ఇతడికి సొంతూరిపై ఎంత ప్రేమ.. గ్రామస్తులందరికీ ఉచితంగా విద్యుత్ సరఫరా..

ABN , First Publish Date - 2023-03-23T21:40:41+05:30 IST

వెదురుతో హైడల్ ప్రాజెక్టును నిర్మించాడు.. గ్రామంలో వెలుగులు నింపాడు..

ఇతడికి సొంతూరిపై ఎంత ప్రేమ.. గ్రామస్తులందరికీ ఉచితంగా విద్యుత్ సరఫరా..

ఇంటర్నెట్ డెస్క్: పుట్టిపెరిగిన ఊరంటే అతడికి ఎంతో ప్రేమ. కానీ ఆ ఊరంతా సమస్యల నిలయంగా మారింది. ముఖ్యంగా గ్రామస్తులను విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. తన చిన్ననాటి నుంచీ ఇదే పరిస్థితి. ఊరివారి కష్టాలను చూసిన అతడిలో పట్టుదల పెరిగింది. అదే చివరకు ఆ గ్రామంలో వెలుగులు నింపింది. అతడి కృషి కారణంగా ప్రస్తుతం ఆ గ్రమంలో ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల కేదార్ ప్రసాద్ మహాతో స్వస్థలం ఝార్ఖండ్‌లోని(Jharkhand) బయాంగ్(Bayang) గ్రామం. కేదార్ చదువును మధ్యలోనే ఆపేశాడు. అతడికి సైన్స్‌పై అసలు ఎటువంటి పట్టూ లేదు. కానీ.. గ్రామస్తుల కష్టాలు చూస్తూ పెరిగిన అతడిలో చిన్ననాడే ఓ కల రూపుదిద్దుకుంది. గ్రామంలో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్న తపన మొదలైంది. ఆ తపనే అతడిని ముందడుగు వేసేలా చేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా రంగంలోకి దిగిన అతడు సొంతంగా ఓ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాడు. అది కూడా వెదురుతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. 2కేవీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాడు. ఇందుకు కోసం రూ.3లక్షలను ఖర్చు పెట్టాడు. అతడి ప్రయత్నం సఫలీకృతం కావడంతో ఆ గ్రామం ఇప్పుడు విద్యుత్ వెలుగులతో కొత్త అందం సంతరించుకుంది. గ్రామంలోని దేవాలయంతో పాటూ వీధుల్లోని లైట్లన్నీ హైడల్ ప్లాంట్ సాయంతోనే వెలుగుతున్నాయి.

2.jpg

గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నింపిన కేదార్ ఆవిష్కరణపై ఏకంగా నాబార్డ్(NABARD) బ్యాంకు దృష్టి పడింది. తాజాగా బ్యాంకు అధికారులు ఆ ప్లాంట్‌ను సందర్శించారు. కేదార్ సృజనాత్మకత చూసి ఆశ్చర్యపోయారు. అతడు నిర్మించిన ప్లాంట్‌ను మరింత విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతమున్న టెక్నాలజీతో ఓ చిన్న గ్రామం అవసరాలు తీర్చేలా హైడల్ ప్రాజెక్టు(Hydel Project) నిర్మించేందుకు కనీసం రూ. 10 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే.. కేదార్ రూపొందించిన వెదురు మోడల్‌తో అయిదో వంతు ఖర్చుతోనే హైడల్ ప్రాజెక్టును నిర్మించవచ్చు. ఇక ఈ ప్లాంట్ నిర్వహణకు అదనపు ఖర్చేమీ అవసరం లేదని కేదార్ తెలిపాడు. రోజుకు నాలుగు గంటల పాటు ఈ ప్లాంట్ నడుపుతూ గ్రామ విద్యుత్ అవసరాలను కొంత మేరకు తీర్చగలుగుతున్నామని చెప్పొకొచ్చాడు కేదార్.

Updated Date - 2023-03-24T18:13:46+05:30 IST