Ola: ఓలా క్యాబ్‌లో పనిచేయని ఏసీ.. ఓలా సీఈఓకు షాక్..
ABN , First Publish Date - 2023-01-27T17:55:31+05:30 IST
క్యాబ్ అగ్రిగేటర్ ఓలా(Ola) సేవల్లో లోపం ఉందంటూ కోర్టుకెక్కిన ఓ వినియోగదారుడికి ఊరట లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా(Ola) సేవల్లో లోపం ఉందంటూ కోర్టుకెక్కిన ఓ వినియోగదారుడికి ఊరట లభించింది. బాధితుడికి రూ.15 వేల పరిహారం(Compensation) చెల్లించాలంటూ న్యాయస్థానం ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను(Bhavish agarwal) ఆదేశించింది. బెంగళూరుకు(Bengaluru) చెందిన వికాస్ భూషన్ 2021 అక్టోబర్‌లో ఓలాలో ప్రైమ్ సిడాన్ కారును బుక్ చేసుకున్నాడు. సౌకర్యవంతంగా ఉండేందుకు ఎక్సాట్రా లెగ్ రూం, ఏసీ ఉండేలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే.. ప్రయాణం మొదలవడంతోనే అతడికి అసౌకర్యం మొదలైంది. కారులో ఏసీ పనిచేయకపోవడంతో(defunct AC) ఆయన ఏసీ లేకుండానే ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది. రైడ్ పూర్తయ్యాక రూ. 1837 బిల్ వచ్చింది. దీంట్లో ఏసీ చార్జీలు కూడా కలిసి ఉండటంతో ఆయన ఓలా కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. ఏసీ చార్జీల మేరకు రీఫండ్ ఇవ్వాలని కోరారు. అయితే..రేట్ కార్డ్ ప్రకారమే బిల్లు సిద్ధమైందని, ఏసీ చార్జీలు కలపలేదని కస్టమర్ కేర్ వారు సమాధానవిచ్చారు.
దీంతో..వికాస్ నేరుగా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్‌ను సంప్రదించారు. జరిగిన విషయాన్నంతా ప్రస్తావించారు. ట్విటర్‌లోనూ ఆయనను సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ..కంపెనీ సీఈఓ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చివరకు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ ద్వారా 2021 నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. తనకు రీఫండ్ ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఓలా కారులో ఏసీ పనిచేయలేదని అంగీకరించింది. కానీ..రీఫండ్‌కు బదులుగా రూ.100 విలువగల వోచర్ ఇస్తామని పేర్కొంది. వికాస్‌కు తిక్కరేగడంతో ఆయన ఏకంగా కంపెనీ సీఈఓ భవిష్‌పై బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ కంస్యూమర్ రిడ్రెసల్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆసాంతం పరిశీలించిన న్యాయమూర్తులు ఓలాదే తప్పని తేల్చారు. ‘‘వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఓలా బాధ్యత. ఏసీ పనిచేయకపోయినా మొత్తం బిల్లును తీసుకున్నట్టు కంపెనీ స్వయంగా అంగీకరించింది. ఓలా తీరు కారణంగా వినియోగదారుడికి ఇబ్బంది కలిగింది.’’ అని వ్యాఖ్యానించింది. బాధితుడికి పరిహారంగా కంపెనీ సీఈఓ రూ.10 వేల చెల్లించాలని, అతడి న్యాయఖర్చుల కింద మరో ఐదు వేలు ఇవ్వడంతో పాటూ అతడు ఓలాకు చెల్లించిన రూ.1837లను వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని ఆదేశించింది.