National Girl Child Day 2023 : ఆమెను రక్షించాల్సింది ఆమె మాత్రమే..!

ABN , First Publish Date - 2023-01-24T15:07:51+05:30 IST

కుటుంబంలో ఇద్దరే బిడ్డలు ముద్దని, ముగ్గురు వద్దనే కాలం పోయి ఒక్కరినే సరిపెట్టుకుందామనే కల్చర్ వచ్చాకా అందులో బాలికల శాతం మరింత తగ్గింది

National Girl Child Day 2023 : ఆమెను రక్షించాల్సింది ఆమె మాత్రమే..!
National Girl Child Day 2023

ఆడపిల్ల పుట్టిందంటే చిన్న చూపు, చదువు చెప్పించి, పెంచి పోషించి మరో ఇంటికి పంపేలోపు ఆమెను భద్రంగా చూసుకోవాలంటే భయం. ఎన్నో రంగాలలో మగవారితో ధీటుగా మహిళలు విజయాలు సాధిస్తున్నా ఇంకా 60, 50 ఏళ్ళ నాటి ఆలోచనా విధానం ఎందుకు మారడం లేదు. శిశు హత్యలు, గర్భస్రావాల రేటు ఎందుకు పెరుగుతున్నాయి. ఈ జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆమె జయాప జయాలను తలచుకుందాం.

ఆడపిల్ల పెరుగుతుందంటే ఆమెను సురక్షితంగా కాపాడుకోలేని పరిస్థితులెదురవుతున్నాయి. రాను రాను నగరాల్లో, పల్లెల్లో పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వయసుతో పనిలేకుండా ఆడవారిపై హింసకు పాల్పడేలా చేస్తున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. కుటుంబంలో ఇద్దరే బిడ్డలు ముద్దని, ముగ్గురు వద్దనే కాలం పోయి ఒక్కరినే సరిపెట్టుకుందామనే కల్చర్ వచ్చాకా అందులో బాలికల శాతం మరింత తగ్గింది.

ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల కళకళలాడుతూ తిరుగుతుంటే మహాలక్ష్మీ తిరుగుతుందనేవారు. ఆనందించేవారు. మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెను భారంగానే భావిస్తున్నారు. వద్దనుకుంటున్నారు. పరిస్థితులకు భయపడి ఒక విధంగా ఆమె స్వేచ్ఛను హరిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

స్త్రీ సృష్టికి మూలం, జీవానికి జీవం. ఆమెలేనిదే.. భవిష్యత్ తరాలే లేవు. ప్రస్తుతం పురుషులతో సమమై ఆమె సాధించిన విజయాలు అనేకం. ఎందరో మగువలు, ధీరమహిళా మణులు యుగాల నుంచి పోరాట పటిమతో యుద్ధాలు సలిపిన వారు కొందరు, కవియిత్రులు, రాజ్యాలనేలిన మహారాణులు, వారి బాటలోనే ప్రపంచంలోనే ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకరు అధిరోహిస్తే, దేశ తొలి మహళా ప్రధానిగా వెలుగొందింది మరో మహిళ. క్రీడా రంగంలోను, సినీ రంగంలోను, యుద్ధ రంగంలోను, బౌన్సర్స్ గా, డాక్టర్స్ , న్యాయవాదులుగా ఇలా అన్ని రంగాలలోనూ ఇప్పుడు మహిళామణులున్నారు. అయినా ఇంకా ఎక్కడో ఒకచోట లింగ అసమానత ఆమెను పీడిస్తూనే ఉంది.

ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వైద్యం, భద్రత ఆమెకు కొరవడుతున్నాయనే చెప్పాలి. ఇంకా ఎక్కడో ఒకచోట, అణచివేతకు, అరాచకానికి ఆమె బలవుతూనే ఉంది. ప్రభుత్వాలు ఆడపిల్లలను రక్షించండి, భేటీ బచావో, భేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, CBSEఉడాన్ పథకాలు, బాలికలకు ఉచిత విద్య కళాశాలలు, విద్యాలయాలలో మహిళా రిజర్వేషన్లు అన్నీ బాలికల ఉన్నతికి, సాధికారతకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి. మరి ఇవి ఎంతవరకూ వారికి అందుతున్నాయి. బాగా చదువుకున్నా, విద్యావంతురాలైనా తగిన ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయా?

