Kohinoor Diamond: బ్రిటన్ మహారాణి కేమిలా.. కోహినూర్ వజ్రాన్ని వద్దనడానికి కారణం ఇదేనా..

ABN , First Publish Date - 2023-02-22T20:23:17+05:30 IST

కోహినూర్ వజ్రం ధరిస్తే నిజంగా శాపం తగులుతుందా?. చరిత్ర ఏం చెబుతోంది? అనే ఆసక్తి చర్చ మొదలైన నేపథ్యంలో కోహినూర్‌కు సంబంధించిన చారిత్రాక అంశాలపై ఓ లుక్కేద్దాం...

Kohinoor Diamond: బ్రిటన్ మహారాణి  కేమిలా.. కోహినూర్ వజ్రాన్ని వద్దనడానికి కారణం ఇదేనా..

యునైటెడ్ కింగ్‌డమ్ మహారాజు చార్లెస్-3, మహారాణిగా ఆయన సతీమణి కేమిలా పట్టాభిషేకం 2023 మే 6న జరగబోతోంది. అయితే అంగరంగవైభవంగా జరగనున్న ఈ కార్యక్రమంలో తన కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని (Kohinoor Diamond) ధరించకూడదని క్వీన్ కన్సార్ట్ కేమిలా నిర్ణయించుకున్నారు. గత చరిత్ర, కొన్ని నమ్మకాలే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేది. ఆ కిరీటాన్ని ఆమె అంత్యక్రియల సమయంలో కేమిలా ధరించారు. కానీ పట్టాభిషేకం సమయంలో మాత్రం ధరించరాదని కేమిలా నిర్ణయించుకోవడంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోహినూర్ వజ్రం ధరిస్తే నిజంగా శాపం తగులుతుందా?. చరిత్ర ఏం చెబుతోంది? అనే ఆసక్తి చర్చ మొదలైన నేపథ్యంలో కోహినూర్‌కు సంబంధించిన చారిత్రాక అంశాలపై ఓ లుక్కేద్దాం...

పురుషులు ధరిస్తే నాశనమేనా!

ఏకంగా 105.6 కేరట్లు (21.12 గ్రాములు) బరువుండే ఈ కోహినూర్ వజ్రానికి ఎంతటి విలువుందో.. దానిచుట్టూ అన్ని వివాదాలు ఉన్నాయి. అంతేకాదు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ధరించిన పురుషుడు ప్రపంచాన్ని సొంతం చేసుకుంటాడని, అయితే దానివల్ల కలిగే దురదృష్టాలను కూడా అనుభవిస్తాడని ఓ హిందూ గ్రంథంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం భగవంతుడు లేదా మహిళలు మాత్రమే దీనిని ధరించవచ్చునేది ప్రచారంలో ఉంది. ఇక 1893లో దులీప్ సింగ్ దుర్భర దారిద్ర్యంతో పారిస్‌లోని ఓ హోటల్‌లో ప్రాణాలు విడిచారు. అప్పటి నుంచి కోహినూర్ వజ్రాన్ని పురుషులు ధరిస్తే నాశనమైపోతారనే వదంతులు మరింత వ్యాపించాయి. మహిళలు దీనిని ధరించడం వల్ల హాని ఉండదని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఈ వజ్రాన్ని బ్రిటన్ రాజవంశంలోని మహిళలే ధరిస్తున్నారు. కాగా మహారాణి కేమిలా మాత్రం తన పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించుకోవడం గమనార్హం. మరి ఆమె ఏ కారణంగా ఈ నిర్ణయానికి వచ్చారనేదానిపై స్పష్టత లేదు. ఒకవేళ తర్వాత ఏమైనా చెబుతారేమో వేచిచూడాలి.

Untitled-6.jpg

చరిత్రలో జరిగిన వీటిని నిరాకరించలేం...

