Bangaluru city: కుటుంబంతో ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే...
ABN , First Publish Date - 2023-04-11T11:27:45+05:30 IST
రోడ్డు మధ్యలో నిలబడి ఒక రాయి పైకి విసిరితే... అది కచ్చితంగా ఒక ఐటీ ఉద్యోగి తల మీదే పడుతుందనే జోక్ కూడా ఉంది. ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకుని ఆంక్షల నడుమ బతకాల్సిందే...
పెన్షనర్ల స్వర్గధామం (pensioner's paradise)గా 2000వ దశకం ప్రధమార్థం వరకూ పేరొందిన బెంగళూరు నగరం ఆ రోజుల్లో ప్రశాంత వాతావరణానికి ప్రతిబింబంగా వెలుగొందింది. అందాల ఉద్యానవనాలు, ముచ్చటైన కాటేజీలు, బ్రిటిష్ కాలపు భారీ బంగ్లాలతో ఒకప్పుడు అలరారిన పట్టణం అది. అందరి మధ్యా ఆత్మీయ పలకరింపులు ఉండేవి. పిల్లలు(children) పార్కుల్లో ఆడుకునేవారు. తక్కువ ట్రాఫిక్ వల్ల వీధుల మధ్యలో క్రికెట్ మ్యాచ్‌లు(cricket match) జరిగేవి. అనంతర కాలంలో అభివృద్ధి పేరిట చోటుచేసుకున్న పరిస్థితులు, సిలికాన్ వ్యాలీగా మారాక అన్ని వర్గాల్లోను పెరిగిపోయిన వ్యాపారాత్మక ధోరణితో బెంగళూరువాసుల్లో "బెంగ" ఎక్కువైంది.
బెంగళూరు నగరం ఐటీకి కేంద్రంగా రూపుదిద్దుకున్న తర్వాత మహానగరంగా కొత్త అవతారమెత్తింది. రోడ్డు మధ్యలో నిలబడి ఒక రాయి పైకి విసిరితే... అది కచ్చితంగా ఒక ఐటీ ఉద్యోగి తల మీదే పడుతుందనే జోక్ కూడా ఉంది. ఆ స్థాయిలో ఇక్కడ ఐటీ ఉద్యోగులున్నారు. దేశవిదేశాల కంపెనీల కోసం యువతరం రాత్రంతా పనిచేస్తూ ఈ నగరాన్ని నిద్రపోని నగరంగా మార్చారు. బెంగళూరువాసులు (Bangaloreans) మునుపెన్నడూ చూడనంత జీతాలు అందుకుంటున్నా... ఉండటానికి కనీసం ఒక గదిని సంపాదించడం పెద్ద ప్రాజెక్ట్ వర్క్‌లాగా మారిపోయింది. ఇక కుటుంబంతో నివసించడానికి అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకోవాలంటే ఆస్తులు అమ్ముకుని ఆంక్షల నడుమ బతకాల్సిందే... ముందు ఆ సంగతులు చూద్దాం.
ఇవి కూడా చదవండి...
మెదడును శాశ్వతంగా దెబ్బ తీసే ఈ వ్యాధి గురించి మీకు తెలుసా?
శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో భోజనంపై ప్యాసింజర్ ట్వీట్.. నెట్టింట్లో ఫొటో వైరల్
అద్దెలు... ఆంక్షలు...
బెంగళూరు ఐటీ హబ్‌గా మారి ఐటీ ఉద్యోగుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటంతో నగరంలో అద్దెలు 40 శాతం పెరిగాయి. ఎక్కువ అద్దెకోసం వేలంపాటలు (Auctions) కూడాను... ఎలాగోలా అద్దె ఇల్లు దొరికినా అగ్రిమెంట్ల (Agreements) పేరుతో ఇంటి యజమానులు విచిత్రమైన షరతులు విధిస్తున్నారు. మనీకంట్రోల్ సంస్థ సర్వేలో తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరులోని కొందరు ఇంటి యజమానులు.. మహిళలకు ఇల్లు అద్దెకు ఇచ్చిన సందర్భంలో వారితో చట్టబద్ధమైన భర్తలు మాత్రమే ఇంటిలో ఉండాలనే నిబంధన పెడుతున్నారు. ఇంటి యజమానులు తమ ఇంటి తనిఖీ కోసం ఎప్పుడైనా వచ్చే హక్కు కలిగివుంటారు. మాంసాహారాన్ని అనుమతించినప్పటికీ, గొడ్డు మాంసంపై నిషేధం విధించారు. కొన్నిచోట్ల పెంపుడు జంతువులు కలిగినవారికి ఇల్లు అద్దెకు ఇవ్వబోమని చెబుతున్నారు. బ్యాచ్‌లర్స్‌కు ఇళ్లు అద్దెకు దొరకడం ఇంకా నరకం. కాగా కొంతమంది అద్దెదారులు ఇంటి యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందంలోని వివరాలను క్షుణ్ణంగా చదవకపోవడంతో ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే కొందరు ఇంటి యజమానులు అధిక డిపాజిట్‌పై ఆశతో మధ్యలోనే మరో అద్దెదారుతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి నిర్మాణదశలో ఉన్న ఇళ్లను కూడా అద్దెకిస్తుండటంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. కొంతమంది ఇంటి ఓనర్లు అద్దె ఒప్పందాలను (Tenancy agreements) ఉల్లంఘిస్తూ ఉన్నట్టుండి విపరీతంగా అద్దె పెంచేస్తున్నారు. అలాగే ఇల్లు ఖాళీ చేసినప్పుడు తిరిగి పెయింట్ చేయించాలనే నిబంధనతో పాటు బంధువులు రాకూడదని, పెట్స్ ఉండకూడదని, మద్యపానం లేదా ధూమపానంపై కూడా ఇంటి యజమానులు పలు నిబంధనిలు విధించారు. ఇళ్ల కోసం వెదుక్కుంటున్న మరికొందరు మతపరమైన వివక్షకి కూడా గురవుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బ్యాచ్‌లర్స్‌కు ఇళ్లు అద్దెకు దొరకడం ఇంకా నరకం.
