Karnataka: కర్ణాటకలో ఇదెక్కడి గోల.. చెప్పడం ఎందుకులే గానీ.. ఈ రెండు వీడియోలు చూడండి..!

ABN , First Publish Date - 2023-05-26T17:04:15+05:30 IST

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారెంటీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తలనొప్పిగా తయారయ్యాయి. ఆ పథకాలతో దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు..

Karnataka: కర్ణాటకలో ఇదెక్కడి గోల.. చెప్పడం ఎందుకులే గానీ.. ఈ రెండు వీడియోలు చూడండి..!

కర్ణాటకలో గ్యారెంటీల గోల

బస్సులో టికెట్‌ కొనేది లేదంటూ వాగ్వాదం

విద్యుత్‌ బిల్లుల అడిగితే దెబ్బలే

డోలాయమానంలో సర్కారు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్‌ (Karnataka Congress) ప్రకటించిన గ్యారెంటీలు (Karnataka Five Guarantees) ఇప్పుడు క్షేత్రస్థాయిలో తలనొప్పిగా తయారయ్యాయి. ఆ పథకాలతో దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు ఏకంగా 135 స్థానాల్లో విజయం దక్కింది. రాష్ట్రంలో సిద్దరామయ్య (siddaramaiah) ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక గ్యారంటీలను అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. వీటన్నింటినీ పట్టించుకోని ప్రజలు మాత్రం గ్యారంటీలు వచ్చేశాయనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల సమస్యలు పెరిగాయి. విద్యుత్‌ బిల్లులు ఇచ్చేందుకు ఆ శాఖ ఉద్యోగులు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది. మరో వైపు బస్సుల్లో కండక్టర్లు టికెట్లు కొనాలంటూ మహిళలను బతిమాడాల్సి వస్తోంది.

టికెట్లు కొనేది లేదంటున్న మహిళలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని గ్యారంటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ ఎన్నికలకు ముందు చెప్పారని, ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు గ్యారెంటీలను ఆమోదిస్తామని హామీ ఇచ్చారంటూ మహిళలు తిరగబడుతున్నారు. విజయనగరలో కేఎస్‌ఆర్టీసీ బస్సులో కూర్చొన్న మహిళలను కండక్టర్‌ టికెట్‌ ఇవ్వాలంటూ కోరారు. కాంగ్రెస్‌ వారు చెప్పారు మేమెందుకు కొంటామంటూ తిరగబడ్డారు. మహిళలు కండక్టర్‌తో గొడవకు దిగారు. చివరకు తోటి ప్రయాణికులు నచ్చచెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ నేతలను దూషించారు. ఇక రాయచూరు జిల్లా మస్కిలో ఓ వృద్ధురాలు కండక్టర్‌తో గొడవ పడ్డారు. తమ ఎమ్మెల్యే చెప్పారని, తానెందుకు టికెట్‌ కొంటానంటూ ప్రశ్నించారు.

కొప్పళలో లైన్‌మన్‌పై దాడి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే విద్యుత్‌ బిల్లులు కట్టేది లేదంటూ జనం తిరగబడుతున్నారు. పల్లెలకు వెళ్లి సిబ్బంది రీడింగ్‌ రాసేందుకు సాధ్యం కావడం లేదు. లైన్‌మన్లు బిల్లులు కట్టాలని కోరితే చాలు మూకుమ్మడిగా గ్రామస్థులంతా కలిసి ఎదురు తిరుగుతున్నారు. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ గ్యారెంటీల ద్వారా ప్రకటించింది. వారం రోజులుగా విద్యుత్‌ ఉద్యోగులు పల్లెలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కొప్పళ జిల్లా కుకనపల్లికి చెందిన చంద్రశేఖరయ్య ఆరునెలలుగా బిల్లు బకాయి పడ్డాడు. బుధవారం లైన్‌మన్‌ మంజునాథ్‌ బిల్లు కోసం వెళ్లారు. బిల్లు కట్టేది లేదని చంద్రశేఖరయ్య వాగ్వాదం చేశాడు. ఆరునెలల బిల్లు చెల్లించకుంటే ఎలాగని లైన్‌మన్‌ మాట్లాడుతుండగానే ఫ్రీ అంటూ నాయకులు చెప్పలేదా అంటూ ఏకంగా చెప్పుతో దాడి చేశాడు. లైన్‌మన్‌ను దూషించి చెప్పుతో దాడి చేయడంపై జిల్లాకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు.

డోలాయమానంలో సర్కారు..

కాంగ్రెస్‌ ఎన్నికల గ్యారంటీలను అమలు చేసే విషయంలో ఆర్థిక వనరుల విషయమై సీఎం సిద్దరామయ్య సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు భారీగా డిమాండ్‌ వస్తోంది. ఎన్నికలకు ముందు విద్యుత్‌, ఉచిత ప్రయాణం అందరికీ వర్తిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బీపీఎల్‌ కార్డుదారులకు మాత్రమే అంటే మొదటికే మోసం వస్తుందని వెనుకంజ వేస్తున్నారు. మరో ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఆచితూచి వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ఇలా పథకాలు అమలు చేయాలా..? మార్గదర్శకాల పేరుతో ఆంక్షలు తీసుకురావాలా..? అనే డోలాయమానంలో పడ్డారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు, వ్యాపారులు, ఐటీబీటీ ఉద్యోగులతోపాటు ఆదాయపు పన్ను చెల్లించేవారు మినహా మిగిలిన వారందరికీ వర్తింప చేయాలని భావిస్తున్నారు. మరికొన్ని రోజుల తర్వాతనే గ్యారంటీల అమలులో స్పష్టత రానుంది.

ఎప్పటి నుంచి అమలు చేస్తారు..? : జేడీఎస్‌ నేత కుమారస్వామి

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌లోనే ఐదు గ్యా రంటీలను ఆమోదిస్తామని చెప్పుకున్న వారు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది బహిరంగపరచాలని జేడీఎస్‌ నేత కుమారస్వామి డిమాండ్‌ చేశారు. విధానసౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పేది లేదని ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని వీరావేశంగా మాట్లాడిన సీఎం సిద్దరామయ్య ఏమేమి అమ లు చేశారో చెప్పాలన్నారు. 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితమని, ఇప్పుడు మార్గదర్శకాలు అంటే ఎలాగని ప్రశ్నించారు. తొలి కేబినెట్‌లో ఏది సాధ్యం చేశారో చెప్పగలరా అన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృ తి ఎప్పటి నుంచి అంటూ ప్రశ్నించారు.

మహిళలు తిరుపతి, ధర్మస్థళ, పూణేకు ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నారు. అంతకు ముందు చెన్నపట్టణ నుంచి ఎన్నికైన కుమారస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ చాంబర్‌లో ప్రొటెం స్పీకర్‌ ఆర్‌వీ దేశ్‌పాండే సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం విధానసౌధలోని జేడీఎస్‌ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేల సభ జరిగింది. జేడీఎస్‌ పక్షనేతగా కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత శాసనసభతో పోల్చితే జేడీఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయం గా తగ్గింది. గత సభలో 37మంది సభ్యులు ఉండేవారు ప్రస్తుతం ఆ సంఖ్య 19కు తగ్గిపోయింది.

Updated Date - 2023-05-26T17:06:35+05:30 IST