Viral Video: విమానంలో విండో సీటు కోసం మహిళల ఫైట్.. దెబ్బకు రెండు గంటలు ఆగిపోయిన విమానం!
ABN , First Publish Date - 2023-02-04T21:10:02+05:30 IST
బస్సులోనో, రైలులోనే వెళ్తున్నప్పుడు విండో సీటు కోసం పోటీ పడడం సర్వసాధారణమైన విషయం. మరి విమానంలో అయితే?..
న్యూఢిల్లీ: బస్సులోనో, రైలులోనే వెళ్తున్నప్పుడు విండో సీటు కోసం పోటీ పడడం సర్వసాధారణమైన విషయం. మరి విమానంలో అయితే?.. ఇదేం ప్రశ్న అనిపిస్తోందా? అవును! విమానంలోనూ విండో సీటు కోసం పోటీ పడ్డారు. పోటీ పడడం కాదు.. కుమ్మేసుకున్నారు. బ్రెజిల్‌లోని ‘గోల్ ఎయిర్‌లైన్స్’(GOL Airlines) విమానంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 15 మంది ప్రయాణికులు విమానంలో నానా రభస చేశారు. సీట్లు ఎక్కి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తోటి ప్రయాణికులు వారిస్తున్నా, విమాన సిబ్బంది ఆపుతున్నా ఒక్కరు కూడా వెనక్క తగ్గలేదు సరికదా మరింతగా రెచ్చిపోయారు. ఫలితంగా విమానం రెండు గంటలు ఆలస్యమైంది.
బ్రెజిలియన్ న్యూస్ అవుట్‌లెట్ ‘అవెంచురాస్ నా హిస్టోరియా’ (Aventuras na História) ప్రకారం.. గోల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సాల్వడార్-కాంగోన్‌హాస్ విమానం G31659 టేకాఫ్ కావడానికి కొన్ని క్షణాల ముందు రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. వైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడి కోసం సీటు మార్చుకోగలరా? అని ఓ తల్లి తోటి ప్రయాణికుడిని అడిగింది.
అందుకు ఆ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ సహ ప్రయాణికుడి కుటుంబంపై విరుచుకుపడింది. వారిపై దాడిచేసింది. ఇది మరింత పెద్దదై ఇరు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. రెండు కుటుంబాలకు చెందిన దాదాపు 15 మంది విమానంలోనే చితక్కొట్టేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, విమాన కెప్టెన్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేశారు.
తాను దాదాపు విమానం తలుపులు మూసివేయబోతున్న సమయంలో గొడవ జరిగిందని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు. విమానం మధ్య వరుసలో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ దాడులు చేసుకుంటూ అరాచకం సృష్టించారని సిబ్బంది పేర్కొన్నారు. వారి గొడవను చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అయింది.
గొడవ పడిన ప్రయాణికులను దించేసి రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది. 2021లోనూ ఇలాంటి ఘటనే ఒకటి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. సీటు కోసం మొదలైన గొడవలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి కొట్టుకున్నారు. న్యూ ఓర్లీన్స్ నుంచి బయలుదేరిన విమానం టెక్సాస్‌లో ల్యాండయ్యాక వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.