TS Elections : పోటీకి దూరంగా సీనియర్లు.. ఎన్నెన్నో అనుమానాలు.. కమలం పార్టీలో ఏం జరుగుతోంది.. !?
ABN , First Publish Date - 2023-10-24T14:45:49+05:30 IST
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BJP) పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి...
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BJP) పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. బీఫామ్‌లు కూడా ఇచ్చేసి, మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) శంఖారావం పూరించారు. ఇక అంతకుముందు నుంచే జాతీయ స్థాయి నేతలతో కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. మొదటి జాబితాను రిలీజ్ చేసిన హస్తం.. త్వరలో మిగిలిన అభ్యర్థులతో రెండో జాబితా రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఇక బీజేపీ కూడా తొలి జాబితాను రిలీజ్ చేసింది.. అయితే ఇందులో సీనియర్లు, ఆశావాహుల పేర్లు లేకపోవడం పలు అనుమానాలు, అంతకుమించి ఊహాగానాలకు తెరలేపుతోంది.
అసలేం జరుగుతోంది..?
బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఎక్కడా సీనియర్లు, కీలక నేతలు.. ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడి పేరు కూడా లేకపోవడం గమనార్హం. పోనీ.. రెండో జాబితాలో అయినా పేరు ఉంటుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమేనని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లు దూరంగా ఉండటంతో.. ఈ వ్యవహారం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా తలపడుతుండటంతో.. మధ్యలో దూరి బద్నాం కావడం అవసరమా..? కచ్చితంగా ఫలితాలు నెగిటివ్‌గానే ఉంటాయని.. ఓటమి భయంతోనే సీనియర్లు పోటీకి దూరంగా ఉంటున్నారని కాషాయ పార్టీలో అనుమానాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. స్వయంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పోటీ నుంచి తప్పుకోవడంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. అంతేకాదు.. సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) కూడా పోటీకి దూరంగా ఉండటం ఈ వరుస పరిణామాలతో కమలం పార్టీలో ఏం జరుగుతోందో కార్యకర్తలు, పార్టీ నేతలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
ఎందుకీ దూరం!
కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లే పోటీకి దూరంగా ఉండటంతో తాను కూడా అదేబాటలో వెళ్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy).. తన అనుచరులు, కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏ క్షణమైనా ఆయన కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పకొనే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీలో కొనసాగితే మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటానని అధిష్టానానికి తేల్చి చెప్పబోతున్నారట. ఇక సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) పరిస్థితి కూడా ఇలానే ఉంది. తొలిజాబితాలో అరుణ పేరూ లేదు.. పోటీకి ఆసక్తి చూపట్లేదు. కారణాలేంటి అనేది తెలియట్లేదు కానీ.. బీసీలను ప్రోత్సహించేందుకు బలమైన బీసీ నేతను బరిలోకి దింపుతానని చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy) విషయానికొస్తే.. తనకు బదులుగా కుమారుడికి మహబూబ్‌నగర్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక విజయశాంతి (Vijayashanti) అలియాస్ రాములమ్మ (Ramulamma) అయితే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి తొలగించడం.. ఈటల రాజేందర్‌కు (Etela Rajender) పార్టీలో ప్రాధాన్యం కల్పించడంతో హర్టయ్యి మౌనవ్రతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే.. కామారెడ్డి (Kamareddy) నుంచి పోటీచేసే అవకాశం ఇస్తే.. సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తానని చెబుతున్నారు. చూశారుగా.. పార్టీకి పెద్ద దిక్కు అనుకున్నోళ్లందరి పరిస్థితి ఎలా ఉందో.. ఎందుకీ దూరం..? ఇది భయం అనుకోవాలా..? లేకుంటే మరేం అనుకోవాలనేది.. కమలనాథులకే తెలియాలి మరి.
మొత్తానికి చూస్తే.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్లు పోటీ చేయకపోవడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద చర్చే నడుస్తోంది. సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరుగుతోందో తెలియక.. సీనియర్లు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాక బీజేపీ శ్రేణులు, నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. రెండో జాబితా వచ్చిన తర్వాత అసలు సంగతేంటో తెలిసిపోనుందన్న మాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.