Relationship: మీరూ ఈ తప్పులు చేస్తుంటారా? భార్యాభర్తలు చేసే ఈ 5తప్పులే వారి బంధాన్ని ముంచుతున్నాయ్..!
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:53 PM
భార్యాభర్తలు చాలా కామన్ అనుకుంటూ చేసే 5 తప్పులు వారి బంధం తొందరలోనే విచ్చిన్నం కావడానికి కారణమవుతాయి.
భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి చాలా విశిష్ట స్థానం ఉంది. వైవాహిక జీవితం సజావుగా సాగుతుందా లేదా అనేది ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ, త్యాగం, క్షమించే గుణం మొదలైన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. బంధంలో ఇవన్నీ ఉంటే ఆ జంటలు ఎంత క్లిష్టపరిస్థితులలో అయినా ప్రేమగా, ఒకరికొకరు ధైర్యం ఇస్తుంటారు. అదే విధంగా బంధం దృఢంగా లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. భార్యాభర్తలు చాలా కామన్ అనుకుంటూ చేసే 5 తప్పులు వారి బంధం తొందరలోనే విచ్చిన్నం కావడానికి కారణమవుతాయి.
కోపం..
చాలామంది ఒకచోట కోపాన్ని మరొకచోట చూపిస్తుంటారు. ఆఫీసులో బాస్ కు ఎదురుచెప్పలేని నిస్సాహయత, బంధువుల ముందు ఏమీ అనలేని మొహమాటం, ఆర్థిక విషయాలలో ప్రమేయం లేకపోయినా ఆ భారాన్ని మోసే పరిస్థితులు.. ఇలాంటి కారణాల వల్ల చాలామంది మనసులో కోపం, అసహనం తారాస్థాయిలో ఉంటుంది. జీవిత భాగస్వామి సరదాగానో, సాధారణంగానో ఏదైనా అడిగినప్పుడు, చెప్పినప్పుడు వాళ్ల మీద తీవ్ర కోపం చూపిస్తుంటారు. ఇలా ఒకరి మీద ఉన్న కోపం భాగస్వామి మీద చూపించడం అస్సలు మంచిది కాదు. ఇది బంధాన్ని పేలవంగా మార్చుతుంది. ఇద్దరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఇది కూడా చదవండి: రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!
ఇష్టాఇష్టాలు..
చాలామంది నా ఇష్టాలు నేను వదులుకోలేను. ఇది ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నాకు ఇష్టం అంటూ ఉంటారు. భాగస్వాములు కూడా తమకు నచ్చినట్టు మారాలని అనుకుంటూ ఉంటారు. కానీ వైవాహిక బంధం అన్నాక ఇతరుల అభిరుచులు, ఇష్టాఇష్టాలు కూడా తెలుసుకుని మెలగాలి. లేకపోతే బంధం బలహీనపడుతుంది.
అలవాట్లు..
అలవాట్లు మంచివి అయితే పర్లేదు. కానీ మద్యం సేవించడం, చీటికి మాటికి బయటకు వెళ్లడం, షాపింగ్ లోనే సంతోషాన్ని చూసుకోవడం, స్నేహితులతోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడటం వంటి అలవాట్లు భాగస్వాములకు ఇద్దరికీ మంచిది కాదు. కొందరు ఈ అలవాట్లతో తమ దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ భాగస్వామికి ఇష్టం లేకుండా వీటిని పాటిస్తే అది బంధం విడిపోవడానికి బీజం వేసినట్టే.
ఇది కూడా చదవండి: ఇవి అలవాటు చేసుకుంటే.. కొత్త ఏడాదిలో మీరే కింగ్..!
చిన్నవిషయాలకే..
చిన్నవిషయాలకు కూడా గట్టిగా అరవడం, సీరియస్ అవ్వడం, కొంపలు మునిగిపోయినంత ఆవేశం తెచ్చుకునే స్వభావం కొందరిలో ఉంటుంది. ఇది ఎదుటివారిని చాలా బాధకు గురిచేస్తుంది. ఇలాంటి వాళ్ళతో బ్రతకలేం అనే ఫీలింగ్ పుట్టేలా చేస్తుంది. ఇలాంటి స్వభావం మీలోనూ ఉన్నట్టైతే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే బంధం ఎక్కువ రోజులు నిలవదు.
అనుమతి..
స్నేహితులను, బంధువులను, కనీసం తల్లిదండ్రులను కలవడానికి కూడా కొందరు పంతంతో ఉంటారు. తన అనుమతి లేకుండా ఏదీ జరగకూడదు అని అంటారు. ఇలా ప్రతి విషయానికి తన అనుమతి తీసుకోవాలనే స్వభావం ఉన్న భాగస్వామితో కలసి జీవించడం చాలా కష్టంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Ayurveda: చలికాలంలో జ్యూసులు తాగడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.