Avinash In Viveka Case : ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు
ABN , First Publish Date - 2023-05-20T22:09:19+05:30 IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు కీలక అప్డేట్ ఇచ్చారు..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు కీలక అప్డేట్ ఇచ్చారు. ‘లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆమెకు యాంజియోగ్రామ్ చేశాము. రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నాయి. బీపీ తక్కువగా ఉంది. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికైతే లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా కొన్నిరోజులు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది’ అని విశ్వభారతి ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ హితేశ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. డాక్టర్ల ప్రకటనతో అవినాష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ అభిమానులు, అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు.
బీపీ కంట్రోల్ చేయడానికి..!
కాగా.. నిన్నటి నుంచీ లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఇలానే ఉంది. బీపి పూర్తిగా డౌన్ కావడం వలన కాస్త ఇబ్బందిగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం నాడు యాంజియోగ్రామ్ తీయగా.. ఇవాళ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. అయితే.. ఆమెకు మెరుగైన చికిత్స అందజేసేందుకు ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. నిన్నటి నుంచీ బీపీ కంట్రోల్ చేయడానికి వైద్యుల బృందం శ్రమిస్తోందని హితేశ్ చెబుతున్నారు. మరోవైపు.. ఇవాళ రాత్రికి అందించే వైద్యాన్ని బట్టి కోలుకోకుంటే హైదరాబాద్‌కు తరలించాలని అవినాష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అవినాష్ రెడ్డి కూడా ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారని శుక్రవారం నాడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అవన్నీ అవాస్తవాలే అని ఎంపీ సిబ్బంది మీడియాకు తెలిపారు.
మరోసారి నోటీసులు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పులివెందుల (Pulivendula) బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యంలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీస్‌లు అందాయి. శుక్రవారం ఉదయం 11 గంటలు...వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తప్పనిసరిగా సీబీఐముందు విచారణకు హాజరు కావాల్సిన సమయం. హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. కానీ మధ్యలోనే రూటు మారింది.