నేరాల చిట్టా లాగితే స్త్రీలపై జరిగేవే ఎక్కువ, వయసుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న నేరాలు, అత్యాచారాలు, అఘాయిత్యాల జాబితాలో ఆమె పేరే ఎక్కువ.. చాలా ఏళ్ళుగా ఈపరిస్థితులున్నా, మారుతున్న కాలంలో టెక్నాలజీ సాయంతో మరిన్ని నేరాలకు కారణమవుతుంది. నిర్భయ ఘటన తరువాత స్కూళ్ళల్లో ప్రవేశపెట్టిన కరాటే క్లాసులు ఇప్పుడు మచ్చుకైనా లేవు. స్కూళ్ళల్లో ట్యాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ఇంట్లో నీళ్ళు తాగడం తగ్గించి స్కూలుకువస్తున్నారు. దీనివల్ల కలిగే దుష్పభావాలలో ప్రధానమైనది. బలహీన మైన దేహాలు, బలహీనమైన సంతానం. రాబోవు తరాలను బలహీనులుగా చూడబోతున్నాం. చిన్న తప్పిదానికి, నిర్లష్యానికి అనారోగ్య వాతావరణంతో పాటు, అనారోగ్య భావితరం.

ఏది ఏమైనా ఆమెకు భద్రత కరువైంది. నిర్భయ, దిశ, శ్రద్ధావాకర్ ఇలా సంచనాలలో బలైపోతున్నదీ మహిళలే. ఒకప్పుడు వరకట్న చావులు ఎక్కువగా ఉండేవి. తరువాత ప్రేమ విఫలమైందని, మోసపోయామనే బాధితులు ఉండేవారు. ఇప్పుడు హింస కొత్త పంథాలను వెతుకుతూ అక్కడా ఆమెనే బలిచేయాలని చూస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య, తోబుట్టువులు ముఖ్యంగా ఆమె అన్నదమ్ములు, కన్న తండ్రి నుంచే వివక్షను, అభద్రతను ఎదుర్కొంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలలో జరుగుతున్న అనేక అత్యాచారాలు, పరువు హత్యలకు బలైపోతున్నది, ప్రాణాలు విడుస్తున్నది ఇదంతా చాలావరకూ అయినవారి చేతుల్లోనే బలైపోతుంది. ఇంకెన్ని చట్టాలు, ఇంకెన్ని స్పెషన్ న్యాయస్థానాలు పుట్టుకొచ్చి ఆమె పరిస్థితిలో మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే.

అవగాహన రావాలి..

ఆమెను ఒక సాధికార శక్తిగా తయారుచేసే బాధ్యత సమాజం మీద, ముఖ్యంగా తల్లిమీదనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు తల్లి, నాయనమ్మలు, అమ్మమ్మల రక్షణ ఆలనా, పాలనా అవసరం. స్కూళ్ళల్లో మహిళా టీచర్ల రక్షణ ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించిన అవగాహనను చిన్నవయసు నుంచే ఇంట్లో, పాఠశాలలోనూ కల్పించాలి. ముఖ్యంగా ఇది ఇంట్లోంచే మొదలవ్వాలి.

1. చురుగ్గా మారి దృఢంగా మారేలా కరాటే, క్రీడలలో శిక్షణను ఇవ్వాలి.

2. సమాజంలో ఆడపిల్లకు కొత్త అవకాశాలు కల్పించాలి.

3. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతలను తొలగించాలి.

4. హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయాలి.

5. లింగ వివక్షపై పని చేసేలా, ప్రజలలో అవగాహన కల్పించాలి.

Updated Date - 2023-01-24T16:04:13+05:30 IST