Bangalore Vidhana Soudha: ఆ గది మాకొద్దు.. 329పై కర్ణాటక మంత్రుల విముఖత.. ఎందుకంత భయపడుతున్నారంటే..
ABN , First Publish Date - 2023-05-27T18:59:38+05:30 IST
కర్ణాటక రాష్ట్రానికి శక్తి కేంద్రమైన విధానసౌధలో మంత్రులకు గదులు కేటాయించడం సాధరణ విషయమే. అయితే 329వ గది అంటే చాలు.. ‘బాబోయ్ మాకొద్దు’ అంటూ..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రానికి శక్తి కేంద్రమైన విధానసౌధలో మంత్రులకు గదులు కేటాయించడం సాధరణ విషయమే. అయితే 329వ గది అంటే చాలు.. ‘బాబోయ్ మాకొద్దు’ అంటూ ముఖం చాటేస్తున్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిపి 34 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. మెజారిటీ మంత్రులు కర్ణాటక విధాన సౌధలోని 329వ గదిని పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇదే గదిలో గతంలో మంత్రులుగా కొనసాగినవారు అర్ధంతరంగా మృతి చెందడమేనని తెలుస్తోంది.
ఇదే చాంబర్‌లో కాంగ్రెస్ పాలనలో కీలకమంత్రిగా వ్యవహరించిన మహదేవ్‌ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత బీజేపీ పాలనలో సీనియర్ నేత అయిన ఉమేశ్‌కత్తి కూడా ఇదే చాంబర్‌నుంచే కార్యకలాపాలు సాగించారు. ఆయన కూడా అనూహ్యంగా గుండెపోటుతో కన్నుమూశారు. అదే భయం వెంటాడుతుండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రులు కేజే జార్జ్, సతీశ్‌జార్కిహొళి, ప్రియాంకఖర్గే, మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి సదరు చాంబరు మాకొద్దంటూ అధికారులకు విన్నవించారు. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండే సతీశ్‌జార్కిహొళి సైతం సదరు గది వద్దని కోరినట్టు తెలుస్తోంది.