Tamilisai Soundararajan: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రచ్చ నడుస్తుంటే.. సీన్‌లోకి తెలంగాణ కొత్త సచివాలయం ఎందుకొచ్చిందంటే..
ABN , First Publish Date - 2023-05-25T20:36:35+05:30 IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై స్పందిస్తున్న క్రమంలో తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్ వైఖరిని, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు.
దేశవ్యాప్తంగా గడచిన 48 గంటలుగా భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం (New Parliament Building IInauguration) చుట్టూ పెద్ద రచ్చే నడుస్తోంది. మే 28, 2023న ఈ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. అయితే.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రపతితో ప్రారంభించకుండా ప్రధాని మోదీ ప్రారంభించాలని డిసైడ్ అవ్వడం ఏంటని 19 విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఇందుకు నిరసనగా.. ఈ ప్రారంభోత్సవానికే దూరంగా ఉండాలని తీర్మానం చేసి వెళ్లకూడదని భీష్మించుకున్నాయి. రాష్ట్రపతితోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభింపజేయాలని దేశంలోని అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ వ్యవహారంపై ఇంత రచ్చ జరుగుతున్న వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై స్పందిస్తున్న క్రమంలో తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్ వైఖరిని, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు.
‘‘మొన్నీ మధ్యనే తెలంగాణలో కొత్తగా కట్టిన, అద్భుతంగా రూపుదిద్దుకున్న సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ‘గవర్నర్‌ను ఆహ్వానించలేదా’ ? అని అందరూ ప్రశ్నించారు. ఆహ్వానించలేదని నిర్మొహమాటంగా అధికార పార్టీ నుంచి సమాధానం వచ్చింది. నేరుగా వచ్చి పిలవకపోయినప్పటికీ నాకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. రాష్ట్రపతిని రాజకీయేతర వ్యక్తంటున్న విపక్షాలు గవర్నర్ల విషయంలో మాత్రం ఎందుకు ఈ మాట అనడం లేదు’’..? అని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై నిలదీశారు. అంతేకాదు.. గవర్నర్లకు కనీస గౌరవం ఇవ్వని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతిని కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు సమాచారం గానీ, ఆహ్వానం గానీ అందలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి గుర్తు చేశారు.
తెలంగాణ గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు తాకేలా ఉండటం గమనార్హం. ‘సందర్భం దొరికింది కదా.. వాడేసుకుని ఆడేసుకుందాం’ అనే రీతిలో కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే తమిళిసై తన ఆవేదనతో పాటు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పైగా.. ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది కూడా హైదరాబాద్‌లో కాదు చెన్నైలో. అంతేకాకుండా.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ఇంత రచ్చ జరుగుతున్న వేళ తెలంగాణ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకి మధ్య ఉన్న విభేదాలు జాతీయ స్థాయిలో గుసగుసలాడుకునేందుకు అవకాశమిచ్చాయి. ఈ వ్యాఖ్యలతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు పనిలో పనిగా తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదనే విషయాన్ని హైలైట్ చేసుకోవచ్చనే వ్యూహంలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పనిలో పనిగా కేసీఆర్‌కు చురకలంటిచినట్టు కూడా ఉంటుందని భావించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవడం గమనార్హం.
భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు ఇలా ఉండగా.. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వైఖరేంటో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా? కిం కర్తవ్యం? ఇదీ అధికార బీఆర్‌ఎస్ పార్టీని ప్రస్తుతం వేధిస్తున్న సందేహం. ఆది నుంచి కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ఇతర ప్రతిపక్షాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న సీఎం కేసీఆర్.. ఈ విషయంలోనూ మౌనం వహిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాయ్‌కాట్ చేసిన 19 పార్టీల్లో.. సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంపై విరుచుకుపడే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించారు. టీఎంసీ కాంగ్రెస్ కూటమిలో లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోదీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరించారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతానంటూ గొప్పలు చెబుతున్న కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు.
తమకు మద్దతు పలకాలని పలు ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్ ఎంపీలను కోరినప్పటికీ.. తమ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు బదులిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇరుక్కుంటామన్న భావన బీఆర్‌ఎస్ వర్గాల్లో నెలకొనడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఏప్రిల్ 30న జరిగిన తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి కేసీఆర్ సర్కారు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా వెల్లడించారు. ఒకవేళ విపక్షాలకు మద్దతుగా బీఆర్‌ఎస్ సైతం పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయిస్తే.. ‘‘రాష్ట్రంలో మీరు చేసిన ఘనకార్యం ఏంటి’’ అని బీజేపీ ప్రశ్నిస్తుంది. తాజాగా.. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికే ఆ సంకేతాలిచ్చాయి. అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకూ ఇదో అస్త్రంగా లభించనుంది. దీనిపై ముందుకెళ్లినా, వెనక్కి తగ్గినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడనున్న నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.