కన్నడ మాట్లాడకపోతే దాడులేనా?...
ఇంటర్నేషనల్ సిటీగా మారిన బెంగళూరు నగరానికి దేశవిదేశాల్లోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, భాషలకి చెందినవారు వస్తుంటారు. స్థానిక భాష అయిన కన్నడం అందరూ మాట్లాడలేరు. ఈ రోజుల్లో స్థానిక విద్య సైతం ఇంగ్లీష్ వైపు మళ్లుతున్న పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి కన్నడపై కచ్చితంగా ఆవగాహన ఉండదు. కానీ, కన్నడలో మాట్లాడలేదన్న కారణంతో కన్నడేతరులపై తరచుగా దూషణలు, దాడులు జరగడం బెంగళూరు ప్రతిష్టకు మచ్చగా మారింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నవారిలో పోలీస్ శాఖవారు కూడా ఉండటం మరీ దారుణమని బాధితులు వాపోతున్నారు. తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసు.. కారు డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఒక జిమ్ ట్రైనర్ ఇక్రమ్ అన్సారీ తనకు ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. కార్ పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులకు, ఇక్రమ్ అన్సారీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అన్సారీ కన్నడలో మాట్లాడ లేకపోవడం గురించి కూడా పోలీసులు చులకనగా మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి సంఘటనలు పదే పదే చోటు చేసుకుంటున్నాయి.
నిద్రలేని యువతరం...
మరోవైపు బెంగళూరు నగరంలో జరిగే వారాంతపు పార్టీలకు లెక్కేలేదు. యువతలో విచ్చలవిడితనం అంతకంతకూ పెరుగుతూ నైట్ లైఫ్ విస్తరిస్తోంది. పరిచయాలు పక్కదార్లు పడుతూ నేరాలకు దారి తీస్తున్నాయి. ఇంకోపక్క ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో కొనసాగుతున్న లేఆఫ్‌ల ప్రభావం బెంగళూరు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగభద్రతతో ముడిపడిన ఈ పరిణామం వల్ల నగర యువతరంలో దాదాపు 30 శాతం మంది రాత్రివేళ నిద్రకు దూరమై ఇన్‌సోమ్నియాతో బాధపడుతున్నారని, ఇది భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక బెంగళూరు రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య నియంత్రించలేనంతగా పెరిగిపోవడం, ప్రతి వీధి కూడలిలో ప్లాస్టిక్ పర్వతాలు పేరుకుపోవడం, నగరం ఇప్పుడు చెత్త కంపు కొడుతుండటం తరహా ఫిర్యాదులు ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్నవే...
ఒకనాడు నగరం మొత్తం ఒక అందమైన పూదోటగా పరిమళాలు వెదజల్లుతూ పెన్షనర్ల స్వర్గధామంగా వర్ధిల్లిన బెంగళూరు నగరం నేడు ఈ స్థితికి రావడం ముఖ్యంగా పాతతరం పెద్దల్ని కలచివేస్తోంది. తమ కళ్లముందే నగరపు అందాలు, ఒకనాటి అనుబంధాలు, బాంధవ్యాలు కరిగిపోతూ యాంత్రిక జీవనం సాగుతుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆధునికత అంటే డబ్బు, బంగళాలు, మల్టీఫ్లోర్ ఆఫీసులు కాదంటున్న ఆ పెద్దలు కోరుకునే బెంగళూరు పునర్నిర్మాణం కావాలని కోరుకుందాం.