Bride: ఆ అమ్మాయే కావాలంటూ 13 రోజుల పాటు వధువు ఇంట్లో వరుడు మకాం.. కాసేపట్లో పెళ్లనగా వధువు వెళ్లిపోవడంతో..!
ABN , First Publish Date - 2023-05-30T15:32:29+05:30 IST
పెళ్లి చేసేటప్పుడూ అమ్మాయి.. అబ్బాయికి నచ్చితేనే పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. నచ్చలేదంటే అక్కడితోనే ముగింపు చెప్పేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఒకవేళ కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. అటు తర్వాత పెళ్లి
పెళ్లి చేసేటప్పుడూ అమ్మాయి.. అబ్బాయికి నచ్చితేనే పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. నచ్చలేదంటే అక్కడితోనే ముగింపు చెప్పేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఒకవేళ కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. అటు తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని వివాహం చేస్తారు. తీరా.. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కూడా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య తాళి కట్టే సమయంలో కూడా చాలా పెళ్లిళ్లు రద్దు అయిపోయిన సంఘటనలు వారల్లో చూశాం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? తాజాగా జరిగిన ఓ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది.
వాళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇక పెద్దలు పెట్టిన ముహూర్తానికే ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన మండపానికి అందరూ చేరుకున్నారు. ఓ వైపు మేళతాళాలు.. ఇంకోవైపు డీజే సౌండ్స్.. వచ్చిన బంధుమిత్రులతో కళ్యాణ వేదిక సందడి సందడిగా ఉంది. మరికాసేపట్లో పెళ్లి అనగానే అంతా కలకలం. అంతటా ఒకటే అలజడి. ఏంటీ? అని అందరూ ఆరా తీస్తే.. వధువు (Bride) కనిపించట్లేదని తెలిసింది. ఏమైంది? అని వాకబు చేస్తే షాకింగ్ విషయం తెలిసి అంతా అయోమయానికి గురయ్యారు.
మరికొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ప్రారంభమవుతుందనగా ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి.. ముస్తాబైన వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటనతో మగపెళ్లి వారు రద్దు చేసుకుని వెళ్లిపోతారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వరుడు ఏ మాత్రం ఆందోళన చెందకుండా అక్కడనే ఉండిపోయాడు (wedding hall). దీంతో పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఇలా దాదాపు 13 రోజుల (13 days) పాటు వధువు ఇంట్లోనే ఉండి పోయాడు. వెళ్లిపోయిన వధువు కోసం వేచి చూసి.. ఆమె వచ్చాక పెళ్లాడిన వింతైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని (Rajasthan) సైనా గ్రామంలో మనీషా, శ్రావణ్ కుమార్ అనే వధువరులకు మే 3న పెద్దలు వివాహం నిశ్చయించారు. కొద్ది నిముషాల్లో పెళ్లి అనగా మనీషా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆరా తీస్తే వధువు ప్రియుడితో పారిపోయినట్లు తెలిసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. కానీ పెళ్లికొడుకు మాత్రం.. మనీషా తిరిగి ఇంటికి వస్తే ఆమెనే వివాహం చేసుకుంటానంటూ శ్రావణ్ కుమార్ భీష్మించికుని అక్కడినే కూర్చుండిపోయాడు. ఇలా ఆమె కోసం వారి ఇంట్లోనే 13 రోజుల పాటు ఉండిపోయాడు. అలంకరించిన పెళ్లి మండపాన్ని కూడా అలాగే ఉంచారు. మరోవైపు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని వెళ్లిపోయిన వధువు కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని మే 15న తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత ఆమెను ఒప్పించి శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా మే 16న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. దీంతో పెళ్లి కథ సుఖాంతమైంది.