Mother Video: చేపలు అమ్మే మహిళతో ఓ కుర్రాడు ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని బేరసారాలు.. మూడేళ్లుగా దుబాయిలో ఉన్న కొడుకు గుర్తుకొచ్చి..!

ABN , First Publish Date - 2023-09-25T20:23:23+05:30 IST

మూడేళ్ల తరువాత దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఓ కుర్రాడు తన తల్లికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కర్చీఫ్ ముఖానికి కట్టుకున్న కన్నబిడ్డను గుర్తించగా ఆమెలో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (viral video) మారింది.

Mother Video: చేపలు అమ్మే మహిళతో ఓ కుర్రాడు ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని బేరసారాలు.. మూడేళ్లుగా దుబాయిలో ఉన్న కొడుకు గుర్తుకొచ్చి..!

ఇంటర్నెట్ డెస్క్: చేపలు అమ్మే మహిళ వద్దకు వచ్చి ఓ కుర్రాడు బేరాలు ఆడటం మొదలెట్టాడు. అతడి వాలకం చూస్తే చేపలు కొనేటట్టు లేనప్పటికీ అతడి గొంతు మాత్రం ఎక్కడో విన్నట్టు అనిపించింది. మరి కాసేపు మాట్లాడగానే ఆమె అనుమానం బలపడింది. అతడి ముఖానికున్న మాస్కు తీసి చూడంగానే మహిళ ఆనందానికి అంతేలేకుండా పోయింది. కారణం.. ఎదురుగా ఉన్నది ఆమె కొడుకే.. దాదాపు మూడేళ్ల తరువాత అతడిని చూసి ఆమె సంతోషం అంబరాన్నంటింది. ఇటీవల కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఇది.


జిల్లాలోని గంగోలి గ్రామానికి చెందిన రోహిత్ దాదాపు మూడేళ్ల తరువాత తన స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇన్నాళ్లుగా రోహిత్ తల్లి అతడిని ఒక్కసారి కూడా చూడలేదు. దీంతో, తల్లికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా సొంతూరుకి తిరిగొచ్చాడు. అయితే, ఇంటికెళ్లి చూస్తే తల్లి కనబడలేదు. దీంతో, ఆమె చేపలు అమ్మే మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె బిజీబిజీగా కనిపించింది. దీంతో, మనోడు తల్లితో చేపలెంత అంటూ బేరాలు మొదలెట్టాడు. మరి ఆమె తల్లి కదా.. కొడుకు గొంతును ఇట్టే గుర్తుపట్టేసింది. వెంటనే మాస్కు తీసి చూస్తే ఎదురుకుండా కన్నకొడుకు కనిపించడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది(Son surprises mother).


ఆ తల్లిబిడ్డల అనుబంధం నెటిజన్లకు తెగ నచ్చడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బిడ్డల పట్ల తల్లికి ఉండే వాత్సల్యం ఇదీ అంటూ అనేక మంది కామెంట్ చేశారు. తల్లికి బిడ్డలకు మించిన ఆస్తి మరొకటి ఉండదంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. నెటిజన్లను అమితంగా కదిలిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Updated Date - 2023-09-25T20:27:06+05:30 IST