Gas cylinder: వామ్మో... గ్యాస్ సిలిండర్ ధర గత నాలుగేళ్లలో ఇంత పెరిగిందా?.. వినియోగదారులకు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-05T16:12:10+05:30 IST

అంతకంతకూ పెరిగిపోతున్న వంటగ్యాస్ (Gas cylinder) ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మోయలేని భారంగా మారుతున్నాయి. ధరలు తగ్గుతాయనే ఆశలు వినియోగదారుల్లో పూర్తిగా సన్నగిల్లిపోతున్నాయి...

Gas cylinder: వామ్మో... గ్యాస్ సిలిండర్ ధర గత నాలుగేళ్లలో ఇంత పెరిగిందా?.. వినియోగదారులకు తెలిస్తే..

న్యూఢిల్లీ: అంతకంతకూ పెరిగిపోతున్న వంటగ్యాస్ (Gas cylinder) ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మోయలేని భారంగా మారుతున్నాయి. ధరలు తగ్గుతాయనే ఆశలు వినియోగదారుల్లో పూర్తిగా సన్నగిల్లిపోతున్నాయి. ఇటివలే గృహ వినియోగ సిలిండర్ (LPG Price) ధర రూ.50 మేర పెరగడంతో జనాల్లో ఈ అభిప్రాయం మరింత బలపడింది. వంట గ్యాస్ రేటు రూ.1100 దాటిపోయిన నేపథ్యంలో ధర పెరుగుదలకు సంబంధించిన కీలకమైన గణాంకాల ట్రెండ్‌ను ఒకసారి పరిశీలిద్దాం...

గృహ వినియోగ వంట గ్యాస్ ధర (Gas cylinder price) గత నాలుగేళ్లలో సుమారు 56 శాతం మేర పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కేజీలు) ఆర్ఎస్‌పీ (రిటైల్ సెల్లింగ్ ప్రైస్) ఏప్రిల్ 1, 2019న రూ.706.50గా ఉండగా 2020లో రూ.744కి పెరిగింది. ఇక 2021లో రూ.809 నుంచి 2022లో రూ.949.50కి చేరింది. తాజాగా మార్చి 1, 2023న ఏకంగా రూ.1153కి పెరిగింది.

భారీగా తగ్గిపోయిన సబ్సిడీ..

ఈ ట్రెండ్‌ను బట్టి గత కొన్నేళ్లుగా వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయని స్పష్టమవుతుండగా... ఇదే సమయంలో ఎల్‌పీజీపై అందించిన సబ్సిడీ గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం అందించిన సబ్సిడీని పరిశీలిస్తే.. ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ.37,209 కోట్లు ఉండగా 2019-20లో ఇది రూ.24,172 కోట్లకు పడిపోయింది. 2021-21లో రూ.11,896 కోట్లు, 2021-22లో రూ.1,811 కోట్లకు తగ్గిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా దేశంలో ఎల్‌పీజీ సహా ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ధరలపై ఆధారపడి ఉంటాయని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చెబుతోంది. కాగా గృహ వినియోగ వంటగ్యాస్ విక్రయాలపై ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. రూ.22,000 కోట్ల భారీ నష్టపరిహారాన్ని ఏకమొత్తంలో చెల్లించేందుకు ఇటివలే ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించింది.

Updated Date - 2023-03-05T16:14:53+05:30 IST