Happy Pi Day : ఇది లేకపోతే సైంటిస్ట్‌లకు క్షణం గడవదు!
ABN , First Publish Date - 2023-03-14T19:57:24+05:30 IST
గణితశాస్త్రవేత్తలు, సైంటిస్టులకు మార్చి 14 పండుగ రోజు. ఈ రోజును పై (Pi) దినోత్సవంగా జరుపుకుంటారు. వృత్తం యొక్క పరిధి,
న్యూఢిల్లీ : గణితశాస్త్రవేత్తలు, సైంటిస్టులకు మార్చి 14 పండుగ రోజు. ఈ రోజును పై (Pi) దినోత్సవంగా జరుపుకుంటారు. వృత్తం యొక్క పరిధి, దాని వ్యాసం మధ్య నిష్పత్తిని సూచించే స్థిరాంకాన్ని పై (Pi) అంటారు. పై (Pi) ఉజ్జాయింపు విలువ 3.14. అందుకే మార్చి 14ను పై (Pi) డే అని పిలుచుకుంటారు. సైన్స్‌లో దీని ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓ జాబితాను నాసా (NASA- American space agency) ప్రచురించింది. దీనిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం.
మ్యాపులను గీయడం :
భూమిపై పర్యటిస్తూ ఏయే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ, గతంలో మ్యాపులను గీసేవారు. అదేవిధంగా రోదసీ నౌకలు ఇతర గ్రహాల చుట్టూ తిరిగినపుడు కూడా మ్యాపులను తయారు చేస్తాయి. నీరు ఏ విధంగా ప్రవహిస్తోంది? వంటివాటిని ఈ మ్యాపులలో చూపిస్తాయి. ఈ రోదసీ నౌకలకు అమర్చే కెమెరాలు చతురస్రాకార దృష్టిని కలిగియుంటాయి. ఇవి గ్రహాల ఉపరితలాన్ని పట్టీలు పట్టీలుగా చిత్రీకరిస్తాయి. యావత్తు గ్రహాన్ని మ్యాప్ రూపంలో చిత్రీకరించేందుకు ఎన్ని చిత్రాలను తీయాలో లెక్కగట్టడం కోసం సైంటిస్టులు ఓ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఈ ఫార్ములాలో పై (Pi) ఉంటుంది.
నూతన ప్రపంచాలను కనుగొనడంలో... :
సుదూరంగా ఉండే గ్రహాలను అన్వేషించడానికి కూడా సైంటిస్ట్‌లకు పై (Pi) అవసరం ఉంటుంది. సుదూరంగా ఉండే నక్షత్రాలు విడుదల చేసే కాంతిని గుర్తించడానికి భూమిపైన, రోదసిలో శక్తిమంతమైన టెలిస్కోపులు ఉంటాయి. మన సౌర వ్యవస్థకు వెలుపల ఉండే గ్రహం ఓ నక్షత్రాన్ని దాటుకుని వెళ్తే, ఆ నక్షత్రం విడుదల చేసే కాంతి పరిమాణంలో డిప్‌ను టెలిస్కోప్ గుర్తిస్తుంది. నక్షత్రం ముందు నుంచి వెళ్లిన ఆ గ్రహం పరిమాణాన్ని తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఈ పెర్సెంటేజ్ ఫిగర్‌ను, వృత్తం యొక్క వైశాల్యాన్ని కొనుగొనడానికి ఉపయోగించే ఫార్ములాను ఉపయోగిస్తారు.
జీవికి ఆశ్రయమిచ్చే గ్రహాల గుర్తింపు :
మన సౌర వ్యవస్థకు వెలుపల గ్రహాలను కనుగొన్నపుడు, వాటిలో జీవులు జీవించేందుకు అవకాశం ఉంటుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం చెప్పడానికి సైంటిస్ట్‌లు పై (Pi)ని ఉపయోగిస్తారు. ఏదైనా గ్రహం ఆవాసయోగ్యమైనది కావాలంటే, అది గోల్డీలాక్స్ జోన్‌లో ఉండాలి. అంటే ఆ గ్రహం తన నక్షత్రానికి చాలా దూరంగా కానీ, చాలా దగ్గరగా కానీ ఉండకూడదు. జీవించడానికి అనువుగా ఉండేవిధంగా సరైన స్థాయిలో ఉష్ణోగ్రతను పొందుతూ ఉండాలి. ఓ నక్షత్రం చుట్టూ ఉన్న గోల్డీలాక్స్ జోన్ అంతర, బాహ్య అంచులను గుర్తించేందుకు సైంటిస్టులు పై (Pi)ని ఉపయోగిస్తారు. ఆ గ్రహం ఆ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత కాలం పడుతుందో తెలుసుకోవడానికి పై (Pi)ని, కెప్లెర్స్ థర్డ్ లాను ఉపయోగిస్తారు. ఆ గ్రహం కచ్చితంగా ఎక్కడ ఉంది? గోల్డీలాక్స్ జోన్‌లో ఉందా? అనే అంశాలను నిర్థరిస్తారు.
అంగారక గ్రహంపైకి దిగడం కోసం...
అంగారక గ్రహం (Mars)పైకి ల్యాండ్ రోవర్స్, ల్యాండర్స్‌ను పంపించడానికి కూడా పై (Pi)ని వాడతారు. మార్స్ ల్యాండింగ్ అంతా ఒకే విధంగా ఉండదు. అయితే అన్నిటిలోనూ సామాన్యంగా కనిపించేవి పారాచూట్స్. అంగారక గ్రహం ఉపరితలంపై దేనినైనా వదిలితే, అక్కడి వాతావరణం వల్ల దాని వేగం తగ్గుతుంది. దీని కోసం పారాచూట్లను డిజైన్ చేసేటపుడు, ఇంజినీర్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. రోదసి నౌక (Spacecraft) బరువు, వేగం, వాతావరణ సాంద్రత వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఎంత పెద్ద పారాచూట్ అవసరమవుతుందో నిర్ణయించడంలో పై (Pi) ఉపయోగపడుతుంది.
గ్రహ శకలాలు, ఉల్కల జాడను గుర్తించడంలో...
పై (Pi) సహాయంతో గ్రహ శకలాలను, ఉల్కలను కూడా గుర్తించవచ్చు. ఇవి ఎంత వేగంగా తిరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. భూమిపై నుంచి చేసే పరిశోధనల ఆధారంగా సైంటిస్టులు ఓ వస్తువు తన అక్షంపై ఒకసారి పూర్తిగా తిరగడానికి ఎంత సమయం పడుతుందో నిర్థరించవచ్చు. దీనికి ఉపయోగించే సూత్రంలో కూడా పై (Pi) ఉంటుంది. ఆ వస్తువు గ్రహ శకలమా? ఉల్క? అనే విషయాన్ని ఈ సూత్రంతో నిర్ణయించవచ్చు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Same-sex marriage : స్వలింగ వివాహాలపై బయటపడిన ఆరెస్సెస్ వైఖరి