Smartwatch: యూకే సీఈఓ ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్.. ఎలాగంటే?
ABN , First Publish Date - 2023-11-09T18:42:42+05:30 IST
CEO Paul Wapham: ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో మనకెంత నష్టం వాటిల్లుతోందన్న సంగతిని పక్కన పెట్టేస్తే.. అప్పుడప్పుడు కొంత మైలేతే జరుగుతోంది. ముఖ్యంగా.. స్మార్ట్‌వాచ్‌లు మనుషుల ప్రాణాల్ని కాపాడుతున్నాయి. ఆయా వ్యక్తుల్లో ఉండే ఆరోగ్య సమస్యల్ని ఇవి ముందుగానే పసిగట్టి..
CEO Paul Wapham: ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో మనకెంత నష్టం వాటిల్లుతోందన్న సంగతిని పక్కన పెట్టేస్తే.. అప్పుడప్పుడు కొంత మైలేతే జరుగుతోంది. ముఖ్యంగా.. స్మార్ట్‌వాచ్‌లు మనుషుల ప్రాణాల్ని కాపాడుతున్నాయి. ఆయా వ్యక్తుల్లో ఉండే ఆరోగ్య సమస్యల్ని ఇవి ముందుగానే పసిగట్టి.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా యూకేలోనూ అదే జరిగింది. గుండెపోటుతో ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు.. అతని చేతికున్న స్మార్ట్‌వాచ్ అతడ్ని కాపాడింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన పాల్ వాఫమ్ అనే 42 ఏళ్ల వ్యక్తి హాకీ వేల్స్ అనే కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు నిత్యం జాగింగ్ చేసే అలవాటు ఉంది. ఎప్పట్లాగే ఇటీవల ఒక రోజు ఉదయం 7 గంటలకు పాల్ జాగింగ్‌కి వెళ్లాడు. అయితే.. కొన్ని నిమిషాల్లోనే అతని ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల సహాయం కోసం ఏ ఒక్కరూ లేరు. అప్పుడు పాల్ వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ సహాయంతో భార్య లారాకు ఫోన్ చేశాడు. మరో క్షణం ఆలస్యం చేయకుండా ఆమె ఐదు నిమిషాల వ్యవధిలోనే భర్త వద్దకు చేరుకుని, తన కారులోనే ఎక్కంచుకొని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బంది అతనికి అంతే వేగంగా చికిత్స అందించింది. దీంతో.. ఆ సీఈఓ ప్రాణాలతో బయటపడ్డాడు. స్మార్ట్‌వాచ్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నాడు.
కాగా.. పాల్ వాఫమ్ ధమనుల్లోని ఒక దాంట్లో ‘బ్లాకేజీ’ కారణంగా గుండెపోటు వచ్చినట్టు ఆసుపత్రిలో తేలింది. అక్కడే ఆయనకు శస్త్రచికిత్స అందించారు. ఆరు రోజుల తర్వాత ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎదురైన ఈ సంఘటన ప్రతిఒక్కరినీ షాక్‌కి గురి చేసిందని పాల్ తెలిపాడు. తాను బరువుగా లేనని, ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేస్తానని.. అలాంటి తనకు గుండెపోటు రావడంతో తనతో పాటు తన ఫ్యామిలీ షాక్‌కు గురైందని చెప్పాడు. తన భార్య, ఆసుపత్రి సిబ్బంది అండగా ఉన్నందుకు పాల్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా.. స్మార్ట్‌వాచ్‌ల్లో హార్ట్ రేట్, ఈసీజీలను కొలిచే సెన్సార్‌లు ఉంటాయి. వాటి ద్వారా అవి ముందుగానే ముప్పును గుర్తించి.. ప్రజల్ని కాపాడుతున్నాయి. సో.. ఈ కోణంలో టెక్నాలజీ మానవునికి ఎంతో ఉపయోగకరమైంది.