Indira Bhyri : నా శవానికి పసుపు రాయకండి.. పిల్లలు జడుసుకుంటారు..!
ABN , First Publish Date - 2023-02-20T10:10:08+05:30 IST
తెలంగాణా గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్ సంకలనాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
"ఏ కొమ్మల్లో కోయిలవై కూస్తావో... ఏ చెట్టుకు పువ్వై పూస్తావో.. నీ మలి మజిలీ ఏమై ఉంటుందో... కాకాపోతే నీలా మరణించడం మాత్రం ఎవరికీ చేతనవదు నేస్తం"...
మరణం ఇప్పుడే రావాలని లేదు, మరణానికి అంచున ఉండి, మరణాన్ని స్వాగతించే ధైర్యం అందరిలోనూ ఉండాలని లేదు. ఆమె మరణాన్ని తీసుకున్న తీరు, మరణాన్ని ఆహ్వానించిన విధానం, మనస్సుని మెలితిప్పి మౌనంలోకి నెట్టేస్తుంది. రోజులో ఎందరు పుట్టి ఎందరు పోతున్నారు. ఇదేం ప్రత్యేకమైన మరణమా? అంటే అవుననే అనాలి. ఆమెకు తెలుసు తను వెళ్ళే రోజు దగ్గరలోనే ఉన్నదని, దానిని కూడా కవిత్వంతో కప్పి, సందేశంగా మలచి పంపగల స్వభావం, అందరిలోనూ ఉండదు. కనుకే ఆమె మరణం అజరామరం.
గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని భైరి ఇందిర హైదరాబాద్‌లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్‌లలో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో పాల్గొన్నారామె. ఇందిరా భైరి స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భర్త ఉద్యోగరిత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇందిరా భైరి వందల సంఖ్యలో గజల్స్ రాశారు. తెలంగాణా గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్ సంకలనాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి జనరంజక కవి పురస్కారం అందుకున్నారు ఇందిర. కొన్నాళ్ళుగా కెన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె కోలుకున్నట్టే కోలుకుని ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె కవిత్వంలోని పదును తెలిసిన కవిలోకం ఈ అనుకోని పిడుగులాంటి వార్తకు అదిరిపడింది. తన చావును ముందే ఊహించినట్టుగా, తనుపోతే శరీరం మీద వస్త్రానికి బదులు కాగితాన్ని కప్పమని, కన్నీళ్ళు పెట్టవద్దని, పాడేకు కోడిపిల్లను కట్టవద్దని, కలం ఇస్తే కవిత్వం రాస్తానని ఇలా ప్రతి పంక్తిలోనూ తన మరణాన్ని గురించి హృదయ విధారకంగా రాసుకొచ్చిన ఇందిర పదాల పదును, మనసున్న ప్రతి ఒక్కరినీ రాపిడికి గురిచేస్తుంది.
#నేను పోయినప్పుడు ....
.................................................
నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది.
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్!
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ!
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది
నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి
మంగళవారమైనా సరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి
కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో!
బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి ...
పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది!
_ Indira Bhyri