ఈ వజ్రం కోసం అన్నదమ్ములు, తండ్రీకొడుకులు పరస్పరం కొట్టుకున్నారని, ఇది ఎవరి దగ్గర ఉంటే వారి జీవితాల్లో హింస, హత్యలు, తిరుగుబాట్లు, నమ్మకద్రోహాలు కనిపిస్తాయనే ప్రచారం ఉంది. మూఢనమ్మకాలను నమ్మినా, నమ్మకపోయినా దీని చరిత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. ఈ వజ్రం కోసం హిందూ, మంగోలియన్, పర్షియన్, ఆఫ్ఘన్, సిక్కు పాలకులు భీకర యుద్ధాలు చేశారు. దీనిని సొంతం చేసుకున్న ప్రతి రాజు తన అధికారాన్ని కానీ, తన ప్రాణాలను కానీ కోల్పోయేవారని చరిత్ర చెబుతోంది.

దాదాపు 500 సంవత్సరాలకుపైగా దీని కోసం యుద్ధాలు జరిగాయి. ఖిల్జీ, తుగ్లక్, లోఢీ, మొఘల్, మరాఠా, పర్షియన్, దుర్రానీ, ఆఫ్ఘన్ ఖనటే, సిక్కు సామ్రాజ్యాలు దీని కోసం పోరాడి, సాధించి, ఆ తర్వాత కుప్పకూలిపోయాయి. మొఘలు సామ్రాజ్యంలోకి కోహినూర్ వజ్రం ప్రవేశించిన తర్వాత ఆ రాజవంశం బలహీనపడింది. ఆఫ్ఘన్ రాజులకు కూడా దీనివల్ల ఇదే గతి పట్టింది. ప్రపంచాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న సామ్రజ్యాలు సైతం దీని ప్రభావానికి గురైనట్లు చెబుతారు. ఈ వజ్రం వచ్చిన తర్వాత సిక్కు సామ్రాజ్యం పతనమైంది. సిక్కు మతస్థుడైన మహారాజా రంజిత్ సింగ్ రాజవంశమే దీనిని ధరించిన చిట్టచివరి రాజవంశం. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధంలో రంజిత్ సింగ్ ఓటమిపాలయ్యారు. దీంతో పంజాబ్ ప్రాంతం 1849లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలన క్రిందకు వెళ్లింది. దాంతోపాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ వజ్రం ఆ కంపెనీ వద్దకు వెళ్లిన ఏడు లేదా ఎనిమిదేళ్ళలో, అంటే 1857లో తిరుగుబాటు మొదలైంది. ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ మూలాల నుంచి ధ్వంసమైంది.

Untitled-8.jpg

రంజిత్ సింగ్‌కు నలుగురు వారసులు, మహారాణి ఉన్నారు. ఈ వంశంలో అనేక మంది కిరాతక హత్యకు గురయ్యారు. రంజిత్ సింగ్ కుమారుడు యువరాజు దులీప్ సింగ్ వయసు అప్పట్లో 15 సంవత్సరాలు. తల్లి వద్ద ఉంటే ఆ బాలుడికి బ్రిటన్ రాజులకు వ్యతిరేక భావాలను నూరిపోస్తుందనే ఉద్దేశంతో, ఆ బాలుడిని లండన్‌కు బ్రిటిష్ పాలకులు పంపించారు. ఆ బాలుడి వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ క్వీన్ విక్టోరియాకు లాహోర్ ఒప్పందంలో భాగంగా ఇప్పించారు. ఈ వజ్రం 1850లో క్వీన్ విక్టోరియా చెంతకు వెళ్లింది. ఆ తర్వాత క్వీన్ అలెగ్జాండ్రా ఆఫ్ డెన్మార్క్, క్వీన్ మేరీ ఆఫ్ టెక్, క్వీన్ ఎలిజబెత్ (1936) దీనిని ధరించారు. ఈ వజ్రం బ్రిటన్‌కు చేరిన తర్వాత, బ్రిటిష్ సామ్రాజ్యం తన వలస రాజ్యాలను ఒక్కొక్కటిగా కోల్పోయింది. దీంతో కోహినూర్ వజ్రం ఎవరి స్వాధీనంలో ఉంటే, వారికి నష్టం తప్పదనే నమ్మకం బలపడింది.

