రైల్వే వారికి ఓ ప్రయాణికుడి ఫోన్ కాల్.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అంతా దేనికోసమంటే..
ABN , First Publish Date - 2023-01-08T15:54:12+05:30 IST
రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఆ ప్రయాణికుడు ఊహించని విధంగా...
రైల్వేస్టేషన్ లో హెల్ప్ లైన్ సిబ్బందికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు వారు. ఫలితంగా రెండేళ్ళ పిల్లాడు చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయాడు. ఇంతకూ ఇండియన్ రైల్వేస్ చేసిన పని ఏంటంటే..
సికింద్రాబాద్-అగర్తల ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి ఒక బొమ్మ కనిపించింది. 'ఇది ఏ పిల్లాడి బొమ్మనో పాపం పిల్లలకు బొమ్మలంటే బాగా ఇష్టం ఉంటుంది. ఆ పిల్లాడు తన బొమ్మను పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడుతూ ఉంటాడో ఏమో!' అని ఆలోచిస్తూ చిన్నప్పుడు తన బొమ్మ పోగొట్టుకున్నందుకు తను ఎంత బాధపడిన విషయం గుర్తుచేసుకున్నాడు. నేను బాధపడినట్టు ఆ పిల్లాడు బాధపడకూడదు అని డిసైడ్ అయ్యి వెంటనే రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి 'నా దగ్గర ఒక బొమ్మ ఉంది దాన్ని ఎవరో మర్చిపోయినట్టున్నారు. చిన్నపిల్లలకు బొమ్మలంటే ఇష్టం ఉంటుంది. ఈ బొమ్మ తిరిగి పిల్లాడికి చేర్చితే ఆ పిల్లాడు చాలా సంతోషిస్తాడు' అని చెప్పాడు. అయితే ఆ పిల్లాడు ఎవరు? ఏ ప్రాంతం వాడు? అతని తల్లిదండ్రులు ఎవరు? వంటి విషయాలు ఏవీ నాకు తెలియవని చెప్పాడు.
మొత్తం విన్న పోలీసులు మాకెందుకు ఒక బొమ్మ కోసం శ్రమ అనుకోకుండా అతను చెప్పినట్టు బొమ్మను పిల్లాడికి చేరుద్దామని అనుకున్నారు కానీ తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో ఏమి చెయ్యాలో మొదట అర్థం కాలేదు వారికి. మొదట బొమ్మను రికవర్ చేసుకుంటే ఆ తరువాత ఏదో ఒకటి చేద్దాం అనుకుని తమకు కాల్ చేసిన వ్యక్తి లైవ్ లొకేషన్ ఆధారంగా ఒకచోట బొమ్మను కలెక్ట్ చేసుకున్నారు. ఆ తరువాత ఆ వారం రోజుల్లో ప్రయాణికుల రిజర్వేషన్ వివరాలు, ప్రయాణించిన ప్రాంతాలు మొదలైనవాటి చిట్టా బయటకు తీసి ఎట్టకేలకు ఆ పిల్లాడి చిరునామా తెలుసుకున్నారు. వెంటనే వారి ఇంటికి చేరుకుని మరీ పిల్లాడి బొమ్మను అందజేసారు. బొమ్మను, రైల్వే వారిని చూసి పిల్లాడి తండ్రి ఆశ్చర్యపోయాడు. బొమ్మను ట్రైన్ లోనే మరచిపోయిన తరువాత పిల్లాడి ఏడుపు చూసి బాధగా అనిపించినా మరీ బొమ్మ కోసం ఫిర్యాదు చేస్తే సిబ్బంది ఎలా స్పందిస్తారోనని తాను సైలెంట్ అయిపోయానని అతను చెప్పాడు. కానీ రైల్వే సిబ్బంది చాలా మంచి మనసుతో వివరాలు కనుక్కుని మరీ బొమ్మను తెచ్చిచ్చారని అతను చెప్పాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు రైల్వే వారి స్పందన నిజంగా చాలా అభినందించదగ్గది అంటూ ప్రశంసిస్తున్నారు.