Ram Charan: ‘ఫార్మాలా-ఈ’ రేసుపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-11T20:43:40+05:30 IST
భారత్‌లో జరుగుతున్న ‘ఫార్ములా- ఈ’ (Formula E) తొలి రేసుకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా భాగ్యనగరం ఘనతను దక్కించుకుంది.
భారత్‌లో జరుగుతున్న ‘ఫార్ములా- ఈ’ (Formula E) తొలి రేసుకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా భాగ్యనగరం ఘనతను దక్కించుకుంది. హుసేన్‌సాగర్ తీరప్రాంతంలో 2.8 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. ఈ రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లు హవాను చూపించారు. భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగాయి. ఈ- రేసుని వీక్షించేందుకు సెలబ్రిటీలు భారీ ఎత్తున తరలివచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్ తదితరులు ఈ రేసులో సందడి చేశారు.
రేసుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘అద్భుతమైన రేసు. మహీంద్ర రేసింగ్ టీమ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లతో ఈ రోజు ‘ఫార్ములా-ఈ’ రేసును చూడటం థ్రిల్‌గా ఉంది. దేశంతో పాటు రాష్ట్రం, నగరానికి ఈ రేసు ఎంతో గర్వకారణం’’ అని రామ్ చరణ్ తెలిపారు. భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఈ రేసును వీక్షించారు. రామ్ చరణ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ మధ్య ఎక్కడ చూసిన ఆయనే కనిపిస్తున్నారు. ‘ఫార్ములా- ఈ’ రేసు ప్రారంభోత్సవంలోను పాల్గొన్నారు. తన అభిమానిని హాస్పిటల్‌లో పరామర్శించారు. ‘ఆర్‌సీ15’ షూటింగ్ కోసం కర్నూలు వెళ్లారు. షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చి చివరి రేసును కూడా వీక్షించారు. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌సీ15’ (RC15)లో నటిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. స్టార్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.