Shocking: కరోనాతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు.. తీరిగ్గా ఇప్పుడు ఇంటికొచ్చాడు!
ABN , First Publish Date - 2023-04-16T16:57:35+05:30 IST
అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం కరోనా(Covid) సోకి పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు.
ఇండోర్: అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం కరోనా(Covid) సోకి పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇప్పటికి రెండేళ్లు కావడంతో కుటుంబ సభ్యుల స్మృతి పథం నుంచి అతడు క్రమంగా కనుమరుగయ్యాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇంటికొచ్చి అందరికీ షాకిచ్చాడు. ఇంటికొచ్చిన అతడిని చూసిన కుటుంబ సభ్యులు కాసేపు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఎందుకైనా మంచిదని గిచ్చి చూసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన కమలేశ్ పటీదార్ (35) కరోనా సెకండ్ వేవ్ సమయంలో కొవిడ్-19 బారినపడ్డాడు. దీంతో అతడిని గుజరాత్ వడోదర ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు మృతదేహాన్ని అప్పగించడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగి సరిగ్గా రెండేళ్లు అయింది.
కరోడ్కలా గ్రామంలో శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ ఇంటి తలుపు చప్పుడైంది. ఇంటి పెద్ద వెళ్లి తలుపు తీసి ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి షాకయ్యాడు. ఒక్క క్షణం తనను తాను నమ్మలేకపోయాడు. ఎదురుగా ఉన్నది రెండేళ్ల క్రితం మరణించిన కమలేశ్ పటీదార్. ఇప్పుడు వచ్చింది మేనత్త ఇంటికి.
అతడిని అలా చూసినందుకు చాలా ఆనందంగా ఉందని, అయితే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడన్న వివరాలను కమలేశ్ చెప్పలేకపోతున్నాడని అతడి కజిన్ చెప్పుకొచ్చారు. కమలేశ్ పటీదార్ కరోనా బారినపడి చికిత్స పొందుతూ చనిపోవడం, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించడం అంతా నిజమేనని పోలీసులు పేర్కొన్నారు. అతడి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత కానీ ఈ మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు.