Bhushan Kumar: భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు నో

ABN , First Publish Date - 2023-01-16T19:31:30+05:30 IST

సినిమాలు ఆడనప్పటికీ యువ నటులు రూ.30కోట్ల నుంచి రూ.35కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని భూషణ్ తెలిపాడు. అందువల్లే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పాడు. నటులు మార్కెట్‌ను అర్థం చేసుకుని పారితోషికం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నాడు.

Bhushan Kumar: భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు నో

బాలీవుడ్ నటులు అధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని బాలీవుడ్ బడా నిర్మాత, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ (Karan Johar) కొన్ని రోజుల క్రితమే తెలిపాడు. తాజాగా మరో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ (Bhushan Kumar) కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. సినిమాలు ఆడనప్పటికీ యువ నటులు రూ.30కోట్ల నుంచి రూ.35కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని భూషణ్ తెలిపాడు. అందువల్లే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పాడు. నటులు మార్కెట్‌ను అర్థం చేసుకుని పారితోషికం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కొంత మంది హీరోలు భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నారన్నాడు. అటువంటి వారితో నిర్మాతలు పని చేయడానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశాడు.

‘‘కరోనా అనంతరం ప్రపంచం మారిపోయింది. పెద్ద చిత్రాలతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. నటులు భారీగా అర్జిస్తున్నారు. నిర్మాతలు మాత్రం నష్టపోతున్నారు. చాలా మంది నటులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. కానీ, కొంత మంది మాత్రం పారితోషికం తగ్గించుకునేందుకు ఇష్టపడటం లేదు. సినిమాలు చేయడానికి అంగీకరించడం లేదు. ఇటువంటి వారితో పనిచేయడానికి మేం కూడా ఇష్టపడటం లేదు. ఒక్కో నటుడికీ రూ.20కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు పారితోషికం ఇస్తే మేం నష్టపోవాల్సి వస్తుంది. సినిమా బడ్జెట్‌కు నటులు న్యాయం చేయాలి. అప్పుడు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో స్టార్ హీరో సినిమాను అంగీకరించగానే ప్రాజెక్టును పట్టాలెక్కించేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లేవు. నిర్మాతలు కూడా చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ఆలోచిస్తున్నారు’’ అని భూషణ్ కుమార్ తెలిపాడు.

Updated Date - 2023-01-16T19:41:19+05:30 IST