ఓట్ల శాతం కూడా 18.96 శాతానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ షరా మామూలే అన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. అయితే కాలక్రమంలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాల దెబ్బకు తట్టుకోలేకపోయింది.

2013 శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ కొద్దిగా పుంజుకుని 36.59 శాతం ఓట్లను చేజిక్కించుకుంది. కాగా బీజేపీ తన బలాన్ని మరింతగా ఎంచుకుని పెంచుకుని 38.04 శాతం ఓట్లు సాధించింది. ఓట్ల విషయానికి వస్తే జేడీఎస్‌ కూడా కొద్దిగా మెరుగు పరుచుకుని 19.89శాతం ఓట్లు సాధించింది. 2018 శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ 38.08 శాతం ఓట్లు సాధించి 78 నియోజకవర్గాలను మాత్రమే గెలుపొందగా అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే తక్కువు ఓట్లు అంటే 36.22శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఏకంగా 104 నియోజకవర్గాలలో విజయకేతనం ఎగురవేసింది.

జేడీఎస్‌ ఓట్ల శాతం కూడా కొద్దిగా తగ్గి 18.36 శాతానికి చేరుకుంది. 37 నియోజకవర్గాల్లో సత్తా చాటుకుంది. ఈ నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లశాతం పెరిగినా కాంగ్రె్‌సకు ఆశించినన్ని సీట్లు రాకపోవడానికి గల కారణాలు ఏమైనప్పటికీ సంప్రదాయబద్ధంగా తమకు పడే ఓట్లలో చీలిక సంభవించడమే కారణమని ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో మస్కి, కుందగోళ, హిరేకెరూరు. పావగడ నియోకవర్గాల్లో 500 ఓట్ల తేడాతోనే ఓటమిని మూట గట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక వెయ్యి ఓట్ల తేడాతో డజనకుపైగా నియోజక వర్గాలు, 2వేలకు పైగా ఓట్ల తేడాతో 15కు పైగా నియోజకవర్గాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు.

ఈసారి శాసనసభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితికి తావులేకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామన్నారు. 15వ శాసనసభ ప్రారంభంలో బీజేపీకి 104 మంది సభ్యులు ఉండగా కాంగ్రె్‌సకు 78 మంది సభ్యులు, జేడీఎస్‌కు 37 మంది, బీఎస్పీకి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్‌లు ఉండగా సభ అవధి ముగియనున్న తరుణంలో ఆపరేషన్‌ కమల, ఫిరాయింపుల కారణంగా సమీకరణలు మారి బీజేపీ బలం 131గాను, కాంగ్రెస్‌ 67గాను, జేడీఎస్‌ 36గాను ఉన్నాయి.

Updated Date - 2023-02-28T10:28:51+05:30 IST