Viral: ఉద్యోగాల తొలగింపు.. ఐటీ కంపెనీలతో ఈమె ఫుట్‌బాల్ ఆడుకుందిగా.. వైరల్ వీడియో..
ABN , First Publish Date - 2023-01-31T19:22:12+05:30 IST
ఐటీ ఉద్యోగాలు కోల్పోయిన వారి తరఫున టెక్ కంపెనీలపై ఓ కమెడియన్ పంచులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీల్లో జాబ్ పోగొట్టుకున్న(IT Layoffs) వాళ్ల ప్రస్తుత పరిస్థితిని మాటల్లో వర్ణించలేం. ఉద్యోగమే ప్రపంచంగా బతుకుతూ సంస్థల కోసం తమ శక్తినంతా ధారపోసిన వేల మంది ప్రస్తుతం రోడ్డున పడ్డారు. ఆర్థికమాంద్యం వచ్చేస్తోందంటూ కంపెనీలు అకస్మాత్తుగా తొలగించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొందరు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెళ్లబోసుకుంటే.. ఎందరో మౌనంగా బాధను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా కమెడియన్ శ్రద్ధ జైన్(Shraddha Jain) టెకీలపై చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె తన కామెడీ పంచ్‌లతో ఐటీ కంపెనీలను ఫుట్‌బాల్ ఆడుకుంది. ఎంతలా అంటే.. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా(Harsh Goenka) కూడా శ్రద్ధ పంచులకు ఫిదా అయిపోయారు. ఆమె వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఐటీ కంపెనీలో ఉద్యోగం పోగొట్టున్న వ్యక్తిలా నటిస్తూ శ్రద్ధ తన సెటైర్లతో కార్పొరేట్ సంస్థల దుమ్ముదులిపేసింది. తామంతా ఓ కుటుంబం అంటూ గొప్పలకు పోయే యాజమాన్యాల ధ్వంధ్వ వైఖరినీ ఆమె ఎండగట్టింది. ‘‘మనమంతా ఓ కుటుంబం అని సంస్థలు అంటాయిగా.. కుటుంబ సభ్యులను ఇలా ఎవరైనా వెళ్లగొడతారా.. కంపెనీ మంచి లాభం కళ్లచూసిందని గతేడాదే పార్టీ చేసుకున్నాంగా.. ఇంతలోనే ఏం జరిగింది. సరిగ్గా నెల తరువాత కంపెనీలో డబ్బులు కనుమరుగయ్యాయా.. ఎవరైనా దోచేశారా..’’ అని వ్యాఖ్యానించింది. ‘‘కంపెనీ హెచ్ఆర్ టీంలను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడాలని అవి తపించేవి. ఈ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టేవి. కానీ.. ఇప్పుడు వాళ్లే కనిపించకుండా పోయారు. అసలు ఉద్యోగులను నిలుపుకోవడంపై హెచ్‌ఆర్‌లు దృష్టి పెట్టి ఉంటే బాగుండేది..’’ అంటూ హెచ్‌ఆర్ టీమ్స్‌పైనా పంచులు విసిరింది. ‘‘పని చేసిన కంపెనీ కంటే.. మాజీ ప్రేమికులను మర్చిపోవడం తేలికని నాకిప్పుడు అనిపిస్తోంది. ఒకప్పుడు నా జీవితం అంతా కంపెనీయే.. నా టీషర్ట్, నేను వేసుకునే బ్యాగ్, రాసుకునే పెన్, కాఫీ కప్, నోట్ బుక్ ఇలా అన్నిటిపైనా కంపెనీ పేరు కనిపించేది. అవన్నీ కంపెనీయే ఇచ్చింది. ఇకపై ఏ కంపెనీ అయినా ఇలాంటివి ఇస్తే తిరస్కరించాలి. ప్యాకేజీ గురించి మాట్లాడుకుందాం.. బ్యాగేజీ గురించి కాదూ అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తా.’’ అంటూ వరుస పంచులతో ఐటీ కంపెనీల తీరును ఎండగట్టింది. ఐటీ జాబ్స్ పోగొట్టుకున్న వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వర్ణించడంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఏకంగా ఏడు లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో ఎంతలా ఆకట్టుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.