YSRCP: బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. ఆడియో వైరల్
ABN , First Publish Date - 2023-09-25T15:52:42+05:30 IST
అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎర్రగుంట్ల సర్పంచ్ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించారు.
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యేల భాష ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అధినేత జగన్ అండ చూసుకుని బూతులు మాట్లాడుతూ ఎదుటివారిని రెచ్చగొట్టడంలో వైసీపీ నేతలకు సాటి ఎవరూ రారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, రోజా వంటి నేతలు నోరుతెరిస్తే బూతులు అలా వచ్చేస్తుంటాయి. తాజాగా ఈ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎర్రగుంట్ల సర్పంచ్ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకపోతే కలెక్టర్‌కు రిపోర్ట్ పంపిస్తారని.. దీంతో సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్ పదవి అవసరం లేదనుకుంటే ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని.. ముందుగా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. మీ భార్యకు సర్పంచ్ పదవి పోయాక తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. నువ్వు రాకపోయినా సర్పంచ్ వచ్చినా సరిపోతుందని తెలిపారు. ఒకవేళ రాకపోతే ప్రజలకు మంచి చేసే విషయంలో గవర్నమెంట్‌తో సర్పంచ్ కలిసి రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిపోతుందన్నారు. ఇది గవర్నమెంట్ కార్యక్రమం అని.. ఇది రామచంద్రారెడ్డిదో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమో కాదన్నారు.
ఇది కూడా చదవండి: AP Politics: వైసీపీ అభిమానుల వక్రభాష్యాలు.. ఐటీ ఉద్యోగులు చీరలు కట్టుకోకూడదా?
కాగా అనవసరమైన మాటలు మాట్లాడవద్దని సర్పంచ్ భర్త హనుమంతప్పను వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బెదిరించారు. ఎవడో అండ చూసుకుని వాడి వెంట వెళ్తున్నావని.. అంతా గమనిస్తూనే ఉన్నామని.. ఇది మంచిది కాదని ఎమ్మెల్యే అన్నారు. అయితే ఆయనకు సర్పంచ్ భర్త హనుమంతప్ప దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా అని నిలదీశాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన మమ్మల్ని ఎమ్మెల్యే తీవ్ర అవమానాలకు గురిచేశారని.. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఎర్రగుంట్ల గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోరని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు తనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని.. కనీసం ఫోన్ చేస్తే ఆన్సర్ కూడా చేయలేదని సూటిగా నిలదీశాడు. తనకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా రాకుండా ఉన్న పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. తన భార్య సర్పంచ్‌గా గెలిచేందుకు రూ.20 లక్షలు ఖర్చుపెట్టానని.. మీరేమైనా డబ్బులు ఇచ్చారా అని అడిగాడు. తాము లేకపోయినా మీరు కార్యక్రమాలు జరుపుకుంటారని.. మీకు చాలామంది అనుచరులు ఉన్నారని ఎమ్మెల్యేకు తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు.