Health Facts: గాఢ నిద్రలో ఉండగా కొంత మంది ఎందుకు ఏడుస్తుంటారు..? ఈ 10 కారణాల వల్లేనా..?
ABN , First Publish Date - 2023-10-19T15:27:32+05:30 IST
ఉన్నట్టుండి నిద్రలో పెద్దపెట్టున ఏడుస్తుంటారు కొందరు. దానివెనుక కారణాలు ఇవేనంటూ డాక్టర్లు కొన్ని విషయాలు బయటపెట్టారు.
నిద్రలో మనిషి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటాడు. అందుకే నిద్రలో కలలు అనుభూతి చెందుతారు. కొందరు నిద్రలో మాట్లాడటం, నవ్వడం, ఏడవడం చేస్తుంటారు. కానీ అలా చేసనట్టు వారికి తెలియదు. ఉదయం లేవగానే కుటుంబ సభ్యులు ఎందుకు నిద్రలో అలా నవ్వావనో లేదా ఏడిచావనో చెబితే షాకవుతారు. అసలు నిద్రలో ఏడవడం(crying in sleep) ఎందుకు జరుగుతుంది? దీని వెనుక గల 10కారణాలను కలలమీద పరిశోధనలు చేసే నిపుణులు బయటపెట్టారు. అవేంటో చూస్తే..
నిద్రలో నవ్వడం ఏడవడం అనేది వ్యక్తుల మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. చాలావరకు పీడకలలు, భయంకరమైన కలలు వచ్చినప్పుడు, కలలో తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనపుడు ఏడవడం జరుగుతుందని అంటారు. వ్యక్తులలో భయం, ఆతురత వాటికి సంబంధించిన విషయాలు కలలో అలాంటి అనుభూతిని కల్పించవచ్చు.
జీవితంలో చాలా పెద్ద మానసిక దెబ్బలు తిన్న వ్యక్తులు తరచుగా కలలో భావోద్వేగాలకు లోనవుతారు. వ్యక్తులలో అణిచివేయబడిన భావోద్వేగాలకు చిహ్నంగా కలలో కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ భావోద్వేగాలు చాలా ప్రభావవంతంగా ఉన్నప్పుడు భౌతికశరీరం కూడా భావోద్వేగానికి లోనై ఏడవడం జరుగుతుంది.
Heart Attacks: జిమ్ లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ లు.. డాక్టర్లు చెబుతున్న 10 షాకింగ్ కారణాల లిస్ట్ ఇదీ..!
ఇష్టమైనవారు చెయ్యిజారిపోతున్నట్టు, మరణిస్తున్నట్టు కలలు వస్తే అలాంటి సందర్బంలో అసంకల్పిత చర్యలాగా నిద్రలో ఏడవడం జరుగుతుంది.
ఎక్కువకాలం నుండి ఉన్న ఆందోళన, విచారం కలలను ప్రభావితం చేస్తాయి. ఇవి నిద్రపోతున్నప్పుడు మానసిక క్షోభను సృష్టిస్తాయి. నిద్రలో ఏడవడం ఎప్పుడూ మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పడానికి పెద్ద సంకేతం.
మనిషిలో భావోద్వేగాలను అణిచివేయడం వల్ల మనిషి అంతర్గతంగా ఒత్తిడిలోకి జారిపోతాడు. కోపం, నవ్వు, బాధ, లైంగిక విషయాలను అణిచిపెడితే అవి కలల రూపంలో డిస్టర్బ్ చేస్తాయి.
ఇప్పటి జీవితాలు చాలావరకు ఒత్తిడితో కూడుకున్నవే. ఒత్తిడి కలిగించే ఉద్యోగాలు, బంధాల కారణంగా భావోద్వేగాలు లోలోపల పెరిగిపోతాయి. ఇవి నిద్రలో ఏడుపుకు కారణం అవుతాయి.
ఆరోగ్యం కోసం ఉపయోగించే కొన్ని రకాల మందులు నిద్ర సంబంధిత సమస్యలు కలిగిస్తాయి. మందుల వల్ల ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే అవి నిద్రలో ఏడుపుకు కారణం అవుతాయి.
నిద్రలో ఏడవడమనే సమస్యకు ముఖ్యకారణం మానసిక పరిస్థితులు అని అంటారు. బైపోలార్ డిజార్డర్, మూడ్ స్వింగ్స్, అతిగా ఆలోచించడం వంటి పరిస్థితులలో ఉన్నవారు నిద్రలో ఏడుస్తుంటారు.
స్లీప్ అప్నియా, ఇన్సోమ్నియా, రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి నిద్రకు సంబంధించిన జబ్బులు ఉన్నవారికి సరైన నిద్ర ఉండదు. ఇవి మానసిక వేదన కలిగిస్తాయి.
నిద్రలో ఏడవడం కొన్నిసార్లు జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను వదిలించుకోవడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చని కొందరు అన్నారు. ఏదిఏమైనా ఇలా నిద్రలో ఏడవడం మానసిక ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.