Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!
ABN , First Publish Date - 2023-05-21T20:53:13+05:30 IST
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం విచారణకు రాలేనని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం విచారణకు రాలేనని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై సుమారు రెండు గంటలపాటు సీబీఐ (CBI) నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో సీబీఐ స్పందించింది. సోమవారం విచారణకు వచ్చి తీరాల్సిందేనని సీబీఐ తేల్చి చెప్పేసింది. రేపు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు వస్తున్నట్లు అధికారులకు చెప్పడం.. ఆఖరి నిమిషంలో డుమ్మా కొట్టడంతో సీబీఐ తీవ్ర ఆగ్రహానికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎంపీ విచారణకు హాజరవుతారా లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
అవినాష్ ప్లానేంటి..!?
విచారణ రావాలని నోటీసులు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్న అవినాష్ రెడ్డి.. పెద్ద ప్లాన్‌తోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై జూన్-05న తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వెకేషన్ బెంచ్‌లో తన పిటీషన్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టును అవినాష్ ఆశ్రయించారు. అయితే.. అత్యవసరంగా విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో విచారణకు వెళ్తే ఏం జరుగుతుందో.. ఏంటో అని అవినాష్ డుమ్మా కొట్టారు. హైకోర్టులో విచారణకు వచ్చే వరకు.. సీబీఐ విచారణకు హాజరు కాకూడదని అవినాష్ నిర్ణయించినట్లు సమాచారం. జూన్-5న హైకోర్టు ఇచ్చే ఆదేశాల తర్వాతే సీబీఐ విచారణకు వెళ్లాలని ఎంపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈలోగా విచారణకు హాజరైతే సీబీఐ తప్పకుండా అరెస్టు చేస్తుందని అవినాష్ అనుకుంటున్నారట. అందుకే ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం అని ఆదివారం ఉదయం తన వ్యక్తిగత న్యాయవాదులతో అవినాష్ చర్చించారట. సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం విచారణకు వెళ్తే అరెస్ట్ తప్పదని న్యాయవాదులు అవినాష్‌కు తెలిపినట్లు సమాచారం. దీంతో జూన్-5 వరకు విచారణకు హాజరు కాకుండా ఉండాలని అవినాష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. జూన్-02న సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరగనుంది.
లేఖలో ఏముంది..!?
సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐకి అవినాష్ లేఖ రాశారు. ‘సోమవారం విచారణకు హాజరుకాలేను. నాకు 10 రోజులు సమయం కావాలి. మా అమ్మ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అందుకే.. ఇంకాస్త సమయం కావాలి. అమ్మకు గుండె ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ తర్వాత కుదుట పడటానికి వారం, పది రోజులు సమయం పట్టవచ్చు. అందుకే సమయం కోరుతున్నాను’ అని సీబీఐకి రాసిన లేఖలో అవినాష్ పేర్కొన్నారు.
అయితే మొన్న రాసిన లేఖకు మానవత్వ కోణంలో ఆలోచించిన సీబీఐ అధికారులు వెంటనే స్పందించి ఎంపీ విజ్ఞప్తికి ఓకే అన్నారు. పదే పదే ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో హెడ్ క్వార్టర్స్‌కు సమాచారం ఇవ్వడం.. అక్కడ్నుంచి క్లియర్‌కట్‌గా ఆదేశాలు రావడంతో ఇక ‘తగ్గేదేలే’ అన్నట్లుగా సీబీఐ ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సోమవారం విచారణకు వస్తారా.. వస్తే ఏం జరుగుతుంది..? ఒకవేళ రాకుంటే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై అటు అవినాష్ అభిమానుల్లో.. ఇటు వైసీపీ అధిష్టానంలో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది.