కొత్తగా పెళ్లయిందా..? ఈ 5 అంశాల్లో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు తప్పవు.. విడిపోవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-02-21T16:07:48+05:30 IST
నెలలు కూడా గడవకముందే గొడవల గోడలు కట్టుకుని ఎడమొఖం, పెడమొఖం వేసుకుని
జీవితంలో పెళ్లికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. ఎంతో ఇష్టంతో చాలా ఆడంబరంగా పెళ్లి చేసుకుంటారు. నెలలు కూడా గడవకముందే గొడవల గోడలు కట్టుకుని ఎడమొఖం, పెడమొఖం వేసుకుని బంధాలను విచ్చిన్నం చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది విడాకులు తీసుకోవడానికి అవగాహనా లోపమే కారణం. కొత్త పెళ్ళైన వారు ఈ అయిదు అంశాలలో జాగ్రత్తగా ఉండకపోతే వారి మధ్య గొడవలు వచ్చేస్తాయి.. బంధం ఎంతో కాలం నిలబడకుండా విడిపోతారు. ఆ అయిదు ఏమిటంటే..
శరీర భాష..
అందరూ మనసుతోనూ.. అవగాహనతోనూ మాట్లాడుకుంటే బార్యాభర్తలు శరీరాలతో కూడా సంభాషిస్తారు. చెప్పడానికి కాస్త మొహమాటపడినా ఇదే నిజం. ఇద్దరి మధ్య శారీరక స్పందనలే.. వారిని మరింత దగ్గర చేస్తాయి. కారణాలు ఏమున్నా భార్యాభర్తలు శారీరక బంధానికి దూరం కాకూడదు. ముఖ్యంగా మహిళలు పిల్లలు పుట్టాక వారిని చూసుకుంటూ భర్తతో ఏకాంత సమయాన్ని గడపరు. ఇది భార్యాభర్తల మధ్య దూరానికి, ఆ దూరం మనస్పర్థలకు కారణం అవుతుంది.
విలువ వ్యత్యాసం
వేరు వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా ఏర్పడిన తరువాత వారిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారు పైకి తాము ఆదర్శవివాహం చేసుకున్నామని చెప్పినా వారు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య అవగాహన ఎంతో ముఖ్యం. అలవాట్లు, ఆచారాలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.
ఒత్తిడి కత్తి..
మనుషుల జీవితాల్లో ఒత్తిడి అనేది పెద్ద కత్తిలాంటిది. వైవాహిక జీవితంలో ఇలాంటి ఒత్తిడికి మొదటి కారణం ఆర్థిక విషయాలు. అదే విధంగా ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త ఎక్కువ పరిణితి, ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉంటారు. ఇలాటి వారిని చూసి తమలో తాము అసూయ పడటం, అది క్రమంగా ఒత్తిడికి దారి తీయడం చేస్తే ఆ తరువాత వివాహ బంధానికి సమస్య అవుతుంది. ఇద్దరూ పరిష్కరించుకోలేకపోతే కనీసం సైకాలజిస్ట్ సహాయం తీసుకుని ఒత్తిడిని అధిగమించాలి.
ఇష్టమూ..మార్పు..
పెళ్లి చేసుకున్నాక ఒకరి మీద మరొకరికి ఇష్టం ఉంటుంది. అయితే కాలంతో ఈ ఇష్టాలు కొన్ని నచ్చకుండా పోతాయి. అలాంటి సమయాల్లో భాగస్వామి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తారు చాలామంది. కొందరు తమకోసం మారమని ఒత్తిడి చేస్తారు. కానీ అది తప్పు.. భాగస్వామిని వారిలాగే అంగీకరించాలి, వారిని మార్చుకోవడానికి ప్రయత్నించేకొద్ది వారు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తారు. దాంతో దూరమైపోతారు.
స్వార్థం..
భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండాలి. ఎవరో ఒకరు కాస్త స్వార్థంగా ప్రవర్తించినా ఆ బంధంలో సమస్య మొదలైనట్టే. భార్యాభర్తలన్నాక స్వార్థం కూడా కాస్త కనిపిస్తుంది. కానీ అతిగా స్వార్థం ప్రదర్శించడం అంటే భాగస్వామి జీవితాన్ని లాగేసుకోవడమే. మీ జీవితానికి, ఇష్టాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితానికి వారి ఇష్టాలకు అంతే విలువ ఇవ్వాలి.
ఈ అయిదు విషయాలు తెలుసుకుంటే వైవాహిక బంధం దృఢంగా మారుతుంది. తెలుసుకోకపోతే పెళ్ళి కాస్తా పెటాకులు అవుతుంది.