Miss Asia: ఆడవాళ్ళ బాడీ ఫిట్‌గా ఉన్నా తప్పే.. మగవాళ్ళలా ఉన్నారనే కామెంట్స్ తప్పవు..!
ABN , First Publish Date - 2023-03-07T14:45:19+05:30 IST
మహిళలు మగవారి వృత్తుల్లోకి వస్తున్నారంటే అదీ మగవారు మాత్రమే చేయగలిగే సహసాలైతే మాత్రం..
మహిళలు సాధించని విజయాలంటూ లేవు. బలమైన సంకల్పం ఆమెది కావాలేకానీ ఆకాశాన్ని అందుకోగలదు. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నటి మిస్ ఆసియా సింగ్ నిరూపించింది. మహిళలు మగవారి వృత్తుల్లోకి వస్తున్నారంటే అదీ మగవారు మాత్రమే చేయగలిగే సహసాలైతే మాత్రం అది ప్రపంచానికి కాస్త చిత్రంగా, భిన్నంగా కనిపించడం మామూలుగా జరిగేదే. అయితే గేలిచేసే వారికి తన ఓపికతో, ధైర్యంతో విజయాన్ని అందుకునే సమాధానం చెపుతుంది స్త్రీ ఇప్పుడు అదే పని చేసింది నటి ఆకాంక్ష సింగ్.
తను అనుభవించిన మానసిక ఇబ్బంది నుంచి దూకే కెరటంలా మారింది ఆకాంక్ష, దాదాపు 10 గంటల పాటు ట్రెడ్‌మిల్ మీద నడక మొదలుపెట్టి విజయాన్ని అందుకోవడమే కాదు. ఎందరినో ఔరా అనిపించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ నడక సాగింది. ఈ కార్యక్రమం మాదాపూర్‌లో జరిగింది. ఆకాంక్షకు మద్దతుగా హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) శిల్పవల్లి ట్రెడ్‌మిల్ పై కాసేపు నడిపి ఆకాంక్షను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఆకాంక్ష మాట్లాడింది. ‘మానసిక కుంగుబాటు కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం కూడా సాధ్యం అవుతుంది. నా తల్లి కూడా ఇలాగే మానసిక కుంగుబాటుకు గురై అనేక సమస్యలను ఎదుర్కొంది. ఈ పరిస్థితి మిగతా మహిళలకు రాకూడదని.. వారిలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ట్రెడ్‌మిల్ మీద 9 గంటల పాటు నడిచాను. పరిస్థితులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. వాటి నుంచి బయటపడడానికి సమయం తీసుకున్నాను. అమ్మ ఆరోగ్యం చాలా సార్లు డిప్రెషన్ కుంగిపోయేలా చేసినా సరే.. ఎదిరించి నిలబడ్డాను. ఇదొక పరీక్షా కాలం అనుకున్నాను. బలంగా నిలబడ్డాను.
ఈప్రయత్నం నన్ను ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకునేలా చేసింది. చిరంజీవి నా ప్రయత్నాన్ని మెచ్చుకోవడం మరిచిపోలేను. నాదేముంది అల్లు అర్జున్ డాన్స్ చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. నా శరీరాన్ని కష్టపెట్టినా, మనసును దృఢంగా మార్చుకున్నాను. ఎంత సాధించినా ఆడవాళ్ళు బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టారంటే మిగతా జనాలు మగాళ్ళలా ఉన్నారని గేలి చేస్తారు. అసలు ఆడవాళ్ళు ఎందుకు ఈ పనులే చేయాలని అనుకుంటారో అసలు అర్థంకాదు. సంకల్పం ఉండాలే కానీ ఏ వృత్తికీ లింగభేదం లేదు. ప్రతి మహిళ తమ ఆరోగ్యం కోసం ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించాలి.’ అని ఆకాంక్ష సింగ్ చెప్పుకొచ్చింది.