BRS List 2023: దళితులకు సీఎం పదవి ఇవ్వరు సరే.. కనీసం ఎక్కువ సీట్లు కూడా ఇవ్వరా..?
ABN , First Publish Date - 2023-08-21T20:01:33+05:30 IST
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 119 సీట్లకు 115 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సోమవారం నాడు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 115 సీట్లలో రెడ్డి వర్గానికి అత్యధిక సీట్లను కేసీఆర్ కేటాయించారు. 2014లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దళితులకు సీఎం పదవి దేవుడెరుగు.. తర్వాతి ఎన్నికల్లో పార్టీ తరఫున కేసీఆర్ ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం దళితులకు 30 సీట్లు మాత్రమే కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేసింది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ మరోసారి పాగా వేసేందుకు అభ్యర్థుల లిస్టును అందరి కంటే ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం నాడు మంచి ముహూర్తం చూసుకుని మరీ విడుదల చేశారు. అయితే టిక్కెట్లు రాని పలువురు అసంతృప్తులు ఇప్పటికే తమ నిరసన గళం బయట పెడుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో ఏ కులానికి ఎన్ని సీట్లు కేటాయించారన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
తెలంగాణలో ప్రస్తుత పాపులేషన్ ప్రకారం చూసుకుంటే అత్యధికంగా బీసీలు ఉన్నారు. బీసీలు 37 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. ఓసీలు 33.2 శాతంతో రెండో స్థానంలో, 16.6 శాతంతో ఎస్సీలు మూడో స్థానంలో ఉన్నారు. మైనారిటీలు 7 శాతం, ఎస్టీలు 6.2 శాతం మంది ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. వెనుకబడిన కులాల విషయానికి వస్తే.. యాదవులు 6.3 శాతం, రజకులు 4.2 శాతం, ముతరాసీలు 3.3 శాతం, బలిజలు 3 శాతం, పద్మశాలీలు 2.9 శాతం, కుమ్మరులు 2.1 శాతం, దేవాంగులు 2.1 శాతం, గౌండ్లలు 2 శాతం, యడ్డెరలు 1.9 శాతం, మంగలి వారు 1.3 శాతం, కురుమలు 1 శాతం, ఇతరులు 5 శాతం ఉండగా.. ముస్లిం, క్రిస్టియన్లు 7 శాతం మంది ఉన్నారు. ఇతర కులాల విషయానికి వస్తే కాపులు 15 శాతం మంది, రెడ్లు 6.5 శాతం మంది, కమ్మ వర్గం 4.8 శాతం మంది, వెలమలు 3 శాతం మంది, వైశ్యులు 2.7 శాతం మంది, క్షత్రియులు 1.2 శాతం మంది ఉన్నారు. ఎస్సీ లేదా ఎస్టీలలో మాల లేదా మాదిగ వర్గం 16.6 శాతం మంది ఉండగా.. షెడ్యూల్ తెగల వారు 6.2 శాతం మంది ఉన్నారు.
తాజాగా కేసీఆర్ విడుదల చేసిన లిస్టు ప్రకారం అత్యధికంగా రెడ్లకు సీట్లను కేటాయించడం జరిగింది. మొత్తం 115 సీట్లలో రెడ్డి వర్గానికి 39 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. అంటే 6.5 శాతం మంది రెడ్డి వర్గానికి 39 సీట్ల కేటాయింపు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక 37 శాతం మంది ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లను మాత్రమే కేసీఆర్ కట్టబెట్టారు. ఎస్సీలకు 19 సీట్లు, ఎస్టీలకు 11 సీట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించారు. వెలమలకు 12 సీట్లు ఇవ్వగా... కమ్మ వర్గానికి 6 సీట్లు, మైనారిటీలకు 3 సీట్లు ఇచ్చారు. ఆర్యవైశ్యులకు 1, బ్రాహ్మణులకు 1 సీటు కేటాయించారు.
అయితే 2014లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తమ సౌలభ్యం కోసం తానే సీఎం పదవిని అధిరోహించి తాను సీఎం కాకపోతే తెలంగాణ ఏమైపోతుందన్న రీతిలో మాయమాటలు చెప్పారు. దళితులకు సీఎం పదవి దేవుడెరుగు.. తర్వాతి ఎన్నికల్లో పార్టీ తరఫున కేసీఆర్ ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం దళితులకు 30 సీట్లు మాత్రమే కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సీఎం పదవి ఇవ్వరు.. కనీసం సీట్లు కూడా ఎక్కువ ఇవ్వరా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Telangana Cabinet: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. తెలంగాణ కేబినెట్లో మార్పులు?
**************************************************************************************************
BRS first list: టికెట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే..
**************************************************************************************************