Health Facts: రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటుంటారా..? మధుమేహం తప్పక వస్తుంది అనడానికి 5 కారణాలు..!
ABN , First Publish Date - 2023-10-19T09:36:10+05:30 IST
రాత్రి ఆలస్యంగా పడుకున్నా ఉదయం లేటుగా లేస్తున్నాంలే సరిపడినంత నిద్ర అయితే ఉంది కదా అని అనుకుంటారు. కానీ నిజంగా జరిగేది మాత్రం ఇదే..
ఆరోగ్యకరమైన జీవితానికి మంచి నిద్ర ఎంతో అవసరం. అయితే నేటి కాలంలో ఉద్యోగాలు, చదువుల కారణంగా చాలామంది సరిగా నిద్రపోవడం లేదన్నది వాస్తవం. రాత్రి 8గంటలకు భోజనం చేయడం, 10గంటలలోపు నిద్రపోవడం అనే అలవాటు దాదాపు తగ్గిపోయింది. దీనికి బదులుగా మొబైల్లోనూ, సిస్టమ్స్ లోనూ నెట్ బ్రౌజింగ్ చేస్తూ రాత్రి ఎప్పుడో 2 లేదా 3 గంటలకు నిద్రపోవడం, రాత్రి షిప్ట్ ఉద్యోగాలు చేయడం ముఖ్యంగా యువతలో ఎక్కువగా ఉంది. రాత్రి ఆలస్యంగా పడుకున్నా ఉదయం లేటుగా లేస్తున్నాంలే అనుకుంటారు. కానీ ఇలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సైలెంట్ కిల్లర్ అని పిలుచుకునే చక్కెర వ్యాధి చిన్నవయసులోనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న బలమైన కారణాలను కూడా వారు వివరించారు. అవేంటో తెలుసుకుంటే..
మన శరీరంలో స్కిరాడియన్ రిథమ్(circadian rhythms) ఉంటుంది, దీన్ని నిద్రాచక్రం అని అంటారు. ఇది శరీరంలో గ్లూకోజ్ జీవక్రియ నుండి ఎన్నో రకాల ప్రక్రియలను నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోయేవారిలో ఈ స్కిరాడియన్ రిథమ్ క్రమం తప్పుతుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణను ప్రతికూలంగా మారుస్తుంది. ఈ కారణం వల్ల మధుమేహం వస్తుంది.
రాత్రెప్పుడో 2 లేదా 3 గంటలకు నిద్రపోవడం.. మళ్లీ ఉదయాన్నే లేవడం కాలేజీలు లేదా ఉద్యోగాలకు పరుగులు పెట్టడం.. కొందరి దినచర్య ఇలా ఉంటుంది. మనిషికి రోజుకు కనీసం 6-8గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. కానీ పై దినచర్య వల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడితే టైప్-2 మధుమేహం వస్తుంది.
Wife: నా భర్తకు విడాకులు ఇస్తున్నా.. ఇక ఈ గర్భం అవసరం లేదంటూ.. అబార్షన్ కోసం హైకోర్టు కెళ్లిందో మహిళ.. చివరకు..!
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారు ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు(poor food habits). చాలామంది రాత్రి సమయాల్లో స్నాక్స్ పేరుతో ప్యాక్డ్ ఫుడ్ తింటూ ఉంటారు. వీటిలో చక్కెర శాతం, అనారోగ్యకరమైన కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. సోడియం కూడా ఎక్కువగానే ఉంటుంది. పైపెచ్చు రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాలన్నీ మధుమేహానికి దారితీస్తాయి.
రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారు వ్యాయామం చేయడానికి అసలు సమయమే దొరకడంలేదని చెప్పడం తరచుగా చూస్తునే ఉంటాం. ఉదయం ఆల్యంగా నిద్రలేవడం, ఉద్యోగాలు, కాలేజీల కారణంగా చీకటిపడేవేళకు ఇంటికి చేరడం, ఆ తరువాత కూడా మొబైల్, సిస్టమ్ బ్రౌజింగ్ లో ఎక్కువసేపు గడపడం వంటి కారణంగా వ్యాయామానికి సమయం ఉన్నట్టు అనిపించదు. ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి, శారీరక వ్యాయామం చెయ్యనివారికి టైప్-2 డయాబెటిస్ చాలా తొందరగా వస్తుంది.
సరైన నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్లు ప్రభావితం అవుతాయి. ఇది ఒత్తిడి పెరడానికి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చెయ్యడంలోనూ కారణం అవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, దీర్ఘకాల మానసిక అనారోగ్యం మధుమేహానికి దారితీస్తుంది. నేటికాలంలో మధుమేహం కేసులు చిన్నవయసులోనే నమోదు అవుతుండటం వల్ల ఆహారం నుండి జీవనశైలి, అలవాట్లు మొదలైన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.