Viral: ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగి.. నేడు సొంతంగా హెలికాఫ్టర్ కొనేందుకు డీల్.. ఇంతకీ వ్యక్తి ఏం చేసి సంపాదిస్తున్నాడంటే..!
ABN , First Publish Date - 2023-07-04T19:10:45+05:30 IST
బ్యాంకు ఉద్యోగం కాదనుకుని వ్యవసాయంలోకి దిగిన ఓ వ్యక్తి చివరకు కోటీశ్వరుడయ్యాడు. వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆయన చివరకు ఉత్తమ రైతుగా ప్రభుత్వం అవార్డు కూడా పొందారు. చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆయన దేశవ్యాప్తంగా ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తులో ఏం జరగుతుందో ఎవరీ తెలియదు. నచ్చిన పని చేస్తూ ఆటంకాలకు బెదరక ముందుకు సాగిపోవడమే మనిషి కర్తవ్యం. చత్తీస్‌ఘడ్‌కు(Chhattisgarh) చెందిన రాజారామ్ త్రిపాఠీ(Rajaram Tripathi) సరిగ్గా ఇదే చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రముఖ సంస్థలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా(SBI PO) ఎంపికైన ఆయన వ్యవసాయంలోకి దిగారు. సాగునే(Farming) నమ్ముకుని కోట్లకు పడగలెత్తారు.
నక్సల్ కార్యకలాపాలకు పేరుపడ్డ బస్తర్ జిల్లాలోని జగ్దాల్‌పూర్‌లో ఆయన ఉంటున్నారు. 1996లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అయిదు ఎకరాల్లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. అశ్వగంధ, నేతతాడి అనే మూలిక సాగును ప్రారంభించారు. మొదటి ప్రయత్నంలోనే మంచి లాభాలు రావడంతో ఆయన మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయంలోకి దిగిపోయారు. ఆ తరువాత తన సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వెళ్లారు.
కానీ, 2002లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో నేలతాడి ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఆయనకు నష్టాలు మిగిల్చింది. ఇంతటి కష్టసమయంలోనూ ఆయన బెదరక కొత్త ఐడియాతో సమస్యను అధిగమించారు. నల్ల మిరియాలు, స్టేవియా సాగువైపు మళ్లారు. సాగులో పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడులను సాధించారు. ఆ తరువాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ప్రస్తుతం రాజారమ్ వెయ్యి ఎకరాల్లో400 మంది గిరిజనుల సాయంతో వివిధ రకాల వనమూలికలను సాగు చేస్తున్నారు. మా దంతేశ్వరీ హెర్బల్ గ్రూప్ పేరిట ఓ కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాలకు నల్ల మిరియాలు, వనమూలికలను ఎగుమతి చేస్తో్ంది. సాగులో అత్యాధునిక పద్ధతులు పాటించే ఆయన ఈ దిశగా కొత్త మెళకువలు నేర్చుకునేందుకు అప్పుడప్పుడూ విదేశాలకు వెళ్లివస్తుంటారు. ఈమారు ఆయన సాగులో ఏకంగా హెలికాఫ్టర్‌నే వినియోగించుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు కోసం రాబిన్సన్ డచ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సాగు అవసరాలకు సరిపడా ఈ హెలికాఫ్టర్లో అనేక ఫీచర్లు ఉంటాయి. దీన్ని నడిపేందుకు ఆయన కుమారుడు ప్రస్తుతం ఉజ్జెయిన్‌లోని వైమానిక శిక్షణ కేంద్రంలో ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. వ్యవసాయంలో ఆయన కృషిని గురించిన ప్రభుత్వం రాజారామ్‌ను ఉత్తమ రైతు అవార్డుతో(Best farmer) సత్కరించింది. తన విజయాలను చూసైనా యువత వ్యవసాయంలోకి రావాలని రాజారామ్ త్రిపాఠీ ఆంకాక్షించారు.