చరిత్ర పుటల్లో ఇలా..

మొఘల్ చక్రవర్తి జహీరుద్దీన్ బాబర్ 1526లో భారత దేశానికి వచ్చినపుడు ఆయన రాసిన బాబర్ నామాలో కోహినూర్ వజ్రం ప్రస్తావన కనిపిస్తుంది. ప్రపంచం ఓ రోజులో చేసే ఖర్చులో సగం విలువగల వజ్రం ఇది అని ఆయన పేర్కొన్నారు. పానిపట్ యుద్ధంలో గెలిచినందుకు ఆయనకు ఈ వజ్రం బహుమతిగా లభించిందనే వాదన ఉంది. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1628లో తన నెమలి సింహాసనంలో ఈ వజ్రాన్ని పెట్టించినట్లు రికార్డులు చెప్తున్నాయి.

పర్షియన్ చక్రవర్తి నాదిర్ షా 1739లో ఢిల్లీని జయించి, మొఘలుల సంపదను కొల్లగొట్టాడు. అప్పట్లో ఈ వజ్రాన్ని చూసి, ‘ఎన్ కోహ్-ఇ-నూర్’ అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పర్షియన్ భాషలో దీనికి ‘‘ప్రకాశవంతమైన వెలుగు పర్వతం’’ అని అర్థం. అప్పటి నుంచి దీనిని కోహినూర్ వజ్రమని పిలుస్తున్నట్లు ఓ కథ వెల్లడిస్తోంది. మొఘల్ సామ్రాజ్యంపై దండయాత్ర చేసిన నాదిర్ షా నెమలి సింహాసనంతో సహా గొప్ప సంపదను 1732లో పర్షియాకు దోచుకెళ్ళాడు. ఈ సంపదలో కోహినూర్ వజ్రం కూడా ఉంది. అనంతరం అహ్మద్ షా దుర్రానీ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌కు చేరింది. ఆ తర్వాత ఇది ఆయన మనుమడు జమన్ షా దుర్రానీ వద్దకు చేరింది. ఆయన సోదరుడు షా షుజాహ్ దుర్రానీ నుంచి మహారాజా రంజిత్ సింగ్‌ వద్దకు వెళ్లింది. దీంతో ఇది తిరిగి అప్పటి భారత దేశానికి చేరినట్లయింది. ఇది రాచరిక అధికారానికి గుర్తు అని భావించిన రాజులు దీని కోసం తీవ్రంగా పోరాడారు. బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో దోచుకున్న సంపదలో ఇది కూడా ఓ భాగం అయిపోయింది.

Untitled-7.jpg

భారత్-బ్రిటన్ మధ్య ఎడతెగని గొడవ..

కోహినూర్ వజ్రం గురించి భారత్-బ్రిటన్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి వివాదం నడుస్తోంది. 13వ శతాబ్దానికి పూర్వం విజయ నగర సామ్రాజ్య కాలంలో గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనుల్లో దీనిని గుర్తించినట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. మొదట్లో ఈ వజ్రానికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని తెలుస్తోంది. ఇక ఈ వజ్రం తమదంటే తమదంటూ భారత్‌తోపాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ కూడా వాదిస్తున్నాయి. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చి, దీనిని తాము చట్టబద్ధంగా పొందామని చెబుతోంది. కాగా గతేడాది బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణానంతరం కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ మరింత పెరిగింది. ఇక భవిష్యత్‌లో ఈ కోహినూర్ వజ్రం ఇంకెన్ని చర్చలకు దారితీస్తుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-22T20:35:55+05:30 IST