Luthra On CBN Case: చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? సిద్ధార్థ్ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్
ABN , First Publish Date - 2023-09-22T19:03:28+05:30 IST
ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన మరో ట్వీట్ ఆసక్తి రేపుతోంది. చీకటి అలుముకున్న తర్వాత వెలుగు వస్తుంది అన్న తరహాలో ఆయన ట్వీట్ చేశారని టీడీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబును ఎలాగైనా బయటికి తీసుకురావాలని జాతీయ స్థాయిలో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిన ప్రతీసారి ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సమయంలో ‘న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైంది’ అంటూ ఓ పోస్ట్ చేశారు. తాజాగా సిద్ధార్థ్ లూథ్రా చేసిన మరో ట్వీట్ ఆసక్తి రేపుతోంది.
శుక్రవారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టు రెండు తీర్పులను వెల్లడించింది. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడంతో పాటు ఆయన్ను రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. దీంతో మరోసారి టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వారిని ఊరట కలిగించడం కోసం సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. ‘ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది.. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగు ఇస్తుంది’ అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఇప్పుడు త్వరలోనే చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఆయన చెప్పారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు చీకటి అలుముకున్నా తర్వాత వెలుగు వస్తుంది అన్న తరహాలో ఆయన ట్వీట్ చేశారని టీడీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్
కాగా చంద్రబాబు కేసులో సిద్ధార్థ్ లూథ్రా కీలకంగా వాదనలు వినిపిస్తున్నారు. ఆయన్ను టీడీపీ బలంగా నమ్ముతోంది. దేశంలోని అగ్రశ్రేణి లాయర్లలో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. క్రిమినల్ లా, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలలో వాదనలు వినిపించడంలో లూథ్రాకు గొప్ప నైపుణ్యం ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2016లోనూ కేసీఆర్ పార్టీ దాఖలు చేసిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపించారు. అందుకే ఇప్పుడు కూడా టీడీపీ ఢిల్లీ నుంచి ఆయన్ను పిలిపించుకుని తమ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తోంది.