Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!
ABN , First Publish Date - 2023-08-29T10:46:18+05:30 IST
రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
కృషి ఉంటే మనుషులు ఋుషులవుతారు అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించిన ధీరూభాయ్ అంబానీ వ్యాపారం మీద ఆసక్తి ఉన్న ఎందరికో స్పూర్తిగా నిలుస్తారు. పెట్రోల్ బంకులో కేవలం 300రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ 62వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు. ఈ యేడాది ఆగస్టు 28వ తేదీన రియలన్స్ సంస్థ 46వ వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలుసుకుంటే..
చదువుకు వ్యాపారానిరకి సంబంధం లేదని, విద్యావంతులే కోట్లు సంపాదించగలరనే మాట అక్షరాలా అబద్దం. చదువుతో సంబంధం లేకుండా కోట్ల వ్యాపారాన్ని స్థాపించినవారున్నారు. ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ(Dhirajlal Hirachand Ambani) అందులో ప్రముఖులు. ధీరూభాయ్ గా అందరికీ సుపరిచితమైన ఈయన 1932, డిసెంబర్ 28న గుజరాత్ రాష్ట్రం(Gujarat), జునాగఢ్ జిల్లాలో చోర్వాడ్(Chorwad) అనే గ్రామంలో ఈయన జన్మించాడు. నలుగురు పిల్లలలో ఈయన ఒకరు. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు అయినా చాలీచాలనీ జీతంలో నలుగురు పిల్లల పోషణ భారంగా ఉండేది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువుకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంటి పరిస్థితి రోజు రోజుకూ ఇబ్బందిగా మారుతుండటంతో ఏదో ఒక పని చేయాలని ధీరూభాయ్ అనుకున్నాడు. 1949లో తన 17ఏళ్ళ వయసులో తన సోధరుడితో కలసి యెమెన్(Yemen) వెళ్లాడు. అక్కడ బస్సీ& కో అనే పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. అప్పుడు అతని జీతం నెలకు 300రూపాయలు(300 rs salary ). పని విషయంలో చాలా నిబద్దతగా ఉండేవాడు, వంకలు చెప్పి పని ఎగ్గొట్టడం లాంటివి చేసేవాడు కాదు. పైగా బాగా కష్టపడేవాడు. ధీరూభాయ్ పనితీరు నచ్చి కొంత కాలంలోనే ఆయన్ను పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ గా నియమించారు. అలా 5సంవత్సరాలపాటు అతను యెమెన్ లోనే పనిచేసి డబ్బు పోగేశాడు. ఆ తరువాత 1954లో తిరిగి భారతదేశానికి వచ్చాడు.
Viral: ఆమె అమ్మాయేనని తోడబుట్టిన వాళ్లకూ తెలియదు.. 38 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టడంతో..!
యెమెన్ లో పనిచేసి వచ్చిన తరువాత ధీరూభాయ్ కి ఉద్యోగం విషయంలో సందిగ్థత ఏర్పడింది. అతను ఎవరికిందా పనిచేయడానికి ఇష్టపడలేదు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. తనే సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. భారతదేశ మార్కెట్ గురించి అన్ని వివరాలు సేకరించాడు. భారతదేశంలో పాలిస్టర్ కు అత్యధిక డిమాండ్ ఉందని, విదేశాలలో భారతీయ మసాలా దినుసులకు ఆదరణ బాగుందని నిర్ణయించుకున్నాడు. వీటి వ్యాపారానికి గానూ తన బంధువు చంపక్ లాల్ తో కలసి రిలయన్స్ కమర్షియల్ కార్పోరేషన్ కంపెనీని(Reliance commercial corporation company) స్థాపించాడు. ముంబైలోని 350చదరపు అడుగుల గదిలో ఈ కంపెనీ ప్రారంభమైంది. 1టేబుల్, 3కుర్చీలు, ఇద్దరు సహాయకులు, ఒక టెలిఫోన్ ఈ గదిలో ఉండేవి. ఇతని కంపెనీ విదేశాల్లో భారతీయ మసాలా దినుసులను అమ్మేది, అలాగే విదేశాల నుండి పాలిస్టర్ దిగుమతి చేసుకుని భారతదేశంలో అమ్మేవాడు. ఈ వ్యాపారం బాగా కలిసొచ్చింది. దీన్ని కొనసాగిస్తూనే 1966లో రియలన్స్ టెక్స్టైల్స్(Reliance Textile) స్థాపించి సింథటిక్ దుస్తులపై దృష్టి సారించాడు. మంచి నాణ్యత కారణంగా అతని వేగం పుంజుకుంది.
1977లో ధీరూభాయ్ అంబానీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. దీంతో అతను కొత్తగా ఆలోచించాడు. రిలయన్స్ టెక్స్టైల్స్ కంపెనీని స్ఠాక్ మార్కెట్ లో జాబితా చేసి కంపెనీ షేర్లను అమ్మడం మొదలుపెట్టాడు. షేర్ హోల్టర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయం ఫలితంగా రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టే సగటు పెట్టుబడిదారులు కూడా షేర్లు కొనుగోలు చేయగలిగారు. ఇలాంటి ఆలోచన చేసిన మొదటి భారతీయ కంపెనీ రిలయన్సే. అప్పటి నుండి కంపెనీ ప్రతి సంవత్సరం వార్షక సమావేశం(Annual General Meeting) నిర్వహిస్తోంది. రిలయన్స్ పెట్టుబడిదారులు దీనికి ఆహ్వానించబడతారు. వారితో రిలయన్స్ భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకోవడం జరుగుతుంది. దీని ద్వారా పెట్టుబడిదారుల నమ్మకాన్ని గెలుచుకోగలుగుతున్నారు. ఇది కూడా ధీరూభాయ్ విజయంలో ఒక సూత్రమని దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని వారు అంటున్నారు.