YS Jagan And Sunitha : జగనన్న ఆరోగ్యం కోసం పరితపిస్తున్న సునీత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఫొటో వైరల్
ABN , First Publish Date - 2023-08-03T23:55:31+05:30 IST
జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) ఇప్పట్లో తేలే పరిస్థితులు కనిపించట్లేదు. వీలైనంత త్వరగా ఈ కేసును తేల్చేయాలని సీబీఐ పలుకోణాల్లో విచారిస్తుండగా.. బెయిల్ కోసం ఈ కేసులోని నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నారు. నిందితులు ఎవరో తేలే వరకు.. న్యాయం జరిగేంతవరకూ వదిలేదే లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే అటు తిరిగి.. ఇటు తిరిగి వైఎస్ ఫ్యామిలీలోనే రక్త సంబధికుల దగ్గరే వచ్చి ఈ కేసు ఆగుతోంది.! కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబీకులు చెబుతున్న పరిస్థితి. దీంతో ఏళ్ల తరబడి కేసు పెండింగ్‌లోనే ఉండిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి సీబీఐను కూడా అనుమానించడం, డైరెక్టర్లను మార్చే పరిస్థితి వచ్చిందంటే లోలోపల ఏం జరుగుతోందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసు సంగతి అటుంచితే.. సోషల్ మీడియాలో ఒక ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై చిత్రవిచిత్రాలుగా వైసీపీ శ్రేణులు స్పందిస్తుండగా.. నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్లిస్తున్నారు. ఇంతకీ ఏమిటా ఫోటో..!
ఇటు చూడండి జగన్!
ఇదిగో ఇక్కడున్న ఈ ఫొటో చూశారా..? ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో.. దాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రానే కావాలని హైదరాబాద్ వేదికగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు.! ఆ సమయంలో జగన్ నీరపడిపోయి.. ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. అప్పట్లో జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అన్న ఆరోగ్యంగా ఉండాలని చెల్లి ఎంతో కష్టపడ్డారు. గంటకోసారి బీపీ చెక్ చేస్తూ జగన్‌ను చూసుకుంటూ వచ్చారు సునీతారెడ్డి. అప్పట్లో ‘అన్నా చెల్లెలి అనుబంధం’ అంటే ఇదేనని వైసీపీ శ్రేణులు, వైఎస్ వీరాభిమానులు ఎంతో సంబరపడిపోయారు. సీన్ కట్ చేస్తే.. వైఎస్ వివేకా హత్య తర్వాత అన్నా వర్సెస్ చెల్లిగా పరిస్థితులు మారాయి. నాటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎలా ఉండే ఫ్యామిలీ ఇలా ముక్కలైంది.. దీనంతటికీ కారణం అత్యాశే’నని కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఇంత ప్రేమగా చూసుకుంటే.. చెల్లికి తండ్రి లేకుండా ఎలా చేశారబ్బా’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటో గురించే ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. ‘చూస్తున్నావా జగన్.. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకోండి.. అప్పుడలా.. ఇప్పుడిలా’ అని టీడీపీ కార్యకర్తలు కామెంట్లు కురిపిస్తున్నారు. నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల కామెంట్లను వైసీపీ వీరాభిమానులు తీవ్రంగా ఖండిస్తూ కౌంటర్లిస్తుండటంతో.. ‘ఫొటో పే చర్చ’ మరింత పెద్దదవుతోంది.