Meaning of Marriage: అమ్మ బాబోయ్.. పెళ్లంటే ఏంటన్న ప్రశ్నకు ఈ పిల్లాడు రాసిన సమాధానం చదివితే అస్సలు నవ్వాపుకోలేరు..!
ABN , First Publish Date - 2023-04-02T15:51:09+05:30 IST
పిల్లలకు అవగాహన లేని విషయాల మీద వారి సమాధానాలు భలే చమత్కారంగా.. మరింత ఫన్నీగా ఉంటాయి
పిల్లలు ఏది మాట్లాడినా వారి ముద్దు ముద్దు పలుకులతో చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు తల్లిదండ్రుల పెళ్ళిపోటోలు చూసినప్పుడు 'మీ పెళ్ళిలో నేను ఎందుకు లేను?' వంటి అమాయక ప్రశ్నలు అడుగుతుంటారు. పిల్లలకు అవగాహన లేని విషయాల మీద వారి సమాధానాలు భలే చమత్కారంగా.. మరింత ఫన్నీగా ఉంటాయి. పెళ్ళంటే ఏంటి? అనే ప్రశ్నకు ఓ బుడతడు రాసిన సమాధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సమాధానం గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
సోషియల్ స్టడీస్(Social studies) పరీక్షలో భాగంగా తరగతి పిల్లలకు పెళ్ళంటే ఏంటి? అని ఓ 10మార్కుల ప్రశ్న(10 Marks Question) ఇచ్చారు. దానికి సమాధానం వివరంగా రాయమని పేర్కొన్నారు. సదరు విద్యార్థి ఆ ప్రశ్నకు రాసిన సమాధానం నెట్టింట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అమాయకమైన పిల్లలకు శాస్త్రీయమైన కారణాలు తెలీవు. వారి కంటికి కనిపించేదే వారికి అర్థమవుతుంది. పెళ్ళి గురించి సదరు పిల్లాడికి అదే అర్థమైంది కాబోలు. 'పెళ్ళంటే.. ఒక అమ్మాయి పెద్దగవ్వడం, అలా పెద్దగయ్యాక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో ఇక నువ్వు పెద్దగయ్యావు.. నిన్ను మేము పోషించలేము.. నిన్ను పోషించే వ్యక్తిని వెతుక్కో అని చెబుతారు. అప్పుడు ఆ అమ్మాయి తనను పోషించే వాడికోసం వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయిని పెళ్ళిచేసుకోమని పోరుతూ ఉంటారు. దీంతో అతను అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురవుతారు. ఒకరినొకరు పరీక్షించుకుని తరువాత వారిద్దరూ పెళ్ళిచేసుకుంటారు. ఆ తరువాత పిల్లలకోసం తప్పు పనులు చేస్తారు'.. ఇదీ ఆ బుడతడు రాసిన సమాధానం.
పిల్లాడు రాసిన సమాధానం చూసి సదరు సోషియల్ టీచర్(Social Teacher) కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. పాపం పిల్లాడి సమాధానం మొత్తం తప్పు అయినట్టు ఇంటూ మార్క్ వేసి 10మార్కులకు సున్నా వేశాడు.'నాన్ సెన్స్'(NONsence) అనే ఒక ట్యాగ్ కూడా తగిలించాడు. అసలే పిల్లల పరీక్షా కాలం కావడంతో ఈ సమాధాన పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలలో ఉన్న విభిన్న ఆలోచనలు ఇలా పరీక్షా సమాయాలలోనే బయటకు వస్తాయి. @srpadaa అనే ట్విట్టర్ యూజర్ ఈ సమాధాన పత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ సమాధాన పత్రం చూసిన నెటిజన్లు పొట్టచక్కలయ్యెలా నవ్వుతున్నారు. 'ఈ పిల్లవాడు చిన్నవాడు అయినా జీవిత సత్యం గ్రహించేశాడు' అని కొందరు కామెంట్స్ చేశారు. 'ఆ పిల్లాడు రాసినదాంట్లో తప్పేముంది? నిజమే రాశాడు కదా.. ఆ టీచర్ అలా సున్నా మార్కులు వేయడం సరికాదు' అంటూ నిరసన వ్యక్తం చేశారు. 'ఆ టీచర్ మార్కులు వేయకపోతేనేం.. మేము 10కి 10 మార్కులు ఇస్తాం ఆ పిల్లాడికి' అని మరికొందరు కామెంట్ చేశారు. ఈ బుడతకు ఏదైనా పతకం ఇవ్వండ్రా బాబూ.. ఇంత వయసులోనే జీవిత సత్యం తెలుసుకున్నాడు అని మరికొందరు స్పందించారు. ఇలా కామెంట్లతో ఈ పోస్ట్ మార్మోగిపోతోంది. ఏదిఏమైనా తెలిసీ తెలియని అమాయకత్వంతో పిల్లలు చేసే పనులు చాలా ఫన్నీగా ఉంటాయి.