TS Polls : ప్చ్.. తెలంగాణ బీజేపీలో అనిశ్చితి.. మేనిఫెస్టో రాసేదెవరు..!?
ABN , First Publish Date - 2023-11-03T20:07:58+05:30 IST
ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు..
ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు. ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారు..? ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి హామీలు ఇస్తున్నారు..? అంతకుమించి మనం ఏమివ్వాలి..? అని ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించి మరీ మేనిఫెస్టోను ప్రకటిస్తారు. అందుకే రాజకీయ పార్టీలు పక్కాగా మేనిఫెస్టో కమిటీని ప్రకటించి కొన్ని నెలలుగా హామీల పనిమీదే ఉండేలా చేస్తాయి. అలాంటిది మేనిఫెస్టో కమిటీలో సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పేస్తే.. అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందే ఇలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఈ పరిస్థితినే ఎదుర్కొంటోంది.
పెద్ద చిక్కే..!!
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను అధికారంలోకి రానివ్వం.. అదిగో.. అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇదిగో కల్వకుంట్ల ఫ్యామిలీ (Kalvakuntla Family) అవినీతిని బయటికి తీసి జైలు పంపిస్తాం..!! ఇవీ ఢిల్లీ నుంచి వచ్చిన.. తెలంగాణలో ఉన్న కమలనాథులు పదే పదే చెప్పు మాటలు. సీన్ కట్ చేస్తే.. అధికారం సంగతి దేవుడెరుగు ఇప్పుడు కనీసం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే పరిస్థితే లేకుండా పోయిందనే ఆరోపణలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయ్. పైగా.. రోజుకొక నేత కమలం కండువా తీసేసి.. అటు కారెక్కడమా లేకుంటే కాంగ్రెస్ కండువా కప్పుకోవడమా చేస్తున్నారు. అంతేకాదు.. కనీసం ఇప్పటి వరకూ మేనిఫెస్టో ప్రకటించడానికి లేకుండా పోయింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పలు గ్యారెంటీ స్కీములు ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దూకగా.. బీజేపీ మాత్రం పెద్దగా చప్పుడు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే.. మేనిఫెస్టో ప్రకటించడానికి ఉన్న కమిటీ సభ్యులంతా ఒక్కరంటే ఒక్కరూ లేకుండా పోయారు. అంతా రాజీనామా చేసేసి వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల ముందు బీజేపీకి పెద్ద చిక్కే వచ్చి పడినట్లయ్యింది. నామినేషన్లు కూడా షురూ అయ్యాయి కానీ.. ఇంతవరకూ బీజేపీ మేనిఫెస్టో ప్రకటించడకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..?
అక్టోబర్-05న బీజేపీ మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పదవులు రావట్లేదని అసంతృప్తితో రగిలిపోతున్నవారికి ఈ కమిటీల్లో చోటిచ్చి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అయితే.. పట్టుమని నెల కూడా తిరగకుండానే సీన్ మొత్తం మారిపోయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్‌గా ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజీనామా చేశారు. ఈ ఇద్దరూ రోజుల గ్యాప్‌లోని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా ఉంటున్న విజయశాంతి అలియాస్ రాములమ్మ మొదటి నుంచే పార్టీ కార్యక్రమాలకు.. ఆఖరికి ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినా హాజరయ్యే పరిస్థిత్లో లేరు. రేపో.. మాపో ఈమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ అయితే గట్టిగానే నడుస్తోంది. మరోవైపు.. హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఇంద్రసేనారెడ్డికి ఈ మధ్యనే త్రిపుర గవర్నర్ పదవిని బీజేపీ పెద్దలు కట్టబెట్టారు. ఇలా ఒక్కొక్కరుగా జారకుంటున్న పరిస్థితుల్లో మేనిఫెస్టో కథేంటి..? ఏం చేద్దాం అని రాష్ట్ర నాయకత్వం డైలమాలో పడింది. అసలు మేనిఫెస్టో ఉందా లేదా..? అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇదొక పెద్ద టాస్కే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మేనిఫెస్టో కమలనాథులు ఎలా తయారు చేస్తారో.. ఉన్న ఫళంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారో.. వేచి చూడాలి మరి.