Sattenapalli: సత్తెనపల్లి సీటు కన్నాకు.. కోడెల కొడుకు శివరాం అలక.. టీడీపీ అధిష్టానం ఎందుకీ కఠిన నిర్ణయం తీసుకుందంటే..
ABN , First Publish Date - 2023-06-01T13:37:03+05:30 IST
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై ఉత్కంఠకు టీడీపీ తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమాకం
ఎట్టకేలకు ఉత్తర్వులు విడుదల చేసిన అధిష్ఠానం
లక్ష్మీనారాయణకు సహకరించాలని నేతలకు సూచన
పార్టీ పటిష్ఠతకు మాజీ మంత్రి కన్నా ప్రణాళికలు
ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
నరసరావుపేట: సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై (Sattenapalli TDP Incharge) ఉత్కంఠకు టీడీపీ (TDP) తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు (Kanna Lakshmi Narayana) పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కన్నాకు పూర్తి సహకారాన్ని అందించాలని నేతలు, పార్టీ శ్రేణులకు అధిష్ఠానం సూచించింది. కన్నాకు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను పార్టీ అప్పగించనున్నదని ఆంధ్రజ్యోతి ముందే చెప్పిన విషయం తెలిసిందే. నవ్వాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణానంతరం సత్తెనపల్లిలో ఇన్‌చార్జిను నియమించలేదు. పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో నిర్వహించలేని దుస్థితి నెలకొంది.
కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరామ్, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బూరు మల్లి, నాగోతు శౌరయ్య ఇన్‌చార్జి పదవిని ఆశించారు. ఎవరికి తోచిన రీతిలో వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. నలుగురు నేతలు ఉండటంతో పార్టీకి విధేయులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠం చేసేందుకు చివరకు అధిష్ఠానం చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజవర్గానికి సరైన నేత కన్నా లక్ష్మీనారాయణ అని అధిష్ఠానం గుర్తించింది.
మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత కన్నా లక్ష్మీనారాయణకు అధిష్ఠానం ఇన్‌చార్జి బ్యాధతలను అప్పగించి పార్టీని పటిష్ఠ పరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ నియోజవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పార్టీ క్యాడర్ కూడా మద్దతు పలుకుతున్నది. కన్నా సత్తెనపల్లిలో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కన్నా రాకతో పార్టీలో కదిలిక మొదలైంది. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చేందుకు కన్నా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.
నేతలతో సంప్రదింపులు
మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా మాట్లాడారని, ఇన్‌చార్జి బాధ్యతలను కన్నాకు ఇస్తున్నామని ఆయనకు సహకరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ కోడెల శివరాంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతుంది. కన్నా నియామకంపై పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నాగోతు శౌరయ్యకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు నాయకులకు కూడా అచ్చెన్నా యుడు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. మల్లితో కూడా పార్టీ నేత ఒకరు మాట్లాడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ నిర్ణయం తమకు శిరోధార్యమని శౌరయ్య, మల్లి బుధవారం తెలిపారు. ఇన్‌చార్జి నియమాకం విషయంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని నేతలను కోరారు. ఇన్‌చార్జి విషయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని, వారి మాటలను అందరూ గౌరవించాలని మల్లి తెలిపారు.
సత్తెనపల్లిలో పార్టీ పటిష్ఠతే ముఖ్యం కావడంతో కన్నాకు నియోజక వర్గ పగ్గాలను అప్పగించినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అధిష్ఠాన నిర్ణయాన్ని క్యాడర్ స్వాగ తిస్తున్నది. ఇప్పటికే కొందరు నేతలు కన్నాను కలిసి మద్దతు కూడా తెలిపారు. అధిష్ఠానం అప్పగించిన బాధ్య తను వమ్ము చేయకుండా పార్టీని పటిష్ఠ పరుస్తానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు తాను పనిచేస్తానన్నారు. ఇన్‌చార్జి హాదాలో రాజుపాలెం మండ లంలో బుధవారం కన్నా పర్యటించారు. దేవరంపాడు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భీరవల్లిపాలెంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.