Share News

Viral: అమెరికాలో పోలీస్ ఛేజింగ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మనకు ఇదే కావాలంటూ కామెంట్!

ABN , Publish Date - Dec 14 , 2023 | 09:10 PM

అమెరికాలో పోలీస్ ఛేజింగ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వీడియోలో కనిపించిన పరికరం మనకూ కావాలంటూ కామెంట్ చేశారు.

Viral: అమెరికాలో పోలీస్ ఛేజింగ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మనకు ఇదే కావాలంటూ కామెంట్!

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం నెట్టింట్లో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ఫాలోవర్లతో అనేక విశేషాల గురించి పంచుకుంటారు. ప్రపంచవ్యా్ప్తంగా జరిగే వింతలు, విశేషాలు, సమకాలీన ఘటనలపై తన అభిప్రాయాలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన అమెరికాలో జరిగిన ఓ పోలీస్ ఛేజింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. కారులో పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసుల ఉపాయం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి ఓ కీలక సూచన కూడా చేశారు. దీంతో, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.


అరిజోనా (Arizona) రాష్ట్రంలో ఈ దొంగ-పోలీస్ ఛేజింగ్ (Police Chasing Cop) సన్నివేశం జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ దొంగ కారులో తప్పించుకుని పారిపోతుంటే పోలీసులు అతడిని తమ కారులో వెంబడించారు. అయితే, అతడి కారును ఆపేందుకు వారు ఉపయోగించిన పరికరం ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. కార్లను ఆపే ఈ పరికరాన్ని గ్రాప్లర్ (Grappler) అని పిలుస్తారు. ఇందులో కొన్ని తాళ్లను వరుసగా కడతారు. ఈ ఏర్పాటును పోలీసు కారు ముందున్న కొక్కేనికి తగిలిస్తారు. దొంగలున్న కారును పట్టుకునే క్రమంలో పోలీసులు.. కొక్కేనికి ఉన్న తాళ్లు దొంగ కారు టైరు కిందకు పోనిస్తారు. దీంతో, తాళ్లు టైరు చుట్టూ చుట్టుకుని చిక్కుపడిపోతాయి. దీంతో, చక్రం తిరగక కారు ఆగిపోతుంది. వీడియోలో ఇదే జరిగింది.

అయితే, భారత దేశ ట్రాఫిక్ పోలీసులకు ఈ గ్రాప్లర్ కావాలన్న ఆనంద్ మహీంద్రా సూచనతో కొందరు నెటిజన్లు ఏకీభవించలేదు. గ్రాప్లర్‌తో కార్లు అకస్మాత్తుగా ఆగిన సందర్భాల్లో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో వీటితో మరింత ప్రమాదమని హెచ్చరించారు. మరికొందరు మాత్రం భారత్‌కు వీటి అవసరమే లేదని చెప్పుకొచ్చారు. ప్రతి అరకిలోమీటర్‌కూ ట్రాఫిక్ జాం ఎదురయ్యే దేశంలో గ్రాప్లర్ అవసరం ఏముందని ప్రశ్నించారు.

Updated Date - Dec 14 , 2023 | 09:10 PM