Soldier Marriage: శభాష్ సైనికా.. తన పెళ్లికి వచ్చిన బంధువులందరి ముందే ఈ సైనికుడు చేసిన పనేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-02-24T17:54:39+05:30 IST
పెళ్ళికి హాజరైన బంధుమిత్రుల ముందే తన ఆదర్శాన్ని చాటుకున్నాడు.
ఇప్పటి కాలంలో చాలా మంది యువత ఆదర్శభావాలు కలిగి ఉంటున్నారు. తాము చేసే ప్రతి పని ఎంతో ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తే ఈ సైకుడుడు కూడా.. ఇతను బంధుమిత్రులను ఆహ్వానించి ఎంతోఘనంగా పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి హాజరైన బంధుమిత్రుల ముందే తన ఆదర్శాన్ని చాటుకున్నాడు. ఇతను చేసిన పనికి బంధుమిత్రులే కాదు నెటిజన్లు కూడా శభాష్ అంటున్నారు. ఇంతకూ ఇతనెవరు అంత గొప్ప పని ఇతను ఏం చేశాడు తెలుసుకుంటే..
రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లా జైతరణ్ లో ఆర్మీ జవాన్ అమర్ సింగ్ వివాహం జరిగింది. అమర్ సింగ్ డెహ్రడూన్ ఆర్మీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి భన్వర్ సింగ్ తన్వర్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేస్తున్నాడు. కాగా అమర్ సింగ్ తాత బహదూర్ సింగ్ తన్వర్ కూడా ఆర్మీలో పనిచేసిన వాడే. 1971లో ఇండో-పాక్ యుద్దంలోనూ, 1965లో ఇండో-చైనా యుద్దంలోనూ ఈయన పాల్గొన్నాడు. ఇలా అమర్ సింగ్ కుటుంబం మూడు తరాలు దేశసేవలో ఉంది. అమర్ సింగ్ కు ప్రేమ్ సింగ్ షెకావత్ అనే వ్యక్తి కూతురు బబితా తో వివాహం కుదిరింది. రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లాలో జైతరణ్ లో ఈ పెళ్ళి జరిగింది.
రాజ్ పుత్ వంశస్తుల ఆచారం ప్రకారం పెళ్ళయ్యి వధూవరులు ఏడడుగులు వేశాక వరుడికి వధువు తండ్రి కట్నంలాగా డబ్బు ఇస్తాడు. అయితే అమర్ సింగ్ ఈ డబ్బును తన మామగారి దగ్గర నుండి తీసుకుని మళ్ళీ ఆయనకు తిరిగి ఇచ్చేశాడు. 'నాకు చదువుకున్న మీ అమ్మాయి భార్యగా వచ్చింది చాలు, ఆచారం పేరుతో ఆడపిల్లల తండ్రులకు ఆర్థిక భారం మీద పడకూడదు' అని చెప్పాడు. ఇలా అమర్ తన మామగారికి ఇచ్చేసిన డబ్బు అక్షరాలా 11.5లక్షలు. అంత మొత్తాన్ని అతను సున్నితంగా తిరస్కరించి తన ఆదర్శాన్ని చాటుకున్నాడు. ఇతని మంచి మనసుకు బంధుమిత్రులు మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా ముచ్చటపడుతున్నారు.