Avinash In Viveka Case : ఎంపీ అవినాష్‌ను ఎలా విచారించాలనే దానిపై సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు..
ABN , First Publish Date - 2023-04-18T18:04:11+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది..
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని (MP Avinash Reddy) ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ (CBI) .. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం.. అంతకుముందే వైఎస్ భాస్కర్ రెడ్డిని (Bhaskar Reddy) అరెస్ట్ చేయడంతో మరోసారి సంచలనమైంది. విచారణకు వెళ్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారని వార్తలు గుప్పుమనడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును (TS High Court) అవినాష్ ఆశ్రయించారు. దీంతో సోమవారం నాడు ఈ బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. అటు సీబీఐ.. ఇటు అవినాష్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కాగా.. వాడీవేడీగానే సాగాయి. ఒకానొక సందర్భంలో కోర్టులోనే అవినాశ్రెడ్డి, వైఎస్ సునీత (YS Sunitha) లాయర్ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికిస్తున్నారని.. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారని అవినాష్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇలా అందరి వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ సురేందర్ బెంచ్.. ఈ నెల 25న తుది తీర్పు ఇస్తామని తెలిపింది.
ఇలానే విచారణ చేయండి..
రెండు గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగిన జస్టిస్ సురేందర్ బెంచ్.. ఎలా విచారించాలనే దానిపై సీబీఐకు కొన్ని కీలక సలహాలు, సూచనలు చేసింది. ఈ నెల 25వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది.
- విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయాలని సీబీఐకు సూచించింది. ఇందుకు స్పందించిన సీబీఐ తరఫు లాయర్.. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.
- అవినాష్‌ను ఏమేం ప్రశ్నలు అడుగుతారో వాటన్నింటినీ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కూడా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. బుధవారం నుంచి ప్రతిరోజూ విచారణకు వెళ్లాల్సిందేనని అవినాష్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. ఈనెల 25వరకు సీబీఐ ఎప్పుడు విచారణకు పిలిచినా తప్పకుండా వెళ్లాల్సిందేనని అవినాష్‌ను హైకోర్టు ఆదేశించింది.
- ఇదిలా ఉంటే.. హత్య కేసులో అరెస్టయిన A6 ఉదయ్ రెడ్డి, A7 భాస్కర్‌రెడ్డికి ఆరు రోజులపాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి 24 వరకు సీబీఐ కస్టడీ విచారణ చేపట్టనుంది. వీరిద్దరితో కలిపి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ విచారణ తర్వాతే కొన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని సీబీఐ భావిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజూ విచారణ జరపనున్నట్లు సీబీఐ చెబుతోంది.
మొత్తానికి చూస్తే.. ముందస్తు బెయిల్‌తో హైకోర్టు కాస్త ఊరటనిచ్చినా సీబీఐ విచారణలో మాత్రం ఊరట దక్కలేదు. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో.. 25 వరకు ఇంకా ఎన్నెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో.. 25 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.