Happy Siblings Day 2023: రామాయణం ఇలాంటి వాళ్ల గురించి ఎంత గొప్పగా చెప్పిందంటే..
ABN , First Publish Date - 2023-04-10T13:45:00+05:30 IST
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా రూపుమార్చుకుంటున్నాయి.
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటి కాలంలో మనుషుల మధ్య సంబంధాలు మారుతూ వస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా రూపుమార్చుకుంటున్నాయి. అమ్మానాన్నల నుంచి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ వరకూ అందరి మధ్యలో ఉండే అనురాగం, ఆప్యాయతల మధ్య మార్పు వస్తూనే ఉంది. చిన్న విషయాలకే ఒకరితో ఒకరు విభేదాలు పెంచుకుని దూరం అవుతున్నారు. మానవ సంబంధాలను ప్రభావితం చేసే పురాణ ఇతిహాసాలలో ముఖ్యంగా రామాయణం ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమాభిమానల గురించి గొప్పగా వివరిస్తుంది. ముఖ్యంగా తోబుట్టువుల గురించి రామాయణం వివరించినంతగా మరో పురాణం చెప్పలేదు. అందులోని విశేషాలను తెలుసుకునే ముందు ఈరోజు తోబుట్టువుల దినోత్సవంగా మన తోబుట్టువులకు శుభాకాంక్షలు తెలుపుకుందాం.
మేఘనాధుడుతో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్ర ప్రయోగంతో మూర్ఛపోతాడు. మూర్చిల్లిన తమ్ముడిని చూసి రాముడికి ఎక్కడలేని దుఃఖంతో, సుశేషునితో తన బాధను ఇలా చెప్పాడు. "నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతుంది. అతడు నా తోబుట్టువు నా జీవితానికి, నా సంతోషానికి అర్థమేముంది. ఇలాంటి స్థితిలో నేను ఏం చేయలేకపోతున్నాను. నా వీరత్వం, నా ధనుస్సు, బాణాలు జారిపోతున్నాయి. చేతులు పట్టుతప్పుతున్నాయి. కళ్ళు కన్నీటితో నిండి ఏదీ కనిపించకుండా పోతుంది. తనలోంచి శక్తినంతా లాగేసినట్టుగా ఉందని రాముడు విలపించాడు. ఇంత విజయమూ నాకు తృప్తినివ్వడంలేదు. కంటి చూపు లేనివాడికి వెన్నెల ఆనందాన్ని ఇవ్వనట్టుగా ఉంది నాపరిస్థితి, ఈ విజయం నువ్వులేనపుడు నాకు ఎందుకు? వనవాసానికి ముందు నువ్వు నన్ను అనుసరించినట్టుగా నువ్వు గానీ మరణిస్తే నేను నిన్ను అనుసరిస్తానని" ఎంతో రోధించాడు. తోబుట్టువుల అన్యోన్యతకు నిదర్శనంగా నిలిచిన రామలక్ష్మణుల కథ ఇది.
ఇప్పటి వారిలోనూ అంతటి ఆదర్శ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి కుటుంబంలోనూ ఎక్కడో ఉండే ఉంటారు. కాకపోతే సెలబ్రెటీల గురించి మాత్రమే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం అలా చెప్పాల్సి వస్తే.. ఎన్టీఆర్, త్రివిక్రమరావు ఈ ఇద్దరూ ఒకరికి ఒకరుగా మెలిగారు. ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న రోజుల్లో అన్నకు తమ్ముడు తోడుగా ఉండి బాధ్యతలు పంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఇంటికి వీధిపోటు ఉండటం మంచిదేనా? వీధిపోటు ఉంటే ప్రాణనష్టం తప్పదా?
అలాగే ఎమ్.జి.ఆర్ కి ఆయన అన్న చక్రపాణి తోడుగా ఉండి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానంలో చేదోడువాదోడుగా కలిసి నడిచాడు. ఇప్పటి గాయకులు కూడా ఇదే పంధాలో వెళుతున్నవారు చాలామందే ఉన్నారు. హైదరాబాద్ సిస్టర్స్, లలిత, హరిప్రియ ఇద్దరూ ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకుంటూ గాయనీమణులుగా కొనసాగుతున్నారు.
అలాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, డి.శేషాచారి కర్ణాటక సంగీత గాన ద్వయం కూడా భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో కొనసాగుతున్నారు. ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకుంటూనే గాయకులుగా కొనసాగుతున్నారు.
ప్రియా సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన షణ్ముఖప్రియ, హరిప్రియ ఇద్దరూ కూడా కర్ణాటక సంగీతంలో నిష్టాతులుగా కొనసాగుతూ, సంగీత ప్రియులను అలరిస్తున్నారు. అప్పటి వారే కాదు ఇప్పటి వాళ్ళలో కూడా తోబుట్టువులంటే ఉన్న ప్రేమను ఇప్పటి కాలానికి తగ్గట్టు సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తున్నారు వారిలో ప్రముఖ నటీమణులు సాయిపల్లవి, ఆమె చెల్లెలితో, అనుపమ పరమేశ్వరన్ తన తమ్ముడితో కలిపి దిగిన ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ వారి మధ్య ఉన్న ప్రేమాను రాగాలను చాటుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా దొరకని ఒకే ఒక బంధం తోబుట్టువులు మాత్రమే.