జనం ఆ నగరానికి వచ్చి చావు కోసం ఎదురు చూస్తుంటారు.. రాబోయే రోజుల్లో నివాసానికి ఇంచు ఖాళీ కూడా దొరకకదట!
ABN , First Publish Date - 2023-04-30T07:48:07+05:30 IST
హిందువులకు నిలయమైన భారతదేశం ఒక ఆధ్యాత్మిక సాగరం(spiritual ocean). ఇక్కడ భక్తి, ముక్తి బాటలో నడిచేవారు అనేకులు ఉన్నారు.
హిందువులకు నిలయమైన భారతదేశం ఒక ఆధ్యాత్మిక సాగరం(spiritual ocean). ఇక్కడ భక్తి, ముక్తి బాటలో నడిచేవారు అనేకులు ఉన్నారు. మోక్షం కోసం పరితపించేవారి విషయానికొస్తే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దేశంలో మోక్షాన్ని అందించే నగరాల్లో కాశీ అంటే వారణాసి(Varanasi) ఒకటని చెబుతారు.
దీంతో ఇక్కడికి వచ్చి తమ చివరి రోజులను గడపాలని చాలామంది భావిస్తుంటారు. వారణాసికి వచ్చి ముముక్షువులు మృత్యువు(death) కోసం వేచి ఉండే ప్రదేశాన్ని ముముక్షు భవన్ అని అంటారు. ముముక్షు భవన్ 1920వ సంవత్సరంలో వారణాసిలో ఏర్పాటయ్యింది. ఇక్కడ ఒకేసారి 80 నుంచి 100 మంది వరకు ఉండవచ్చు. ఇక్కడ ఉండేందుకు ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు(applications) వస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కువ మందికి ఇక్కడ స్థలం లేకపోవడంతో చాలా మంది నిరాశ చెందుతున్నారని తెలిపారు.
నిజానికి వారణాసి భారతదేశం(India)లోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక నగరంగా గుర్తింపు పొందింది. ఈ నగరం శివుని నివాసమని అంటారు. ఇక్కడి పుణ్యభూమికి ఎంతో శక్తి ఉందని, ఇక్కడ మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి వేల మంది తమ జీవితపు చివరిదశలో తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ఇక్కడకు వస్తుంటారు. విదేశాల్లోనూ హిందూధర్మాన్ని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ నేపధ్యంలోనే మృతుల అస్థికలను వారణాసి తీసుకొచ్చి, ఇక్కడి గంగలో నిమజ్జనం(Immersion) చేస్తారు. అలాచేస్తే వారు మోక్షాన్ని పొందుతారని భావిస్తారు.
కాగా వారణాసి చుట్టుపక్కల గల జిల్లాల్లోని ప్రజలు తమ బంధువుల మృతదేహాలను వారణాసికి తీసుకువచ్చి అంత్యక్రియలు(funeral) నిర్వహిస్తారు. ఈ తతంగం మృతులకు మోక్షం అందించే ఉద్దేశంతోనే జరుగుతుంది. ఎవరైనా సరే వారణాసికి వెళ్లి, ఏదైనా ఘాట్ సమీపంలో కూర్చుంటే, మృతదేహాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటాన్ని గమనించవచ్చు. వారణాసిలో మొత్తం 84 ఘాట్‌లు(Ghats) ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సాధువులు(Saints) ఈ నగరంలోనే కనిపిస్తారు.