Indian Railways: ఒకటే టికెట్.. ఏకంగా 56 రోజుల పాటు జర్నీ.. రైలు ప్రయాణాలు చేసే చాలా మందికి తెలియని విషయమిది..!
ABN , First Publish Date - 2023-09-04T18:17:29+05:30 IST
తీర్థయాత్రలు, పర్యాటనలపై వెళ్లే వారికి బాగా ఉపయోగపడే రైలు టిక్కెట్ ఏదీ అంటే సర్క్యులర్ టిక్కెట్లేనని అనుభవజ్ఞులు చెబుతారు. రాను పోనూ విడివిడిగా టిక్కెట్లు కొనేదాని కంటే ఈ టిక్కెట్ ధర తక్కువగా ఉండటంతో పాటూ సమయం కూడా ఆదా అవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అత్యధిక మంది వినియోగించే ప్రజారవాణా సాధనం రైలు. ఇక రైలు ప్రయాణం ఇచ్చే అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులుగా మన బాధ్యతలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా, ప్రయాణికులకు రైల్వే కల్పించే సదుపాయాలేవో కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు రైల్వే శాఖ(Indian Railways) చాలా రకాల టిక్కెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇక తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి అత్యంత అనువుగా ఉండేది సర్క్యులర్ జర్నీ టిక్కెట్. మరి ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా? లేదా..అయితే ఈ విశేషాల గురించి తెలుసుకోవాల్సిందే.
సర్క్యులర్ జర్నీ టిక్కెట్(Circular journey ticket).. పేరుకు తగ్గట్టుగానే ఇది రానూ పోనూ ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు మీ ఊరి నుంచి ఏదైనా పర్యటనకు వెళ్లి వద్దామనుకుంటున్నట్టైతే ఈ టిక్కెట్ మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. రాను పోను ప్రయాణాలకు వేర్వేరుగా టిక్కెట్ కొనుక్కోవడం కంటే ఇదే బెటర్ అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే, ఈ టిక్కెట్‌పై ప్రయాణించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధన ఏంటంటే..రైలు ఎక్కడ ఎక్కారో మళ్లీ అక్కడే దిగాలి. రానూ పోనూ జర్నీ టిక్కెట్ల బెడద లేకపోవడంతో పాటూ టిక్కెట్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇక టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాల కేటగిరీల్లోనూ ఈ టిక్కెట్ జారీ చేస్తారు. 56 రోజుల కాలపరిమితిపై జారీ చేసే ఈ టిక్కెట్ తీర్థయాత్రలు చేసేవారికి ఉపయోగపడుతుందని చెబుతారు.