Naveen Murder Case : బాబోయ్.. బంపర్‌హిట్ సినిమా చూసి అచ్చుగుద్దినట్లుగా నవీన్‌ను చంపిన హరిహరకృష్ణ.. విచారణలో విస్తుపోయే నిజాలు..!
ABN , First Publish Date - 2023-03-04T20:39:05+05:30 IST
హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు (Naveen Murder Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు (Naveen Murder Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. అయితే.. నిందితుడు గురించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా.. రెండోరోజు పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. రెండోరోజు విచారణలో పోలీసులు ఏం తేల్చారు..? ఇంతకీ హరిహర ఫాలో అయిన ఆ సినిమా ఏంటి..? ఈ హత్యలో ఇంకా ఎవరైనా అతడికి సాయం చేశారా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అచ్చుగుద్దినట్లుగానే..!
నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు రెండోరోజు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్‌ను ఎలా హత్య చేయాలి..? హత్య చేసిన తర్వాత శరీర భాగాలు ఎలా వేరు చేయాలి..? అనేదానికి యూట్యూబ్‌లో (Youtube) పెద్దఎత్తున వీడియోలను నిందితుడు వెతికాడు. యూట్యూబ్ హిస్టరీని పోలీసులు నిశితంగా పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. ముఖ్యంగా నవీన్‌ను హత్య చేయడానికి బంపర్‌హిట్ మూవీ ‘విక్రమ్’ ఒకటి కాదు రెండు కాదు పదులసార్లు చూసినట్లు విచారణలో తేలింది. ‘విక్రమ్’ (Vikram Movie) సినిమాలో ఓ వ్యక్తిని చంపి తల, శరీర భాగాలను వేరు చేసే సన్నివేశం ఉంటుంది. సినిమాలో (రీల్‌లో) చూసిన హరిహరకృష్ణ నిజజీవితంలో (రియల్‌గా) నవీన్‌పై అచ్చుగుద్దినట్లుగానే ప్రయోగించాడని పోలీసులు తేల్చారు. ఆఖరికి వేరు చేసిన శరీర భాగాలను సంచిలో వేసుకుని ఆధారాలు దొరక్కుండా తగలబెట్టే సినిమా సీన్‌ను ఇక్కడ ఫాలో అయ్యాడు. అవన్నీ చూసిన హరిహర.. నవీన్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు నిగ్గుతేల్చారు.
సాయం చేసిందెవరు..!?
అయితే.. నవీన్ హత్యలో హరిహరకృష్ట స్నేహితుల సహాయం తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో మిగతా వారి ప్రమేయం ఉన్న వారి పేర్లు చెప్పడానికి హరిహర మొండికేస్తున్నాడు. హత్యకు ముందు ఆ తర్వాత ఎక్కువ సార్లు ఫోన్స్ మాట్లాడినట్లు పోలీసులు తేల్చారు. దీంతో.. హరిహరకృష్ణ కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా స్నేహితుల లిస్ట్‌ను పోలీసులు తయారు చేశారు. అయితే రెండ్రోజులుగా విచారిస్తున్నా.. ఓ వ్యక్తిని హత్య చేశాననే పశ్చాతాపం లేకుండా పోలీసులతో ప్రవర్తిస్తున్నాడు. కనీసం సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు ఖాకీలు కన్నెర్రజేస్తున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుండా నిందితుడు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. ఒక మృతదేహానికి పోస్టుమార్టం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు.. ఎంత నిపుణులుగా ఉన్నప్పటికీ కచ్చితంగా సహాయకులు కావాల్సిందే. అలాంటిది నవీన్ మృతదేహాన్ని హరిహర ఒక్కడే ఎలా చేశాడు..? ఇతనికి సహకరించిందెవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. హరిహర స్నేహితుడు (Hari Hara Friend) హసన్‌ను కూడా మరోసారి విచారణకు పిలిపించాలని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులకు సవాల్‌గా..!
హత్య కేసులో ఏమున్నా తనను మాత్రమే విచారించాలని పదే పదే పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. చట్టం గురించి తనకు బాగా తెలుసని పోలీసులకే హరిహర ఎదురు సవాల్ విసురుతున్నట్లు వార్తలు బయటికి పొక్కాయి. చట్టంలో ఉన్న లోసుగులే తనను బయటకు తీసుకొస్తాయని పోలీసుల ముందు నిందితుడు ప్రస్తావిస్తున్నాడట. అయితే.. తాను స్వయంగా లొంగిపోయాను కాబట్టి జీవిత కాల శిక్ష పడదని పోలీసులతో వాదిస్తున్నాడట. కస్టడీ ముగిశాక జైలుకు పంపినా కూడా తిరిగి బెయిల్‌పై బయటకు వస్తాని ధీమాలో హరిహర ఉన్నాడని సమాచారం. అయితే హత్య, చట్టాల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచుకున్నాడని పోలీసులు చెప్పుకుంటున్నారట.
మొత్తానికి చూస్తే.. నిందితుడు హరిహర పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు.. హరిహర స్నేహితురాలు కూడా ఇలానే ప్రవర్తిస్తోందట. ఈ ఇద్దరూ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబోయ్ అని పోలీసులే తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని.. ఇంకాస్త లోతుగా విచారించి అతి త్వరలోనే నిజానిజాలు తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా హరిహరకృష్ణకు సహకరించిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాలి.