Kohinoor: కోహినూర్ వజ్రం విషయంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-14T21:28:03+05:30 IST

త్వరలో బ్రిటన్ రాజు చార్ల్స్ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది.

Kohinoor: కోహినూర్ వజ్రం విషయంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: కొద్ది నెలల్లో బ్రిటన్ రాజు చార్ల్స్ పట్టాభిషేకం(Coronation) జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని(Koh-i-Noor) వినియోగించకూడదని నిర్ణయించింది. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా(Queen Consort Camilla) కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించినా.. చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు సమాచారం(Kohinoor not to be used in coronation).

ప్రస్తుతం కోహినూర్ వజ్రం క్వీన్ మదన్ ఎలిజబెత్ కీరిటంలో ఉంది. ఈ కిరీటానికి బదులు.. క్వీన్ మేరీ ధరించిన కిరీటాన్ని క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా ధరించాలని రాజకుటుంబం నిర్ణయించింది. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేందుకు ఈ కిరీటం పరిమాణంలో మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్‌కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదగనున్నారు. ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్ల్స్ పట్టాభిషేకం జరుగుతుంది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగిస్తే భారత్‌తో దౌత్య పరమైన సమస్యలు తలెత్తొచ్చని బ్రిటన్‌లో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కోహినూర్‌ను తిరిగిచ్చేయాలని భారత్ ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్‌ను కోరిన విషయం తెలిసిందే.

కోహినూర్ వజ్రం చరిత్ర ఇదీ..

కోహినూర్ వజ్రం పుట్టుకకు సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. కోల్లూరులో ఈ వజ్రం తొలిసారిగా బయటపడిందని అధిక సంఖ్యాకుల నమ్మకం. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేదట. క్రీ.శ. 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు..ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటూ కోహినూర్‌నూ ఇచ్చేశాడట. అలా ఢిల్లీకి చేరుకున్న కోహినూర్ ఆ తరువాత పలు రాజవంశాల చేతులు మారుతూ చివరకు ఇబ్రహీం లోధీ వద్దకు చేరింది. ఆ తరువాత.. మొఘల్ రాజవంశ స్థాపకుడు బాబర్‌ చేతిలో లోదీ ఓటమి చెంది మరణించాడు. దీంతో.. కోహినూర్ మొఘలుల పరమైంది.

ఇక మొఘల్ సామ్రాజ్యం పతన సమయంలో ఇరాన్ బాద్‌షా నాదెర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి కోహినూర్‌ను తీసుకెళ్లిపోయాడు. అసలు ఆ వజ్రానికి కోహినూర్ అని పెరు పెట్టింది నాదెర్ షా అని కొందరు చెబుతారు. కాలక్రమంలో బ్రిటన్ మహాసామ్రాజ్యం అవతరించింది. ఈ క్రమంలోనే కోహినూన్ ఇరాన్ నుంచి చివరకు బ్రిటన్ రాజవంశం చేతుల్లోకి వెళ్లింది.

Updated Date - 2023-02-14T21:28:04+05:30 IST